'ఫెయిర్ అండ్ లవ్లీ.. ఇక నిగారింపును ఇవ్వదు..' అంటూ అమ్మాయిలను అవాక్కయ్యేలా నటి యామీ గౌతమ్ యాడ్ లో పలకరిస్తూ ఉంటుంది. అదేమంటే.. మామూలుగా నిగారింపును ఇవ్వకుండా హెచ్ డీ నిగారింపును ఇస్తుందంటూ ఆమె పంచ్ లైన్ చెబుతూ ఉంటుంది! జనాలకు ఈ ఫెయిర్నెస్ క్రీమ్ తో ఉన్న అనుబంధం ఏమిటో చెప్పనక్కర్లేదు. ఇరవై, ఇరవై ఐదేళ్ల సంవత్సరాల నుంచి ఇండియాలో ఫెయిర్ అండ్ లవ్లీ ప్రభంజనం మొదలైంది. ఐదురూపాయలకే అందుబాటులోకి పెట్టేసి ఇది అప్పటి యువతకు విపరీతంగా చేరువై పోయింది.
20 యేళ్ల కిందట, అమ్మాయిలు-అబ్బాయిలు ఈ ఫెయిర్ నెస్ క్రీమ్ ను వాడటాన్ని ఎంతగా ఆస్వాధించారో తెలిసే ఉంటుంది. ఐదు రూపాయలకే అందుబాటులోకి రావడం అనేది మధ్యతరగతి యువతకు బాగా చేరువ చేసేసింది. అప్పట్లో కాలేజీకి బయల్దేరే ముందు ఈ క్రీమ్ వాడకుండా గడపదాటే టీనేజర్లు, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉండరేమో! ఆ స్థాయిలో ఇది అల్లుకుపోయింది.
ఆ తర్వాత రకరకాల క్రీమ్ లు వచ్చాయి. ఇండియాలో ఇది పెద్ద వ్యాపారం. తెల్లగా ఉండాలి, స్కిన్ ఫెయిర్ గా కనిపించాలనే కోరిక భారతీయులకు ఎంతలా ఉంటుందో వివరించనక్కర్లేదు. ఐదు రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ షాషేతో మొదలు పెడితే.. వందల, వేల రూపాయల క్రీమ్ లను వాడే వాళ్లు ఉన్నారు. అందరి లక్ష్యం ఒక్కటే, తెల్లగా కనిపించాలి, నిగారించాలి!
అందుకు తగ్గట్టుగా వీటి యాడ్స్ కూడా అలానే ఉంటాయి. నల్లగా ఉండే వారికి ఆత్మవిశ్వాసం ఉండదు, ఫెయిర్ అండ్ లవ్లీ పట్టించేసుకోగానే.. ఎయిర్ హోస్టెస్ అయిపోవచ్చు, క్రికెట్ కామెంటరేటర్ గా రాణించేయవచ్చు అన్నట్టుగా దశాబ్దాల నుంచి యాడ్స్ దంచేస్తూ ఉన్నారు. ఇది ఒకరకంగా వర్ణ వివక్షను ప్రోత్సహించేది, నల్లని శరీర ఛాయతో ఉన్న వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేదే అని చెప్పనక్కర్లేదు. ఈ క్రీమ్ లు జనాలను తెల్లగా ఏం మారుస్తాయో కానీ, ఆ యాడ్స్ ఫెయిర్ గా లేని వారి కాన్పిడెన్స్ ను మాత్రం దెబ్బతీస్తూ ఉంటాయి.
ఈ క్రమంలో వీటిపై విమర్శలు ఈనాటివి కావు. వీటిని ఎండోర్స్ చేసే హీరోయిన్ల మీద కూడా అనేక మంది దుమ్మెత్తిపోశారు. ఇక అంతర్జాతీయంగా ఈ తరహా వివక్షలపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో యూనీలీవర్ సంస్థ స్పందించింది. తమ ప్రోడక్ట్ అయిన ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్చబోతున్నట్టుగా ప్రకటించింది. వేరే పేరును వెదుకుతున్నట్టుగా పేర్కొంది. అలాగే ఆ క్రీమ్ ఎప్పటిలానే అందుబాటులో ఉంటుందని, అయితే ఇక నుంచి వైట్, ఫెయిర్ నెస్ .. అనే మాటలను ఉపయోగించేది ఉండదని తెలిపింది. యూనీలీవర్ కు చెందిన ఇతర ప్రోడక్ట్స్ విషయంలో కూడా రంగు విషయంలో వివక్షను చూపే అన్ని యాడ్స్ కూ అడ్డుకట్ట వేయనున్నట్టుగా ప్రకటించింది!