జనసేన, బీజేపీ మధ్య సంబంధాలపై అన్‌స్టాపబుల్ కామెడీ నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు రోజుకొకరు చొప్పున జనసేనతో పొత్తుపై సానుకూల ప్రకటనలు ఇస్తున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వర్గంగా గుర్తింపు పొందిన నాయకులు మాత్రమే జనసేనతో పొత్తు వుంటుందని ప్రకటనలు ఇస్తుండడాన్ని గమనించొచ్చు. సోము వీర్రాజు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ నాయకులు మాత్రం… పవన్‌తో పొత్తు చిత్తు అయ్యిందని లోలోన సంబరపడుతున్నారు.
ఇటీవల కన్నా లక్ష్మినారాయణ విమర్శలు ఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని జనసేన నేతలు మాట మాత్రం కూడా చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు జనసేనతో బీజేపీ ఒన్‌సైడ్ లవ్ సాగిస్తోందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వర్గంలోని నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడి మాదిరిగానే కామెడీ పండించారు.
బీజేపీ, జనసేన జంటను విడగొట్టడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. విష్ణు మాట్లాడింది నిజమే అని, ఆ జంటను మరొకరు విడగొట్టాల్సిన పనిలేకుండా, ఆ పని పవన్‌కల్యాణే చేస్తారనే సెటైర్స్ సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఒకవైపు నువ్వు లేక నేను లేను అంటూ చంద్రబాబు తోక పట్టుకుని పవన్ వెంటపడుతుంటే… ఇంకా పొత్తు వుంటుందని ఏ రకంగా బీజేపీ నేతలు చెబుతున్నారో వారికే తెలియాలని నెటిజన్లు అంటున్నారు.
పనిలో పనిగా ఆర్జీవీపై కూడా విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం జగన్‌తో భేటీ తర్వాత రాజకీయ కథాంశంగా సినిమా తీయనున్నట్టు ఆర్జీవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై విష్ణు విమర్శలు గుప్పించారు. ప్రచారం కోసం పరితపించే వ్యక్తి ఆర్జీవీ అని అన్నారు. ఆర్జీవీ లాంటి పిచ్చోడికి రాయి ఇస్తే మనమీదే పడుతుందని విష్ణు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.