జర్నలిస్టుగా ఎంతోమంది బాధల్ని దగ్గరుండి చూశాడు. ఎన్నో క్రైమ్స్ ను తన చేతులతో కవర్ చేశాడు. వృత్తిగత జీవితంలో ఆయన చూడని కష్టం లేదు. అలాంటిది తన దగ్గరకొచ్చేసరికి మాత్రం తట్టుకోలేకపోయాడు. ఏకంగా పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జర్నలిస్ట్ శ్రీనివాస్ ఆత్మహత్య అందర్నీ ఎంతగానో కలిచివేస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా యానాంలో ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్న శ్రీనివాస్ 2014లో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకి ఐదేళ్ల కిందట కవలలు పుట్టారు. యానాంలోని తోటవారివీధిలో ఉంటున్న ఈ భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా మనస్పర్థలు చెలరేగాయి. కుటుంబ కలహాలే కావడంతో పెద్దలు సర్దిచెప్పారు.
అయితే కొన్ని రోజులుగా కలహాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. శుక్రవారం భార్యభర్తలిద్దరూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు.
కొద్ది రోజులకు అంతా సర్దుకుంటుందని సహచర జర్నలిస్టులు కూడా భావించారు. కానీ శ్రీనివాస్ మాత్రం సర్దుకోలేకపోయాడు. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పిల్లలిద్దర్నీ తీసుకొని బైక్ పై ఎదుర్లంక బాలయోగి బ్రిడ్జ్ పైకి చేరుకున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
బ్రిడ్జిపై నుంచి ఓ వ్యక్తి దూకడాన్ని చూసి కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, గోదావరిలో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ పిల్లలు, శ్రీనివాస్ ఆచూకి దొరకలేదు. ఈరోజు మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.