కొడుకు గెలుపు కోసం కలలు కంటున్న తండ్రి

ఓ తండ్రి రెండు కలల కంటున్నాడు. ఒకటి తన పార్టీ గెలవాలి. గెలిచి తాను మళ్ళీ అధికారంలోకి రావాలి. అదే సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో తన ఏకైక కుమారుడు గెలవాలి. మళ్ళీ మంత్రి పదవి…

ఓ తండ్రి రెండు కలల కంటున్నాడు. ఒకటి తన పార్టీ గెలవాలి. గెలిచి తాను మళ్ళీ అధికారంలోకి రావాలి. అదే సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో తన ఏకైక కుమారుడు గెలవాలి. మళ్ళీ మంత్రి పదవి చేపట్టాలి. ఆ తండ్రి అధికారంలోకి వస్తే ఆ కొడుకు మంత్రి పదవి చేపట్టడం చాలా ఈజీ. అసలు సమస్యల్లా ఆ కొడుకు గెలవడమే. ఇంతకూ ఆ తండ్రీ కొడుకులు ఎవరయ్యా అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆ కొడుకు మాజీ మంత్రి లోకేష్. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిచి తీరాలని బాబు కొడుకు లోకేష్ కు ఇప్పటినుంచే నూరి పోస్తున్నాడు.

పోయిన చోటనే వెదుక్కోవాలి అనే సామెతలా ఇప్పటివరకైతే బాబు కుమారుడు లోకేష్ ను మంగళగిరి నుంచే పోటీ చేయించాలని అనుకుంటున్నారు. ఒకవేళ రేపు జనసేన -టీడీపీ పొత్తు పెట్టుకుంటే అప్పుడు పరిస్థితి మారుతుందేమో చెప్పలేం. తప్పక గెలవాలని బాబు కుమారుడికి ఎంత నూరి పోసినా గెలిపించాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారనుకోండి. అది వేరే విషయం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా భారీ మెజార్టీతో గెలుపొందేలా వ్యూహలు ఉండాలని చంద్రబాబు కుమారుడు లోకేష్ కు స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో మంగగిరి నుంచి గెలిచి పార్టీ అధినేతకు గిఫ్ట్ గా ఇస్తానని ఇప్పటికే లోకేష్ ప్రకటించాడు. దీంతో మంగళగిరి రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 

1983, 1985 లో మాత్రమే మంగళగిరిలో టీడీపీ గెలిచింది. పొత్తుల కారణంగా నియోజకవర్గంలో టీడీపీ నష్టపోయిందనే అభిప్రాయం బాబుకు ఉంది.  తాను 2019 ఎన్నికల్లో ఓడిపోయినా, టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నా నియోజకవర్గంలో తాను పర్యటిస్తూ ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నానని లోకేష్ అంటున్నాడు. తాను సొంతంగా నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను తండ్రికి వివరించాడు. తాను సొంత నిధులతో  కార్యక్రమాలను ప్రజలకు మేలు జరిగేలా అమలు చేస్తున్నాడట. ఈ పథకాలతో ప్రజల్లో మంచి స్పందన వస్తోందని అంటున్నాడు. 

గత ఎన్నికల్లో ఓటిమి గురించి ఆలోచన వద్దని, నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని పార్టీ  చంద్రబాబు కుమారుడికి చెప్పారు. మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిచి చరిత్ర తిరగరాయాలని సూచించారు. గెలుపు ఖాయమనే ధీమాతో ఎక్కడా అలసత్వం వద్దని హెచ్చరించారు. ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పుకొచ్చారు. మంగళగిరి నుంచి మరోసారి బరిలో దిగేందుకు లోకేష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయ్యకూడదని సీఎం జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

అందుకు తగ్గట్టు వ్యూహాలు రూపొందిస్తున్నారు. అదే సమయంలో లోకేష్ ను మంగళగిరి నుంచి ఎలాగైనా గెలిపించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గ రివ్యూ చేశారు. నియోజకవర్గంలో గెలుపునకు అవసరమైన రూట్ మ్యాప్ ను చంద్రబాబు లోకేష్ కు అందించారు. మంగళగిరిలో లోకేష్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ వైసీపీ వ్యూహం మాత్రం చంద్రబాబుకు కంగారు పెడుతోంది. అక్కడ సిట్టింగ్ స్థానాన్ని మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం అధికం. అందుకే బీసీ కార్డు ప్రయోగించి లోకేష్ ను నిలువరించాలని జగన్ భావిస్తున్నారు. 

ఇప్పటికే బీసీ నాయకులను వైసీపీ వైపు తిప్పుకున్నారు. మరికొందర్ని రప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదే కానీ జరిగితే లోకేష్ కు ఇబ్బందే. ఎదురీదాల్సి ఉంటుంది. అయితే చంద్రబాబు అటు తన కుప్పంతో పాటు కుమారుడి మంగళగిరిపై ఫోకస్ పెట్టాలంటే కత్తిమీద సామే. కుమారుడ్ని చంద్రబాబు ఎంత ఎత్తడానికి ప్రయత్నిస్తున్నా ప్రతికూల పరిస్థితులు ఎదురుకావడంతో చంద్రబాబు ఓకింత అసహనంతో ఉన్నట్టు సమాచారం. అటు వైసీపీ సైన్యం మొత్తం చంద్రబాబు, లోకేష్ లపైనే మొహరించడం చూస్తుంటే.. మంగళగిరిలో గత ఎన్నికల్లో లోగా ప్రతికూల ఫలితం వస్తుందేమోనన్న బెంగ అటు చంద్రబాబు, ఇటు లోకేష్ లను వెంటాడుతోంది.

చంద్రబాబు రాజకీయంగా అటుపోట్లు చూశారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఏపీ సీఎంగా, విపక్ష నేతగా, అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. అటు జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు. కానీ కుమారుడు లోకేష్ కు మాత్రం మంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేకపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా జగన్ తండ్రి చాటున రాజకీయాలు ప్రారంభించారు. తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. పొలిటికల్ జర్నీని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు.

అయితే లోకేష్ విషయంలో మాత్రం అది జరగలేదు. లోకేష్ ను ఎమ్మెల్సీగా ఎన్నుకొని మంత్రిని  చేసిన చంద్రబాబు.. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం లోకేష్ ను గట్టెక్కించలేకపోయారు. రాజకీయంగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు నేరుగా పోటీచేయించాలి. కానీ దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇచ్చారు. అన్ని తెలిసిన చంద్రబాబు ఆదిలోనే తప్పు చేశారని విశ్లేషకులు తప్పుపట్టారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గ ఎంపిక కూడా ఒకరకమైన సాహసమే. అక్కడ ఓడిపోయినా మళ్ళీ రెండోసారి పోటీ చేయాలనుకోవడం కూడా సాహసమనే చెప్పొచ్చు.