మూడోసారి ప్ర‌ధాని పెళ్లి వాయిదా

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెళ్లి అనేది ఓ మ‌ధుర ఘ‌ట్టం. పెళ్లి గురించి తియ్య‌టి క‌ల‌లు క‌న‌డం అద్భుత అనుభూతి క‌లిగిస్తుంది. అలాంటి ఓ గొప్ప కార్యం మూడోసారి కూడా వాయిదా వేసుకున్న ఘ‌ట‌న…

ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెళ్లి అనేది ఓ మ‌ధుర ఘ‌ట్టం. పెళ్లి గురించి తియ్య‌టి క‌ల‌లు క‌న‌డం అద్భుత అనుభూతి క‌లిగిస్తుంది. అలాంటి ఓ గొప్ప కార్యం మూడోసారి కూడా వాయిదా వేసుకున్న ఘ‌ట‌న తాజాగా వెలుగు చూసింది. మ‌నువాడాల్సిన వ్య‌క్తి సాదాసీదా మ‌నిషి కాదు. డెన్మార్క్ ప్ర‌ధాని మిట్టే ఫ్రెడ్రిక్‌స‌న్ త‌న దేశం కోసం ముచ్చ‌ట‌గా మూడోసారి పెళ్లి వాయిదా వేసుకోవ‌డం యావ‌త్ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

కోవిడ్‌-19 కార‌ణంగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో సామాన్యులు మొద‌లుకుని సెల‌బ్రిటీల వ‌ర‌కు ఎంతో మంది పెళ్లిళ్ల‌ను వాయిదా వేసుకోవ‌డం క‌థ‌లుక‌థ‌లుగా విన్నాం. కానీ డెన్మార్క్ ప్ర‌ధాని మూడోసారి పెళ్లి వాయిదా వేసుకోడానికి మాత్రం కోవిడ్‌-19 కార‌ణం కాదు. ఎంతో కీల‌క‌మైన ఐరోపా స‌మాఖ్య స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు వివాహాన్ని వేసుకోవాల్సి వ‌చ్చింది.

గ‌తంలో కోవిడ్‌-19 య‌థేచ్ఛ‌గా వ్యాప్తి చెందుతుండ‌డం, లాక్‌డౌన్ విధించిన కార‌ణంగా రెండుసార్లు త‌న పెళ్లిని డెన్మార్క్ ప్ర‌ధాని వాయిదా వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా డెన్మార్క్ ప్ర‌ధాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర సందేశాన్ని వెల్ల‌డించారు.

‘ఈ అద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఎంతో ఉద్వేగంగా, ఉత్సాహంగా  వేచి చూస్తున్నా’ అంటూ తన కాబోయే భర్త ‘బో’తో కలిసున్న ఫొటోను ఆమె ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశారు. త్వ‌ర‌లో తామిద్ద‌రూ పెళ్లి అనే బంధంతో ఒక్క‌టి కానున్నామ‌ని తెలిపారు. తానే కాదు, త‌న‌కు కాబోయే జీవిత భాగ‌స్వామి కూడా అద్భుత‌మైన ఆ రోజు కోసం ఎంతో ఓపిక‌గా ఎదురు చూస్తున్నార‌న్నారు.

త‌మ పెళ్లికంటే దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా శ‌నివారం బ్ర‌సెల్స్‌లో జ‌రిగే   ఐరోపా స‌మాఖ్య స‌ద‌స్సు ముఖ్య‌మైన‌దిగా భావించి మూడోసారి పెళ్లి వాయిదా వేసుకున్న‌ట్టు ఆమె చెప్పుకొచ్చారు. కానీ పెళ్లి వాయిదా వేసుకోవ‌డం, దాని కోసం ఎదురు చూడ‌డం మాట‌ల్లో చెప్పేంత సుల‌భం కాద‌ని ఆమె తెలిపారు.

తాము వివాహ బంధంతో ఒక‌టి కావాల‌నుకున్న రోజే బ్ర‌సెల్స్‌లో స‌ద‌స్సు జ‌రుగుతుండ‌డాన్ని ఆమె ఓ ప్ర‌త్యేక ప‌రిస్థితిగా అభివ‌ర్ణించారు. డెన్మార్క్ దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మూడోసారి పెళ్లి వాయిదా వేసుకున్న ప్ర‌ధానిపై ప్ర‌పంచ వ్యాప్తంగా నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

నాయకుడంటే అర్థం తెలిసింది

మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ?