క‌రోనాపై ప్ర‌జ‌లు ఫుల్ క్లారిటీతో..!

క‌రోనా గురించి ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్ప‌డిపోయాయి. ఆ అభిప్రాయాల్లోని శాస్త్రీయ‌త‌, సాంకేతిక‌త ఇలాంటివేవీ అడ‌గొద్దు. ఏడాదిన్న‌ర‌గా క‌రోనాతో స‌హ‌వాసం చేస్తున్న ప్ర‌జ‌లు ఆ వైర‌స్ గురించి పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు.…

క‌రోనా గురించి ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్ప‌డిపోయాయి. ఆ అభిప్రాయాల్లోని శాస్త్రీయ‌త‌, సాంకేతిక‌త ఇలాంటివేవీ అడ‌గొద్దు. ఏడాదిన్న‌ర‌గా క‌రోనాతో స‌హ‌వాసం చేస్తున్న ప్ర‌జ‌లు ఆ వైర‌స్ గురించి పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు. లెక్క చేయ‌క‌పోవ‌డ‌మే ఆ స్ప‌ష్ట‌త! దేశంలో క‌రోనా కేసులు హెచ్చుత‌గ్గుల‌తో న‌మోద‌వుతున్నాయి. అయితే ప్ర‌జ‌లు మాత్రం క‌రోనాను పిచ్చ‌లైట్ తీసుకున్నారు. 

మాస్కులను ఇప్పుడు చాలా త‌క్కువ మంది మాత్ర‌మే పెట్టుకుంటున్నారు. అది కూడా న‌గ‌రాల్లోనే ఎక్కువ‌గా ఉంది. ప‌ట్ట‌ణాల విష‌యానికి వ‌స్తే.. నూటికి యాభై మంది కూడా మాస్కుల‌ను ధ‌రించ‌డం లేదు. ధ‌రించిన వారు కూడా వాటిని కాసేపు పెట్టి, మరి కాసేపు తీస్తూ.. ఇలాగే ఉంది వ్య‌వ‌హారం. ఇక శానిటైజ‌ర్లు, హ్యాండ్ వాష్ ల‌కూ బాగా గిరాకీ త‌గ్గింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెల‌ల్లో వీటిని విరివిగా ఉప‌యోగించారు. ఇప్పుడు మాత్రం వీటిని ప‌ట్టించుకునే వారే లేరు!

దీనికంతా కార‌ణం.. క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్ట‌డ‌మే అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కేసుల సంఖ్య బాగా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్ర‌జ‌లు క‌రోనాను లైట్ తీసుకుంటున్నారు. అయితే మ‌ళ్లీ కేసులు సంఖ్య పెరిగితే ప్ర‌జ‌లు విప‌రీత‌మైన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటార‌ని కాదు. మ‌ళ్లీ కేసుల సంఖ్య పెరిగితే, ప్ర‌భుత్వం పెట్టే ఆంక్ష‌ల‌ను మాత్ర‌మే ప్ర‌జ‌లు ఎంతో కొంత పాటిస్తారు. లాక్ డౌన్లు పెడితే ఇళ్ల‌లో ఉంటాం, లేక‌పోతే అంతా రొటీనే అని ప్ర‌జ‌లు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో చూపిస్తున్నారు. క‌రోనా అనేది కేవ‌లం ప్ర‌భుత్వం టెన్ష‌న్ త‌ప్ప‌, త‌మ‌ది కాద‌న్న‌ట్టుగా మారింది వ్య‌వ‌హారం.

ఇక ఇప్పుడు పెళ్లిళ్లు, ఇత‌ర వేడుక‌లు వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. నాలుగైదు వంద‌ల మంది అతిథుల‌తో ఈ త‌ర‌హా వేడుక‌లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో ప్ర‌జ‌లు క‌రోనాను గుర్తు కూడా చేసుకోవ‌డం లేదు. పెళ్లిళ్ల‌లో మాస్కు కూడా కాసేపు ధ‌రించే ఆభ‌ర‌ణంగా మారింది. చాలా మంది అది కూడా త‌గిలించ‌డం లేదు.

ఇక వ్యాక్సిన్ విష‌యంలో కూడా ఇప్పుడు ప్ర‌జ‌లు అంత ప‌ట్టింపుతో లేరు. భ‌యం, న‌మ్మ‌కం ఉన్న వాళ్లు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. మిగ‌తా వాళ్లు అది కూడా లేదు. ప్ర‌భుత్వ అధికారులు ఇంటింటి వ‌ద్ద‌కూ వ‌చ్చి వ్యాక్సిన్ వేస్తామ‌న్నా.. కొంద‌రు అనాస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇంకా ఎందుకన్న‌ట్టుగా ఉంది వీరి రియాక్ష‌న్. 

క‌రోనా వేవ్ మ‌ళ్లీ వ‌స్తుంద‌ని చెప్పినా, మ‌ళ్లీ కేసులు పెరుగుతాయ‌ని చెప్పినా ప్ర‌జ‌లు లైట్ తీసుకుంటున్నారు. అలాగే కేసులు ఇక అస్స‌లు రావ‌న్నా వారు న‌మ్మే ప‌రిస్థితి లేదు. క‌రోనా కేసుల గురించి ఇప్ప‌టి వ‌ర‌కూ శాస్త్రీయ ప‌రిశోధ‌కులు చెప్పిన విష‌యాలు, వేసిన అంచ‌నాలు పూర్తి స్థాయిలో నిజాలు కాలేదు. ఈ నేప‌థ్యంలో ఏం చెప్పినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేకుండా పోయింది. అలాగే క‌రోనా వ‌స్తుంద‌ని పూర్తి స్థాయిలో జాగ్ర‌త్త‌గా ఉండ‌టానికి కూడా వారు అనాస‌క్తితోనే క‌నిపిస్తున్నారు. వ‌స్తే చూద్దాంలే అనే ధోర‌ణే ఎక్కువ‌గా ఉంది. 

ఇక మూడో వేవ్ వ‌చ్చినా ప్ర‌జ‌లు క‌రోనాకు భ‌య‌ప‌డ‌తార‌ని అనుకోవ‌డానికి ఏమీ లేదు. క‌రోనాను తేలిక‌గా జ‌యించ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కం సామాన్య భార‌తీయుల్లో క‌నిపిస్తూ ఉంది. ఈ నిర్ల‌క్ష్య పూరిత ధోర‌ణితో కొంద‌రు ప్రాణాల మీద‌కు తెచ్చుకున్నారు సెకెండ్ వేవ్ లో. మ‌రి కొంద‌రిలో ఈ ధైర్య‌మే మందుగా మారుతోంది. ఏతావాతా ప్ర‌జ‌ల ధోర‌ణిని గ‌మ‌నిస్తే మాత్రం క‌రోనా అంటూ ఒక‌టి ఉంద‌నే భావ‌న క్ర‌మంగా మాయ‌మ‌వుతున్న వైనం గోచ‌రిస్తోంది.