అచ్చెన్న కంటే అమాయకుణ్ణి

లోకేష్ మాటలు నేర్చారు. బాగానే వల్లిస్తున్నారు. చాలా విషయాల్లో తండ్రి చంద్రబాబుని కూడా మించిపోతున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈ ఎస్ ఐ స్కాంలో అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పడానికి నిమ్మాడ  వచ్చిన…

లోకేష్ మాటలు నేర్చారు. బాగానే వల్లిస్తున్నారు. చాలా విషయాల్లో తండ్రి చంద్రబాబుని కూడా మించిపోతున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని ఈ ఎస్ ఐ స్కాంలో అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పడానికి నిమ్మాడ  వచ్చిన లోకేష్ బాబు తాను అచ్చెన్న కంటే అమాయకుడిని అని చెప్పుకోవడమే అసలైన‌ విశేషం, విడ్డూరం.

ఫైబర్ గ్రిడ్ స్కాం లో తన పేరును మంత్రులు చెబుతున్నారని, అయితే తాను పరమ అమాయకుడిని అని లోకేష్ బాబు చెప్పుకున్నారు. ఫైబర్ గ్రిడ్ తన పరిధిలోనిది కాదు, అది మౌలిక వసతుల కల్పన మంత్రిత్వ శాఖ కిందకు వస్తుందని లోకేష్ మరింత అమాయకంగా చెబుతున్నారు.

సరే ఇన్ని చెప్పిన లోకేష్ ఫైబర్ గ్రిడ్ లో స్కాం జరగలేదు అని మాత్రం చెప్పకపోవడమే విచిత్రం. ఇక అచ్చెన్నాయుడు విషయంలోనూ ఇదే కధ వినిపించారు. ఈ ఎస్ ఐ స్కాం జరగలేదు అనడంలేదు, అందులో అచ్చెన్నాయుడు  పాత్ర లేదు అని మాత్రమే అంటున్నారు.

తాను మంత్రిగా రోజుకు వంద సిఫార్సులు చేశానని, మంత్రులుగా అది తమ బాధ్యత అంటూ చెబుతున్న లోకేష్ నిజంగా అవినీతికి సమర్ధిస్తున్నారో వెనకేసుకువస్తున్నారో అర్ధం కావడంలేదు. ఇక అచ్చెన్నను పరామర్శించడానికి వచ్చిన చినబాబు తనను అరెస్ట్ చేయడానికి చూస్తున్నారని పదే పదే చెప్పుకోవడంతో అది పరామర్శా, లేక తనకు తమ్ముళ్ళు సానుభూతి చూపాలనుకుంటున్నారా అన్నది అర్ధం కాని పరిస్థితే. మొత్తానికి చినబాబు గతం కంటే మాటలు బాగానే మాట్లాడుతున్నారు.

తడబాటు లేదు, కానీ లాజిక్ మాత్రం పక్కాగా మిస్ అవుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. లేకపోతే కుంభకోణాలు జరగడంలేదు అని ఎందుకు చెప్పలేకపోతున్నారని కూడా వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇన్ని విషయాలు తడబాటు లేకుండా మాట్లాడిన లోకేష్ విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ పేరుని  మాత్రం మానసా ట్రస్ట్ అనడం ద్వారా పాత లోకేష్ నెనని అనిపించుకోవడమే కొసమెరుపు.

నాయకుడంటే అర్థం తెలిసింది