శ్రీకాకుళం జిల్లా పలాస పరిథిలో జరిగిన అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దృష్టిపెట్టారు. జేసీబీతో కరోనా మృతదేహాన్ని తరలించిన ఘటనపై బాధను వ్యక్తంచేసిన జగన్.. అమానవీయంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
“శ్రీకాకుళం జిల్లా, పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంతమంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృత్తం కాకూడదు. బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోకతప్పదు.”
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిథిలో అనారోగ్యంతా బాధపడుతూ 70 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించే ఏర్పాట్లలో బంధువులు ఉన్నారు. అంతలోనే పిడుగులాంటి వార్త. మరణించిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సమాచారం అందింది. అంతే.. అప్పటివరకు వెంట ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న అధికారులు.. కొంతమంది సిబ్బందికి ఆ మృతదేహం అంత్యక్రియలు బాధ్యత అప్పగించారు. పీపీఈ కిట్లు ధరించిన శానిటరీ సిబ్బంది, దగ్గర్లో వాహనం లేకపోవడంతో జేసీబీలో ఆ మృతదేహాన్ని తరలించారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టివరకు వెళ్లింది. అమానవీయంగా జేసీబీపై మృతదేహాన్ని తరలించిన ఘటనపై ముఖ్యమంత్రి బాధపడ్డారు.
జరిగిన ఘటనపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ దర్యాప్తు చేశారు. బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ నాగేంద్రకుమార్, శానిటరీ ఇన్స్ పెక్టర్ రాజీవ్ లను సస్పెండ్ చేశారు.