తమిళనాడు బీజేపీ మహిళా నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూపై డీఎంకే నేత సైదై సాదిక్ తీవ్ర అభ్యంతరకర, అనుచిత వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళాలోకాన్ని కించపరిచేలా దూషణలు వుండడంపై రాజకీయాలకు అతీతంగా ఖండిస్తున్నారు. డీఎంకే నేత అనుచిత వ్యాఖ్యలను స్వయంగా ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనీమొళీ ట్విటర్ వేదికగా తప్పు పట్టడం గమనార్హం. ముఖ్యంగా ఖుష్బూను టార్గెట్ చేస్తూ వేశ్యగా అనడంపై అన్ని పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
తనపై అనుచిత వ్యాఖ్యలను ఖుష్బూ సున్నితంగా, బలంగా తిప్పికొట్టారు. ‘పురుషులు మహిళలను మగవాళ్లు దూషించడం, అది వారి పెంపకాన్ని తెలియజేస్తోంది. మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారెంత విషతుల్యమైన మనుషులో అందరికీ తెలిసొస్తోంది. మహిళల గర్భాన్ని కూడా అలాంటి మగవాళ్లు అవమానిస్తారు. గౌరవ సీఎం ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో ఇది కొత్త ద్రావిడ నమూనా పాలన ఇదేనా?’ అని ఖుష్బూ తన ఆవేదనను అక్షరీకరించారు. తనపై అనుచిత వ్యాఖ్యలను పురుష అహంకార సమాజ కోణంలో ఖుష్బూ చూడడాన్ని గమనించొచ్చు.
ఖుష్బూకు డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనీమొళీ నుంచి మద్దతు లభించడం విశేషం. రాజకీయంగా వేర్వేరు అయినప్పటికీ సాటి మహిళా నాయకురాలిగా కనీమొళీ అండగా నిలవడం ప్రశంసలు అందుకుంటోంది. ఈ మేరకు ఆమె చేసిన ట్వీట్ ఏంటంటే…
‘అతని వ్యాఖ్యలపై ఓ మహిళగా, మనిషిగా క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారెవరైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ పార్టీ వారైనా సహించే ప్రశ్నే లేదు. ఇందుకు నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పగలను. ఎందుకంటే మా నాయకుడు ఎంకే స్టాలిన్, మా పార్టీ అరివాలయం ఇలాంటి వాటిని క్షమించదు’ అని ఆమె ట్వీట్ చేశారు. కనీసం తమ పార్టీ నాయకుడిని వెనకేసుకు రావాలనే రాజకీయ కోణంలో సీఎం సోదరి ఆలోచించడం గమనార్హం.