వినాయకుడితో బీజేపీ డబుల్ గేమ్..!

ఈమధ్య సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది. వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే, ప్రతిపక్షం స్పందన ఎలా ఉంటుంది? అనుమతి ఇవ్వకపోతే వారి రియాక్షన్ ఏంటి..? అంటూ…

ఈమధ్య సోషల్ మీడియాలో ఓ మీమ్ తెగ వైరల్ అవుతోంది. వినాయక చవితి ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తే, ప్రతిపక్షం స్పందన ఎలా ఉంటుంది? అనుమతి ఇవ్వకపోతే వారి రియాక్షన్ ఏంటి..? అంటూ సరదాగా మీమ్స్ చేసి వదులుతున్నారు నెటిజన్లు. సరిగ్గా అదే ఇప్పుడు నిజమైంది.

ఏపీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాల ఏర్పాటుకి అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ డబుల్ గేమ్ మొదలు పెట్టింది. కేరళలో బక్రీద్, ఓనమ్ పండగలకు వెసులుబాట్లు ఇవ్వడం వల్లే కరోనా కేసులు పెరిగాయని కేంద్రంలోని బీజేపీ పెద్దలు కేరళ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పార్టీ నేతలు ఏపీలో వినాయక చవితి వేడుకలపై ఆంక్షలు ఎందుకంటూ రోడ్లెక్కారు. ఇదెక్కడి డబుల్ గేమ్ అంటూ ప్రజలు షాకయ్యారు.

ఏం మనిషివయ్యా వీర్రాజూ..!

ఆగస్ట్ 28న కేంద్రం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల్లో బహిరంగ ప్రదేశాల్లో పండగలు, పబ్బాల పేరుతో జనాలు గుమికూడటాన్ని నిషేధిస్తున్నట్టు ఉంది. మరి ఆ మార్గదర్శకాల ప్రకారం పండగల పేరుతో వినాయక మండపాలు ఏర్పాటు చేయడం, సామూహిక పూజలు, ఆ తర్వాత నిమజ్జనం పేరుతో ఊరేగింపులు అన్నిటిపై ఆంక్షలు ఉండాలి కదా. ఏపీ ప్రభుత్వం అదే చేసింది.

ఒకవేళ వీర్రాజు రంకెలు వేయాలనుకుంటే ముందు కేంద్రాన్ని ప్రశ్నించాలి, ఆ తర్వాత రాష్ట్రం దగ్గరకు రావాలి. కేంద్రం మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నా.. మత విద్వేషాల కోసం ఏపీ ప్రభుత్వంపై వీర్రాజు ఎగిరెగిరి పడుతున్నారు.

పండగలకు గేట్లు ఎత్తేశారని కేరళ ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ నేతలు, ఇప్పుడు ఏపీలో పండగలపై ఆంక్షలు విధించారని విమర్శించడం ఎంతవరకు సబబు. మిగతా రాష్ట్రాల్లో మత రాజకీయాలు చేసి లబ్ధి పొందిన బీజేపీ, ఏపీలో కూడా హిందువులను రెచ్చగొట్టే పని మొదలు పెట్టింది. వినాయకుడితో డబుల్ గేమ్ ఆడుతోంది.