విభజన అంటేనే అతి పెద్ద తకరారు. ముందు ఉన్నది ఉన్నట్లుగా ఉంచేయమంటారు కొందరు సనాతనవాదులు. లేదు మాకు కావాల్సినట్లుగా ముక్కలు కొట్టండి అంటారు మరికొందరు అభ్యుదయవాదులు. ఇపుడు జిల్లాల విభజన మీద మేధావులు సిద్ధాంతాలతో పెద్ద యుధ్ధమే చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అతి ప్రాచీనమైనది, దాని వైభవాన్ని దెబ్బ తీస్తారా అని కొందరంటారు.
ఇక వెనకబడిన జిల్లాను పార్లమెంట్ ప్రాతిపదికగా విభజిస్తే మరింత అన్యాయం అవుతుందని అంటున్నారు ఇంకొందరు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల వంటివి విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. కొత్తగా వచ్చిన పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు అభివ్రుధ్ధి అంతా ఇక్కడే ఉంది.
పార్లమెంట్ పరిధి గా తీసుకుని వేరు చేస్తే శ్రీకాకుళానికి తీరని అన్యాయం జరుగుతుందని, మరింత వెనకబడిపోతుందని అంటున్నారు. దానికి విరుగుడుగా కొందరు మేధావులు కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల ప్రాతిపదికన జిల్లాల విభజన వద్దే వద్దు అంటున్నారు.
శ్రీకాకుళాన్ని మూడు జిల్లాలుగా చేయాలని, ఎచ్చెర్ల కేంద్రంగా ఒక జిల్లా, ఉద్ధానం కేంద్రంగా మరో జిల్లా, పాలకొండ కేంద్రంగా గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తేనే శ్రీకాకుళం అభివ్రుధ్ధి చెందుతుందని సూచిస్తున్నారు. అలా కాకుండా పార్లమెంట్ ప్రాతికనే విభజన అంటే ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇదేదో గొడవలాగానే ఉంది కానీ జగన్ సర్కార్ అనుకుంటున్నంత సులువుగా జిల్లాల విభజన తెగేటట్లు లేదన్న మాట వినిపిస్తోంది.