నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు.. నేను అందరివాడిని అని బిల్డప్ ఇస్తుంటారు పవన్ కల్యాణ్. కానీ సందర్భం వస్తే పవన్ కల్యాణ్ ఎవరో, ఏం చేస్తారో, ఆయనకి ఎలాంటి సంకుచిత మనస్తత్వం ఉందే ఇట్టే బైటపడిపోతుంటుంది. కులాల ప్రస్థావన లేకుండా ఆయన ప్రసంగాలు పూర్తికావు. తాజాగా కాపు నేస్తం నిధుల విడుదలపై పవన్ కల్యాణ్ శ్వేతపత్రం విడుదలకు డిమాండ్ చేయడం కూడా ఇలాంటిదే.
ఏరికోరి కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో నామినేషన్ వేసినప్పుడే పవన్ కల్యాణ్ వారినుంచి ఏమి ఆశిస్తున్నారో స్పష్టమైంది. కనీసం సొంత సామాజిక వర్గం ఓట్లయినా గుంపగుత్తగా పడిపోతాయని అతిగా ఊహించుకుని బోల్తాపడ్డారు పవన్ కల్యాణ్. ఓటమి కారణాలడిగితే మాత్రం, మద్యం, డబ్బులు, బెదిరింపులు.. అంటూ సవాలక్ష వంకలు వెదుకుతారు. అలాంటి పవన్ కల్యాణ్ సీఎం జగన్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్నీ విమర్శిస్తూ వస్తున్నారు.
రైతు భరోసా విడుదలైతే.. కేంద్రం నిధులు మింగేశారని నోరు పారేసుకున్నారు. నేతన్న నేస్తంతో అసలైన కార్మికులు సంతోషంగా ఉంటే.. చాలామందికి ఆర్థిక సాయం అందలేదని తెగ మథన పడ్డారు. అలా బాధపడే బదులు.. జనసైనికులని పురమాయించి ఆర్థిక సాయం అందని వారిచేత అప్లికేషన్ పెట్టిస్తే.. వెంటనే న్యాయం జరుగుతుంది కదా. అది చేయరు, చేయాలంటే ఆయన చేసిన విమర్శల్లో నిజం ఉండాలి కదా.
ఇక కాపునేస్తం నిధుల విషయానికొస్తే.. ఏడాదికి 2వేల కోట్లు కాపుల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పిన జగన్.. 13 నెలల వ్యవధిలోనే 23లక్షలమంది కాపులకు 4770కోట్లు ఇచ్చామని ప్రకటించారట. అది పవన్ కల్యాణ్ కి తప్పుగా తోచిందట. 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన మీరు ఏడాది తిరిగేలోగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ ఎలా ఇస్తారనేది పవన్ ప్రశ్న, అసలలా ఇవ్వడానికి వీల్లేదనేది ఆయన ఆక్రోశం. అలా చేస్తే కాపు రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందట. రిజర్వేషన్ అంశం గురించి వైసీపీ నాయకులు పూర్తిగా మర్చిపోయారంటూ.. మన అజ్ఞాతవాసి మరోసారి గుర్తు చేశారు.
ఇంతకీ పవన్ కల్యాణ్ కు కడుపుమంట దేనికి? చెప్పినదాని కంటే ఎక్కువగా కాపులకు సాయం చేసినందుకా? అసలు కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎవరు లేవనెత్తారు, దానిపై ఎన్ని పోరాటాలు జరిగాయి, ప్రస్తుతం వాటి పరిస్థితి ఏంటి? కాపు రిజర్వేషన్లపై జగన్ స్టాండ్ ఏంటి? ఇవన్నీ పవన్ కల్యాణ్ కి తెలియనివి కావు. కాపు నేస్తం నిధులు విడుదలయ్యాకే రిజర్వేషన్ల గురించి పవన్ కి గుర్తొచ్చిందా?
పోనీ అసలు రిజర్వేషన్ల కోసం పవన్ ఎలాంటి ప్రయత్నాలు చేశారో అదైనా చెప్పాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షం బీజేపీతో మాట్లాడి రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయించొచ్చు కదా. అలా చేస్తే కాపు సమాజం గుండెల్లో పవన్ చిరస్థాయిగా నిలిచిపోతారు కదా. ఇవన్నీ పక్కనపెట్టి కాపులకు అనుకున్నదానికంటే ఎక్కువగా న్యాయం జరిగిందని బాధపడటం ఎందుకు? మిగతా పథకాలపై గాలివాటం విమర్శలు చేసి కాపు నేస్తంపై మాత్రమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయడాన్ని.. కులగజ్జి అనాలా.. వద్దా?
అవసరం ఉన్నప్పుడు సామాజిక వర్గం గుర్తొస్తుంది, అవసరం లేనప్పుడు నేను అందరివాడిననే డైలాగ్ బయటకొస్తుంది. ఇలాంటి ఆలోచనలతో పాతికేళ్లు రాజకీయం చేసినా దాని వల్ల ప్రయోజనం ఉండదు. ఆ విషయాన్ని పవన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.