తిరుప‌తిలో ప‌వ‌న్ ప్ర‌చారంపై క్లారిటీ

జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర‌దించుతూ… ఇరు పార్టీల నేత‌లు క‌లుసుకున్నారు. మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారు. విభేదాల‌కు ఆస్కారం లేకుండా క‌లిసి ముందుకు సాగాల్సిన అవ‌స‌రాన్ని ప‌ర‌స్ప‌రం…

జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి మ‌ధ్య గ‌త కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారానికి తెర‌దించుతూ… ఇరు పార్టీల నేత‌లు క‌లుసుకున్నారు. మ‌న‌సు విప్పి మాట్లాడుకున్నారు. విభేదాల‌కు ఆస్కారం లేకుండా క‌లిసి ముందుకు సాగాల్సిన అవ‌స‌రాన్ని ప‌ర‌స్ప‌రం గుర్తు చేసుకున్నారు. ఎలాగైనా తిరుప‌తిలో పాగా వేయాల‌ని గ‌ట్టి తీర్మానం చేసుకున్నారు. తిరుప‌తి ఉప ఎన్నిక బ‌రిలో పొత్తులో భాగంగా బీజేపీ త‌ర‌పు అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు బీజేపీ ఒంటెత్తు పోక డ‌ల‌పై మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన అసంతృప్తిగా ఉన్న‌ట్టు పెద్ద ఎత్తున వార్త‌లొచ్చాయి. పైగా జ‌న‌సేన‌తో సంబంధం లేకుండా బీజేపీ స‌మ‌న్వ‌య క‌మిటీలు ప్ర‌క‌టించ‌డంతో …కూట‌మిలో విభేదాల ప్ర‌చారానికి బ‌లం క‌లిగించిన‌ట్టైంది. అస‌లు ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు ఉన్న‌ట్టా?  లేన‌ట్టా? అనే అనుమానాలు కూడా త‌లెత్తాయి.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం హైద‌రాబాద్‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ర‌త్న‌ప్ర‌భ‌తో పాటు బీజేపీ అగ్ర‌నేత‌లు క‌లిశారు. ప‌వ‌న్‌ను ప్ర‌చారానికి రావాల‌ని బీజేపీ నేత‌లు ఆహ్వానించారు. అనంత‌రం నేడు ర‌త్న‌ప్ర‌భ నామినేష‌న్ వేసేందుకు ముందురోజు రాత్రి తిరుప‌తిలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది.

జ‌న‌సేన‌, బీజేపీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం జ‌ర‌గ‌డం, ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. ఈ స‌మావేశంలో జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌ క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్  త‌మ పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోరిన‌ట్టుగా బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం మంచి అభ్య‌ర్థిని బ‌రిలో నిలిపింద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి వారంలో ప‌వ‌న్ రానున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

క్షేత్ర‌స్థాయిలో రెండు పార్టీలు స‌మ‌న్వ‌యంతో క‌లిసి ప‌ని చేయాల‌నే సంక‌ల్పంతో తాను తిరుప‌తికి వ‌చ్చిన‌ట్టు మ‌నోహ‌ర్ తేల్చి చెప్పారు. మొత్తానికి తిరుప‌తిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌చారంపై ఓ క్లారిటీ వ‌చ్చింది. దీంతో బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ స‌మావేశంలో బీజేపీ రాష్ట్ర సోము వీర్రాజు, స‌హ ఇన్‌చార్జ్ సునీల్ దేవ‌ధ‌ర్‌, తిరుప‌తి అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ పాల్గొన్నారు.