సీమ రాజ‌కీయంలో పెను మార్పులు ఖాయం!

ఒక‌వైపు మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ఊహాగానాలు, మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే జ‌గ‌న్ గ్రౌండ్ ప్లాన్ ను రెడీ చేస్తున్నార‌నే ప్ర‌చారం.. ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ రాజ‌కీయంలో ప‌లుమార్పు చేర్పులు  తప్ప‌వ‌నే టాక్ వినిపిస్తోంది.…

ఒక‌వైపు మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ఊహాగానాలు, మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు అనుగుణంగా ఇప్ప‌టికే జ‌గ‌న్ గ్రౌండ్ ప్లాన్ ను రెడీ చేస్తున్నార‌నే ప్ర‌చారం.. ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ రాజ‌కీయంలో ప‌లుమార్పు చేర్పులు  తప్ప‌వ‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ మార్పుల్లో భాగంగా ప‌లువురు ఎంపీల టికెట్లు గ‌ల్లంత‌వుతాయి, అలాగే ఎమ్మెల్యేల్లో కూడా అభ్య‌ర్థులు మారిపోతారు, ఇంకా పార్టీలోకి కీల‌క‌మైన చేరిక‌లు కూడా ఉండ‌బోతున్నాయి, ఆ చేరిక‌ల‌కు స‌హించే వారే పార్టీలో ఉంటారు, లేదంటే వారు కామ్ అవుతార‌నేది ఈ పెనుమార్పుల సారాంశం!

ముందుగా కొంద‌రు సిట్టింగ్ ఎంపీల‌కు సీట్లు హుష్కాకే అనే అంశం చ‌ర్చ‌లో ఉంది. గ‌త ఎన్నిక‌ల ముందు ఆఖ‌రి నిమిషంలో పొలిటిక‌ల్ గా యాక్టివేట్ అయిన కొంద‌రు ఎంపీ అభ్య‌ర్థులు, జ‌గ‌న్ గాలిలో ఘ‌న విజ‌యం సాధించినా.. ఆ త‌ర్వాత మాత్రం ఆ పాజిటివ్ ఇమేజ్ ను కొన‌సాగించ‌లేక‌పోతున్నారు. వారిలో వ్య‌క్తిగ‌త లాభాపేక్ష కూడా గ‌ట్టిగానే ఉంద‌ని అధినేత‌కు ఇప్ప‌టికే నివేదిక‌లు వెళ్లాయ‌ట‌. 

ఇలాంటి వారిని ఉపేక్షించాల‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అనుకోవ‌డం లేద‌ని స‌మాచారం. వారి స్థానంలో కొత్త అభ్య‌ర్థులు రావ‌డం ఖాయ‌మ‌ట‌. కుల స‌మీక‌ర‌ణాల‌ను మేనేజ్ చేస్తూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నార‌ని స‌మాచారం. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ అనుస‌రించిన కుల స‌మీక‌ర‌ణాల‌తో టీడీపీకి మైండ్ బ్లాంక్ అయ్యింది. 

బీసీల జ‌నాభా పెద్ద ఎత్తున్న లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో టీడీపీ గ‌ల్లంత‌య్యింది. దీనికి కార‌ణాల్లోల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టికెట్ల పంపిణీలో అనుస‌రించిన సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాలు కూడా ఒక‌టి. వ‌చ్చేసారి కూడా వాటికి విలువ‌నే ఇస్తారు. అయితే అభ్య‌ర్థులు మాత్రం మారిపోవ‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది. జ‌గ‌న్ కు ఈ అవ‌కాశాన్ని ఇస్తుంది కూడా సిట్టింగ్ ఎంపీలే. 

ఎంపీగా గెలిచి రెండున్న‌రేళ్లు కావొస్తున్నా.. వీరిలో కొంద‌రు ఇంకా త‌మ‌కంటూ కేడ‌ర్ బేస్ ను ఏర్పాటు చేసుకోలేక‌పోయారు. కొంద‌రైతే ఢిల్లీలో కూర్చుకుని వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల లాబీయింగ్ ను ప‌నిగా పెట్టుకున్నారు. అవ‌కాశం ఉంటే.. బీజేపీ తో దోస్తీగా మెల‌గ‌డానికి కూడా వీరిలో కొంద‌రు వెనుకాడ‌టం లేద‌ట‌. ఈ రిపోర్టులు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వ‌ద్ద ఉన్నాయ‌ని, ఇలాంటి వారికి వ‌చ్చే సారి టికెట్ ద‌క్కే స‌మ‌స్యే లేద‌ని స‌మాచారం.

వారి స్థానంలో వారి సామాజిక‌వ‌ర్గానికే చెందిన మ‌రొక‌రు అభ్య‌ర్థిగా రావ‌డం లేదా, అదే నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌రో బ‌ల‌మైన బీసీ వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ద‌క్క‌డం ఖాయ‌మ‌ని స‌మాచారం. సీమ జిల్లాల్లో గ‌త ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన వారిలో దాదాపు ముగ్గురు ఎంపీల విష‌యంలో ఇలాంటి మార్పులు ఖాయ‌మ‌ని టాక్.

ఇక కొంద‌రు ఎమ్మెల్యేల‌కు కూడా స్థాన‌చ‌ల‌నం, మొండిచేయి ఉంటుంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దోచుకునేందుకు కూడా ఏమీ లేదు. సంక్షేమ ప‌థ‌కాల్లో అవినీతికి తావు లేదు, ఇక భారీ ఎత్తున కాంట్రాక్టు ప‌నులైనా ఉండి ఉంటే.. వాటాలు కోరే వారు చాలా మంది త‌యార‌య్యే వారు. అయితే అలాంటి ప‌నులు కూడా పెద్దగా లేదు. ఉన్న‌వి చిన్నాచిత‌క ప‌నులు. వాటిల్లో వ‌చ్చే ప‌దీ ప‌ర‌కూ కొంద‌రు క‌క్క‌ర్తి ప‌డ‌టం లేదు. అయితే.. సెంటిల్మెంట్లు, భూ వివాదాల్లోకి త‌ల‌దూర్చి మాత్రం కొంద‌రు భూముల‌ను సంపాదిస్తున్నారు. 

బిగ్ షాట్ల‌కు సంబంధించి, భూ వివిదాల‌ను సెటిల్ చేస్తూ వారు పోగేసుకుంటున్నారు. ఇలాంటి వారితో సామాన్యుల‌కు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేదు. లోలోప‌ల అలాంటి వ్య‌వ‌హారాలను చేసుకుంటూ.. బ‌య‌ట మాత్రం వారు ప్ర‌జ‌లతో మ‌మేకం అవ‌తుఉన్నారు. ఇలా వారి డ్యామేజ్ క‌వ‌రేజ్ అవుతోంది. ఇలాంటి వారిలోనే ఇప్పుడు కొంద‌రికి స్థాన చ‌ల‌నం, టికెట్ల కేటాయింపు ఉండ‌బోద‌నే మాట వినిపిస్తోంది.

రాయ‌ల‌సీమ రాజ‌కీయాల్లో నేత‌లు ఎవ‌రికి వారు వారి నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అయి ఉంటారు. ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్లి పోరాడాల‌నే ఆరాటం అతి త‌క్కువ‌. టీడీపీలో ఇలాంటి నేత‌లు ఉండే వారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో వారు సొంత నియోజ‌కవ‌ర్గాల్లోనే ప‌రువు నిలుపుకోలేక‌పోయారు. మ‌రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇప్పుడు అధినేతే కొంద‌రిని ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల‌కు పంపే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. 

స్థానికంగా ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ మార్పుల‌కు జ‌గ‌న్ రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ఎలాగూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరిగే అవ‌కాశం లేదు. బ‌హుశా 2024 త‌ర్వాత‌నే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంది. ఆలోపే జ‌గ‌న్ కొంద‌రు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల‌కు వెళ్ల‌మనే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితులు స‌రిగా లేక‌పోవ‌డం, ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ప్ర‌త్యామ్నాయం దొర‌క‌డం వంటి లెక్క‌ల‌తో జ‌గ‌న్ ఈ మార్పు చేర్పుల‌ను చేయ‌నున్నార‌ని వినికిడి.

ఇక ఒక సీనియ‌ర్ టీడీపీ నేత కుటుంబం కూడా కొంత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనుంద‌ని స‌మాచారం. ఈ విష‌యంలో ఆ కుటుంబంలో  కూడా ఇప్ప‌టికే చీలిక ఖాయం అయ్యింద‌నే మాటా వినిపిపిస్తోంది. ఆ కుటుంబంలో ఒక పెద్ద నేత‌, ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ను తీసుకున్నారు. చీనీ తోట‌లో ఆయ‌న రిలాక్స్ అవుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆయ‌న పోటీ చేయ‌లేదు కూడా. ఇక ఆయ‌న త‌మ్ముడు మాత్రం పొలిటిక‌ల్ గా హ‌డావుడి చేస్తూ ఉంటారు. 

సీనియ‌ర్ నేత త‌న‌యుడు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న‌కు జ‌గ‌న్ కు గ‌తంలో ఫ్రెండ్ అనే ట్యాగ్ ఉంది. అయితే.. జ‌గ‌న్ పై ఆయ‌న గ‌తంలో వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు కూడా వెనుకాడ‌లేదు. త‌న చుట్టూ ఉన్న వాళ్లంతా త‌న‌ను అన్నా అనాల‌నే టైపు జ‌గ‌న్ అంటూ గ‌తంలో వ్యాఖ్యానించారు. స‌ద‌రు నేత కూడా త‌న చుట్టూ ఉన్న వాళ్ల‌తో అన్నా అనే అనిపించుకుంటారు. 

క‌నీసం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అయినా ఎవ‌రినైనా అన్నా అంటూ సంబోధిస్తారు. అయితే ఆ నేత‌కు ఆ అల‌వాటు కూడా లేన‌ట్టుంది. అయినా జ‌గ‌న్ మీద ఏదో ఒక బుర‌ద‌జ‌ల్లే ప్ర‌య‌త్నం చేశారు గ‌తంలో. అయితే ఇప్పుడు చాలా మార్పు వ‌చ్చింద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త్వ‌ర‌లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌చ్చ‌నే మాట వినిపిస్తోంది. అయితే ఆయ‌న ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాతార‌ట‌. ఆయ‌న బాబాయ్ కానీ, బాబాయ్ త‌న‌యుడు కానీ ఆ ఆలోచ‌న‌లో లేర‌ట‌. ఇలా ద‌శాబ్దాల ప్ర‌స్థానంలో తొలిసారి ఆ కుటుంబంలో రాజ‌కీయ చీలిక రాబోతోంద‌ని స‌మాచారం.

అయితే స‌ద‌రు నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే.. ఆ పార్టీలోనే కొన్ని అసంతృప్త స్వ‌రాలు వినిపిపిస్తాయి. ఆ రాజ‌కీయ కుటుంబం అంటే ప‌డ‌ని వారు ఈ పార్టీలో ఉన్నారు. వీరు గొంతులు స‌వ‌రించ‌క మాన‌రు. అయితే అలాంటి వారిలో కొంద‌రికి స్థాన చ‌ల‌నాలు ఉన్నాయ‌ట‌. ఆ చేరిక మీద అభ్యంత‌రం చెప్ప‌డం మాట అటుంచి, వీరు మ‌రో నియోజ‌వ‌క‌ర్గంలో కుదురుకోవాల‌నే ప‌నిని పెట్ట‌నున్నార‌ట వైఎస్ఆర్ సీపీ అధినేత‌. 

ఎమ్మెల్యేల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ చేయించుకున్న స‌ర్వేలు, తెప్పించుకున్న నివేదిక‌ల‌తో.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మాత్రం అభ్య‌ర్థుల విష‌యంలోనే పెనుమార్పులు త‌ప్ప‌వ‌నేది స్ప‌ష్టం అవుతున్న అంశం.