వాళ్లు మళ్లీ చేతులు కలపనున్నారని అనాలంటే, ఇప్పుడు విడిపోయారా? అనే అంశంపై స్పష్టత ఉండాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబు నాయుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్.. రాజకీయ సహవాసం, సాన్నిహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే! అసలు వీళ్లిద్దరికీ ఎలా స్నేహం మొదలైందో కానీ.. ఆ స్నేహం కొన్ని సార్లు బాహాటంగా, అనేక సార్లు చాటుగా సాగింది.
ప్రస్తుతం వీరి స్నేహం చాటుగా సాగుతోందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. అయితే ఆ ముసుగులు తొలగడానికి మరెంతో కాలం లేదని, అతి త్వరలో మళ్లీ చంద్రబాబు-పవన్ కల్యాణ్ లు చట్టాపట్టాల్ వేసుకుని సాగబోతున్నారనేది విశ్వసనీయ సమాచారం.
వచ్చే ఎన్నికలకు తెలుగుదేశం, జనసేనలు పొత్తుతో వెళ్తాయి. ఈ పొత్తుకు ఒకవేళ బీజేపీ అడ్డం చెప్పినా.. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి కూడా పవన్ కల్యాణ్ వెనుకాడరు. ఆయన లక్ష్యం కేవలం జగన్ ను ఓడించడమే అయినప్పుడు.. బీజేపీతో స్నేహం అనేది కేవలం అప్రాధాన్యం. అడుగడుగునా జగన్ పై చంద్రబాబు కు ఉన్న అభిప్రాయాలను వ్యక్తీకరించడంలో పవన్ కల్యాణ్ అస్సలు అలసిపోవడం లేదు.
ఎందుకు మొదలైందో, ఎలా మొదలైందో కానీ.. జగన్ అంటే విపరీతమైన అక్కసును కలిగిఉన్న పవన్ కల్యాణ్, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలనే తన దీక్ష మేరకు తన పార్టీని పణంగా పెట్టడానికి కానీ, తన రాజకీయ భవితవ్యాన్ని చంద్రబాబు చేతికి అప్పగించడానికి అయినా వెనుకాడేలా లేడని తెలుస్తోంది.
తను ఏమైనా ఫర్వాలేదు, జగన్ ఓడిపోతే చాలనేది పవన్ కల్యాణ్ పొలిటికల్ మోటోగా స్పష్టం అవుతోంది. ఇది వరకే ఈ విషయంలో పవన్ కల్యాణ్ బయటపడిపోయారు. కాబట్టి.. కొత్తగా మరోసారి బయటపడటం మాత్రమే మిగిలిపోయింది. ఈ ఏకైక లక్ష్యం కోసం తెలుగుదేశం- జనసేనలు పొత్తుతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
చంద్రబాబు అజెండానే, పవన్ అజెండా!
బయటకు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లు మీటవుతారా? వీరిద్దరూ కలిసి సమావేశం అవుతారా? తెలుగుదేశం పార్టీపై పవన్ కల్యాణ్ ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు? అనేవి ప్రశ్నలే కాదు. వీటితో నిమిత్తం లేకుండా పవన్ కల్యాణ్, చంద్రబాబుల స్నేహం కొనసాగుతూ ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు కొన్నాళ్ల ముందు మొదలైన ఈ స్నేహం అనేక రకాల పరిస్థితుల్లో కొనసాగుతూ వచ్చింది.
చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ చాలా చేశారు. ఎన్నికల్లో ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ కొద్దో గొప్పో మెజారిటీతో అధికారంలోకి వచ్చిందంటే.. అందులో పవన్ కల్యాణ్ తన వంతు చేసిన సాయం ఎంతైనా ఉంది. ఐదు లక్షల ఓట్ల తేడాతో తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల అధికారాన్ని అందుకుందంటే.. పవన్ కల్యాణ్ మద్దతు లేకపోయినా అది సాధ్యం అయ్యేది కాదు. అంతా జగన్ గెలుస్తాడనే అభిప్రాయాలతో ఉన్న సమయంలో పవన్, మోడీల సాయం చంద్రబాబుకు లేకపోతే.. అప్పుడే అది జరిగేది.
అలా ఎదురీది మరీ చంద్రబాబుకు సాయంగా నిలిచారు పవన్ కల్యాణ్. ఆ సాయం చేయడంలో పవన్ స్వార్థం ఏమిటో కానీ.. ఆ తర్వాత కూడా జగన్ టార్గెట్ గా పవన్ కల్యాణ్ సాగించిన కామెంట్లను బట్టి చూస్తే.. చంద్రబాబుపై ప్రేమ ఏమో కానీ, జగన్ అంటే పవన్ కల్యాణ్ కు తీవ్రమైన అక్కసు, కసి, అసహనం ఉన్నాయని మాత్రం స్పష్టమవుతూ వచ్చింది.
ఆ అసహనమే.. పవన్ కల్యాణ్ ను 'జగన్ మోహన్ రెడ్డి నువ్వెలా సీఎం అవుతావో చూస్తా..' అంటూ అహంకారపూరిత, అపరిపక్వ వ్యాఖ్యలు చేసేంత వరకూ తీసుకొచ్చింది. ఆ అసహనమే.. 'నువ్వు సీఎం కాలేవు ఇది శాసనం..' అంటూ అహంకారాన్ని వ్యక్తం చేసేలా పవన్ ను మార్చింది. 2014 ఎన్నికల సమయంలోలా 2019లో కూడా జరుగుతుందని పవన్ కల్యాణ్ భ్రమపడ్డాడు. తన గురించి తను చాలా ఎక్కువ అంచనా వేసుకున్నాడు. అయితే అప్పుడు కూడా చంద్రబాబు స్ట్రాటజీ ప్రకారమే పవన్ కల్యాణ్ నడుచుకున్న వైనం కూడా అగుపించింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం అనే ప్రక్రియలో భాగంగా కమ్యూనిస్టులు, బీఎస్పీలతో జనసేన పోటీ చేసింది. అచ్చంగా ఇది చంద్రబాబు వ్యూహమే అని చిన్నపిల్లాడు కూడా చెబుతాడు. అయితే ఈ సారి మాత్రం చంద్రబాబు వ్యూహం చిత్తయ్యింది. శిఖండిని అడ్డుపెట్టుకున్నట్టుగా ఆ కూటమిని పెట్టాలని చంద్రబాబు నాయుడు వేసిన లెక్క తప్పింది. అంతకు మించి అవమానకరమైన రీతిలో పవన్ కల్యాణ్ ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
తన మాటే శాసనమంటూ అహంభావపూర్వకంగా మాట్లాడిన పెద్ద మనిషి ఒకటికి రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోవడం అంటే… అంతకు మించిన అవమానం మరోటి ఉండదు. అయితే పవన్ కల్యాణ్ ఆ అవమానాన్ని దిగమింగి సాగుతున్నాడు. ఈ నిస్పృహలో కూడా జగన్ ను ఓడించి తీరాలనే తన లక్ష్యాన్ని మాత్రం పవన్ కల్యాణ్ వదులకుంటున్నట్టుగా లేకపోవడమే అసలైన ఆశ్చర్యం.
గత రెండేళ్లుగా పవన్ కల్యాణ్ నుంచి వ్యక్తమయ్యే ప్రతి స్పందన కూడా చంద్రబాబు అజెండా మేరకే ఉంటోంది. ఆఖరికి ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్ ను ప్రశంసిస్తూ పవన్ కల్యాణ్ పెట్టిన ట్వీట్ల సారాంశం కూడా చంద్రబాబునాయుడు అజెండానే తప్ప మరోటి కనిపించదు.
అంతా చంద్రబాబు ఆదేశానుసారమే!
ఎన్నికలు అయిపోగానే పవన్ కల్యాణ్ ఎర్రజెండాను వదిలేసి కాషాయం గట్టారు. కమ్యూనిస్టు పార్టీలను పక్కన పెట్టి కమలం పార్టీతో జత గట్టారు. అంత వరకూ చేగువేరా వచనాలు చెప్పి, వెంటనే సావర్కర్ సిద్ధాంతాలను ఒంటబట్టించుకున్నారు. మతతత్వ రాజకీయాలు చేసేది హిందూ రాజకీయ నేతలు మాత్రమే అంటూ బాహాటంగా వ్యాఖ్యానించిన నేత అయిన పవన్ కల్యాణ్, తిరుపతి శ్రీవారిపై భక్తి ఉంటే బీజేపీని గెలిపించాలన్నారు! ఇలా తన సిద్ధాంతాలను రాత్రికి రాత్రి మార్చేసుకున్న పవన్ కల్యాణ్.. ఏం చేసినా అది చంద్రబాబు ఆదేశాలనుసారం.
చంద్రబాబు వ్యూహ ప్రకారమే.. అనే అభిప్రాయాలు అయితే కించిత్ కూడా మారడం లేదు ఎవ్వరిలో కూడా! బీజేపీకి మళ్లీ దగ్గరకావడంలో భాగంగా పవన్ కల్యాణ్ ను ముందుగా కమలం పార్టీ వద్దకు చంద్రబాబు నాయుడు పంపించాడనేది బాగా వినిపించే విశ్లేషణ. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకూ చంద్రబాబును చేరదీయలేదు. పవన్ కల్యాణ్ లాబీ ఈ విషయంలో అక్కడ అంత పని చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.
ఇప్పటి వరకూ బీజేపీ అసలు నేతలెవ్వరూ పవన్ కల్యాణ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి, పిలిచి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. మరోవైపు బీజేపీ నేతలు మాట్లాడితే చంద్రబాబు మీద కస్సు మంటున్నారు. చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వారు మరిచిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ లాబీ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గర చేయలేకపోతోంది.
కనీసం పవన్ కల్యాణ్ కు ఢిల్లీలో అపాయింట్మెంట్లు దక్కే పరిస్థితి ఉండి ఉంటే, చంద్రబాబు కోసం అక్కడ ఏదో ఒకటి చేసే అవకాశం ఉండేదేమో. అయితే పవన్ కల్యాణ్ కే అక్కడ ఠికానా లేకపోవడంతో.. చంద్రబాబు కోసం ఏదో చేసే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇలా చంద్రబాబు వ్యూహం ఏదీ పారడం లేదు. పవన్ కల్యాణ్ ను పావుగా చేసుకుని చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం ఇప్పటి వరకూ ఫలితాన్ని ఇవ్వడం లేదు. అయితే.. పవన్ కల్యాణ్ ప్రాధాన్యత మాత్రం బీజేపీ కాదు.
బీజేపీతో స్నేహం పవన్ కల్యాణ్ కు అవసరం లేదు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార కాలంలో సగం పూర్తవుతోంది. వచ్చే ఎన్నికలకు కత్తులూకటార్లను రెడీ చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతూ ఉంది. పవన్ కల్యాణ్ కు ఢిల్లీలో పరపతి పెరిగేదెదన్నడు, ఆ పరపతితో చంద్రబాబును ఢిల్లీ తీసుకెళ్లేదెన్నడు? అనే పరిస్థితి నెలకొని ఉంది. కనీసం తిరుపతి ఉప ఎన్నికలో అయినా బీజేపీ చెప్పుకోదగిన ఓటు బ్యాంకును సాధించి ఉంటే.. పవన్ కల్యాణ్ కు ఢిల్లీలో వెయిట్ పేరిగేదే.. అయితే అక్కడ కనీసం డిపాజిట్ దక్కలేదు.
ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు అక్కడ రెడ్ కార్పేట్ వెల్కమ్ ఏదీ దక్కే అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇక బీజేపీనే నమ్ముకుని పుణ్యకాలం పూర్తి చేసుకోవడం కన్నా.. టీడీపీ-జనసేనలు చేతులు కలిపే వ్యూహమే మిగిలినట్టుగా ఉంది. ఇక అదే జరగుబోతోందని సమాచారం.
బీజేపీకి విడాకులేనా?
విడాకులు ఇవ్వడం పవన్ కల్యాణ్ కు వెన్నతో పెట్టిన విద్య. అది వ్యక్తిగత జీవితంలో అయినా, రాజకీయ జీవితంలో అయినా పవన్ కల్యాణ్ చాలా మందికి విడాకులు ఇచ్చారు. రాజకీయ జీవితాన్నే గమనిస్తే.. ఒకరంగా తన అన్నకు కూడా పవన్ కల్యాణ్ పొలిటికల్ విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి బీజేపీకి ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీలు కూడా పవన్ కల్యాణ్ చేత రాజకీయ విడాకులు పొందిన వారే.
ఇప్పుడు మళ్లీ బీజేపీతో పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నారు. అయితే ఇదే కమలం పార్టీకి మరోసారి విడాకులు ఇవ్వడం పవన్ కల్యాణ్ కు పెద్ద కథ ఏమీ కాదు. బీజేపీ కోసం పవన్ కల్యాణ్ కాషాయం అయితే చుట్టారు కానీ, అదంతా అక్కడ దక్కే గుర్తింపు కోసమే. అయితే అనుకున్న గుర్తింపు దక్కనప్పుడు.. ఈ కాషాయాన్ని వదలడానికి పవన్ కల్యాణ్ అస్సలు ఆలోచించే టైపు కాదు.
చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా.. బీజేపీ పొత్తుకు ముందుకు రాకపోయినా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేనలు కలిసి పోటీ చేసే పరిస్థితి రాకపోయినా.. బీజేపీకి పవన్ కల్యాణ్ విడాకులను ఇవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ విధానాలకూ, పవన్ కల్యాణ్ వాదానికీ అస్సలు ముడిపడదు కూడా. కాబట్టి.. బీజేపీకి పవన్ విడాకులను ఇచ్చేసి, మళ్లీ చంద్రబాబుతో రాజకీయ సహజీవనాన్ని ప్రారంభించే ఘడియలు మరెంతో దూరంలో లేదని తెలుస్తోంది!
స్టాలిన్ పై ట్వీట్.. ఒక దెబ్బకు రెండు పిట్టలు?
తమిళనాడు సీఎం స్టాలిన్ ను కీర్తిస్తూ పవన్ కల్యాణ్ పెట్టిన ట్వీట్ ను గమనిస్తే.. ఆ పదాల వరస అంతా టీడీపీ అకౌంట్ల నుంచి రావాల్సిన ట్వీట్ అది అనిపిస్తుంది. జగన్ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అని టీడీపీ చెప్పుకోవడానికి స్టాలిన్ ను ఉదాహరించవచ్చు. అయితే ఇక్కడ ఉదాహరించినది మాత్రం పవన్ కల్యాణ్.
చంద్రబాబు ఆవేదనను పవన్ కల్యాణ్ వెల్లగక్కడక్కడ. ఇలా తనది చంద్రబాబు వాదమే అని పవన్ కల్యాణ్ ఆ ట్వీట్ తో క్లారిటీ ఇవ్వడంతో పాటు.. పరోక్షంగా బీజేపీతో దూరం పెరుగుతున్న సంకేతాలను కూడా స్పష్టంగానే ఇచ్చారాయన. స్టాలిన్ ను కీర్తిస్తే బీజేపీ కి కాలుతుందని తెలుసుకోలేనంత చిన్న పిల్లాడు కాదు పవన్ కల్యాణ్. అయినా పవన్ అందుకు వెనుకాడలేదు. తద్వారా బీజేపీని లైట్ తీసుకుంటున్న వైనాన్ని ఆయన చాటుకున్నారు. బీజేపీ వాదం కాదు, చంద్రబాబు వాదమే తనకు ప్రధానమనే సంకేతాలను చాలా క్లియర్ గా ఇచ్చారు పవన్ కల్యాణ్.
అందుకే బలోపేతం చర్యలు శూన్యం!
ఎన్నికలయిపోయి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. జనసేన బలోపేతానికి పవన్ కల్యాణ్ కాసింత కసరత్తు కూడా చేసినట్టుగా కనిపించదు. జనసేనకు ఎన్ని నియోజకవర్గాల్లో ఇన్ చార్జిలు ఉన్నారో చెప్పడం కూడా కష్టం. ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు అనదగ్గ ఇన్ చార్జిలు యాక్టివ్ గా ఉన్న నియోజకవర్గాల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టే స్థాయిలో కూడా ఉండవు. ఇదంతా చూస్తే.. పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో కూడా సీరియస్ గా పోటీ చేసే, సొంతంగా సత్తా చాటే ఉద్దేశాలు ఉన్నట్టుగా కనిపించవు.
గడిచిన రెండేళ్లలోనే కాదు.. రానున్న రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి పవన్ కల్యాణ్ పూనుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఇప్పుడు పవన్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వాటిని పూర్తి చేయాలంటే కనీసం రెండేళ్ల సమయం అయితే పట్టడం ఖాయం. అలా చూస్తే.. పవన్ కల్యాణ్ సినిమాలు చుట్టేసి వచ్చే సరికి ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుంది. అప్పుడు ఇక పార్టీని బలోపేతం చేయడం వంటి చర్యలకు సమయం కూడా ఉండదు.
కాబట్టి.. చంద్రబాబును నమ్ముకుని ఎన్నికలకు వెళ్లిపోవడం తప్ప పవన్ కల్యాణ్ కు మరో ఆప్షన్ కూడా ఉండదు. జనసేన ప్రస్తుత పరిస్థితిని చూస్తే.. వచ్చే ఎన్నికలకు ఆ పార్టీకి రిజిస్టర్డ్ గుర్డు అయినా ఉంటుందా? అనేది ప్రశ్నార్థకమే. గాజుగ్లాసు గుర్తు ఇప్పటికే చేజారినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో మరో కొత్త గుర్తును తెచ్చుకుంటారా? గాజు గ్లాసు గుర్తునే మళ్లీ పొందుతారా? అనేది కూడా శేషప్రశ్న. రెండోసారి ఎన్నికలను ఎదుర్కొనబోతూ కూడా.. కనీసం గుర్తు మీద కూడా క్లారిటీ లేని పార్టీగా నిలుస్తోంది జనసేన. టీడీపీ గుర్తు మీదే పవన్ కల్యాణ్ అభ్యర్థులు కూడా పోటీ చేసే పరిస్థితి వచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఆ రేంజ్ లో సాగుతోంది జనసేన నడక!
ఈ స్నేహానికి ఆమోదం లభిస్తుందా?
ఇప్పటి వరకూ చాలా జరిగింది. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు కొత్త దోస్తులేమీ కాదు. తెర వెనుక కొన్నాళ్లు, తెర తీశాకా కొన్నాళ్లు స్నేహం చేయడం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ల కు అలవాటుగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ స్నేహానికి మరోసారి తెర తీస్తే.. అప్పుడు ప్రజామోదం ఏ మేరకు లభిస్తుంది? అనేది ప్రస్తుతానికి శేష ప్రశ్న.
పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో సోలోగా కూడా రెండు చోట్ల ఓడిపోవడానికి, జనసేన అంతలా చిత్తయిపోవడానికి కారణం కూడా.. చంద్రబాబుతో తెరచాటు బంధమే అనే విశ్లేషణలూ ఉన్నాయి. మరి ఆ బంధానికి వచ్చే ఎన్నికల నాటికి తెర తీస్తే.. అప్పుడు ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిదాయకమైన విషయం.
వేరే రాజకీయ సమీకరణాలు కానీ, వేరే రాజకీయ పరిస్థితులను కానీ పట్టించుకోకుండా.. జగన్ ను ఓడిస్తే చాలనే పవన్ కల్యాణ్ ఏకైక అజెండాతో సాగుతున్న పవన్ కల్యాణ్ రాజకీయ గమనం గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అవుతుందా? కాదా? అనే అంశానికి రానున్న రోజులే సమాధానం ఇవ్వనున్నాయి.