ఉత్తరాంధ్ర ప్రజాకవి, గాయకుడు రాసిన ఏం పిల్లో వెళ్దామొస్తవా..పాట బాగా పాపులర్. అదే పాట బిట్ ను గతంలో ఓ సినిమా వాడి గడబిడ కూడా అయింది. ఆ సంగతి అలా వుంచితే ఇప్పుడు విడుదలైన మరో పాట ఆ పాత పాటను మరోసారి గుర్తు చేసింది. గుర్తు చేయడం సంగతి అలా వుంచితే, మంచి మంచి పదాలతో రచయిత సుద్దాల అశోక్ తేజ పాటను అందించారు.
కొల్లేరు సరస్సు మత్స్య కారులు, గోదావరి ప్రాంత అందాల మీద చిత్రీకరించిన ఈపాట సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న రిపబ్లిక్ సినిమాలోది. దర్శకుడు దేవా కట్టా.
''..ఎన్నెల్లో కొల్లేరు తానమాడుతున్నదంట..వెల్దామా..వెల్దామా…
సరస్సతోని సందురుడు సరసమాడుతున్నడంట..వెల్దామా..వెల్దామా..
గాలి చెంప గిల్లుతుంటే పూలు సిగ్గు పడ్డవంట..వెల్దామా..వెల్దామా..''
అనే లైన్లు బాగున్నాయి. ఇవే లైన్లు ఏం పిల్లడో వెల్దామొస్తవా ను గుర్తు చేస్తున్నాయి. సీకాకులం కొండల్లో ఇలా వుంది..అలా వుంది..వెల్దామొస్తవా అని పిలుస్తాడు ఆ పాటలో కవి వంగపండు. ఇప్పుడు ఈ పాటలో అదే స్టయిల్ కు తనదైన అందమైన పదాలను జోడించాడు సుద్దాల అశోక్ తేజ. ఆయనకు గతంలో కూడా ఇదే అలవాటు వుంది.
ఆ సంగతి అలా వుంచితే గోదావరి అందాల బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరణ బాగుంది. జాతరలు, అమ్మవారి ఆలయాలు అన్నీ కలర్ ఫుల్ గా వున్నాయి. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలవుతుంది.