ఆల్రెడీ క్లిక్ అయిందన్న నమ్మకమో లేక ఏది చూపించినా చూస్తారనే ధైర్యమో తెలీదు కానీ, ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక మాత్రం చాలా పేలవంగా ఉంది. యాజమాన్యానికి వాళ్ల లెక్కలు వాళ్లకు ఉండొచ్చు. ఈసారి బడ్జెట్ పరిమితులు కూడా ఉండొచ్చు. అలా అని సామాన్య ప్రేక్షకులకు తెలియని ముఖాల్ని హౌజ్ లోకి ప్రవేశపెట్టి వీళ్లే సెలబ్రిటీలు అనడం మాత్రం కరెక్ట్ కాదు. అవును.. సీజన్-5లో భాగంగా హౌజ్ లోకి అడుగుపెట్టిన సోకాల్డ్ ''సెలబ్రిటీల్లో'' దాదాపు 90శాతం మంది సాధారణ టీవీ ప్రేక్షకులకు తెలియదు.
ఈసారి బిగ్ బాస్ నిర్వహకులు పబ్లిక్ లో పాపులారిటీ కంటే సోషల్ మీడియాలో క్రేజ్ ఉన్న వ్యక్తులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. గడిచిన సీజన్లలో స్టార్ డమ్ లేకపోయినా కనీసం మొహం తెలిసిన హేమ లాంటి సీనియర్ నటుల్ని పెట్టి షోకు కాస్త క్రేజ్ తీసుకొచ్చారు. ఇంకాస్త వెనక్కి వెళ్తే, ఫేడవుట్ అయినప్పటికీ హీరోయిన్లను హౌజ్ లో పెట్టి హంగామా చేశారు. ఈసారి మచ్చుకు కూడా అలాంటి ప్రయత్నం జరగకపోవడం,నిరాశ కలిగించడమే కాదు, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది.
యాంకర్ రవి, మానస్, షణ్ముక్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ తప్పిస్తే మిగతా కంటెస్టెంట్లలో చాలామంది టీవీ ప్రేక్షకులకు కొత్త. ఈసారి సెలక్షన్ ఎలా ఉందంటే.. డాన్స్ వచ్చేవాళ్లను ఇద్దర్ని, పాటలు పాడేవార్ని మరో ఇద్దర్ని, హంగామా చేసే వార్ని ఇంకో ఇద్దర్ని.. ఇలా ఎంపిక చేసినట్టున్నారు. మరీ ముఖ్యంగా ఈసారి కాస్త తక్కువ పేమెంట్స్ కు వచ్చేవాళ్లను తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇవన్నీ ఒకెత్తయితే సరయు ఆంటీ మరో ఎత్తు. యూట్యూబ్ లో సెక్స్ జ్ఞానం కల్పిస్తూ, హాట్ హాట్ ముచ్చట్లు పెట్టే సరయును నేరుగా తీసుకొచ్చి హౌజ్ లో పడేశారు. ఈమె ఎంపిక వెనక ఉద్దేశం ఏంటో నిర్వహకులకే తెలియాలి. సరయు క్లినిక్ ను హౌజ్ లో ఓపెన్ చేస్తారని మాత్రం కుర్రాళ్లు ఆశపడకూడదు. ఎందుకంటే అది వెబ్, ఇది టీవీ.
ఓవరాల్ గా చూసుకుంటే, ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో స్టార్ ఎట్రాక్షన్ పూర్తిగా తగ్గిపోయింది. స్టార్ ఎట్రాక్షన్ లేదు కాబట్టి, ఇక కంటెస్టెంట్ల పెర్ఫార్మెన్స్ మీదే బిగ్ బాస్ ఆధారపడి ఉంది. ఉన్న ఒక్కగానొక్క నటి ప్రియ లాంటి వాళ్లను ఫస్ట్ ఎలిమినేషన్ లోనే బయటకు తోసేస్తే.. ఇక మిగతా ఎపిసోడ్స్ అన్నింటినీ ప్రతి రోజూ జాగారం చేసుకుంటూ చూడ్డమే. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ రాత్రి 10 నుంచి ప్రారంభం. నాగార్జున వచ్చేటప్పుడు మాత్రం గంట ముందు మొదలవుతుంది.