మనిషన్న తర్వాత కాస్త కళా పోషణ ఉండాలంటారు. ఈ సూత్రీకరణను రాజకీయ నాయకులకు కూడా వర్తింప చేయాలి. ఎందుకంటే ఏదో రకంగా ఎదుటి వాళ్లను ఒప్పించి, మెప్పించి అనుకున్న లక్ష్యాలను సాధించిన వాళ్లే కార్యసాధకులవుతారు.
ఈ విద్యలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కొంచెం పూర్ స్టూడెంట్ అని విన్నాం. కానీ మారిన రాజకీయ పరిస్థితుల ప్రభావమో, తనపై సొంత పార్టీ నేతలే ఢిల్లీ పెద్దలకు చేస్తున్న ఫిర్యాదుల కారణమో తెలియదు కానీ, అందర్నీ కలుపుకోవడంలో ఇటీవల సోము వీర్రాజు కొంచెం చొరవ చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కడ, ఎవరికి, ఏమి చెప్పాలో ఆ మాటలు తీయగా చెబుతూ మొత్తానికి బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వ్యవహారశైలి చెబుతోంది. అవసరమైతే సరదా మాటలను కూడా సీరియస్‌గా ఎలా చెప్పాలో ఆయన ఇప్పుడిప్పుడే నైపుణ్యం సాధిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.
తిరుపతిలో ఎట్టకేలకు బీజేపీ, జనసేన నేతల మధ్య సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అసలే సోము వీర్రాజు ఒంటెత్తు పోకడలతో వ్యవహరిస్తూ, తమకు విలువ లేకుండా చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సమన్వయ కమిటీ సమావేశంలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు సోము వీర్రాజు జనసేన నేతలను ఫిదా చేసే మాటలు చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్‌కల్యాణే అని వీర్రాజు తేనెలాంటి మాటలు చెప్పుకొచ్చారు.
పనిలో పనిగా ఎవరిని తిడితే జనసేన నేతల మనసులను ఆకట్టుకుంటారో, ఆ రీతిలో మాట్లాడారు. సీఎం జగన్ చిట్టా సీబీఐ వద్ద ఉందన్నారు. జగన్ ఏం చేస్తున్నాడనేది కేంద్రం కూడా అనుక్షణం గమనిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తుందన్నారు.
మొత్తానికి సోము వీర్రాజు జనసేనను తన ట్రాప్‌లోకి తెచ్చుకునే ఎత్తుగడలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. జనసేన నేతలకు కావాల్సిందల్లా …పవన్ కల్యాణ్ సీఎం అయితారని చెబుతుండడం, అలాగే సీఎం జగన్‌ను తిడుతూ ఉండడం. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన సోము వీర్రాజు కూడా తనను తాను మార్చుకుని, ఎదుటి వాళ్ల మనసెరిగి ప్రవర్తించడం మొదలు పెట్టారు.
వీర్రాజు మనస్తత్వం తెలిసిన వాళ్లు … ఈయనకు ఈ కళ ఎప్పుడు అబ్బందబ్బా? అని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైతేనేం రాజకీయాల్లో రాణించాలంటే ఎలా ఉండాలంటే, సోము వీర్రాజు అలా ఉండేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది.