అంతా మోడీ మాయ.. పెట్రోల్-డీజిల్ ఏకమైన వేళ

సాధారణంగా పెట్రోల్ రేటు కంటే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధరల నియంత్రణను చమురు కంపెనీలకు కేంద్రం కట్టబెట్టిందో, అప్పుడే పెట్రోల్-డీజిల్ ధరలు ఏకమౌతాయని చాలామంది ఊహించారు. ఇప్పుడా రోజు రానే…

సాధారణంగా పెట్రోల్ రేటు కంటే డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధరల నియంత్రణను చమురు కంపెనీలకు కేంద్రం కట్టబెట్టిందో, అప్పుడే పెట్రోల్-డీజిల్ ధరలు ఏకమౌతాయని చాలామంది ఊహించారు. ఇప్పుడా రోజు రానే వచ్చింది.

గడిచిన 20 రోజులుగా పెరుగుతున్న ధరలతో పెట్రోల్, డీజిల్ రేట్లు ఏకమయ్యాయి. ఢిల్లీలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల 13 పైసలుగా ఉంటే.. లీటర్ డీజిల్ ధర 80 రూపాయల 19 పైసలుగా ఉంది. ఇంకా చెప్పాలంటే పెట్రోల్  ధర కంటే డీజిల్ ధర కాస్త ఎక్కువగానే నమోదైంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం

భారతదేశ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో గడిచిన 20 రోజులుగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దేశంలో మారిన ఆర్థిక పరిస్థితుల కారణంగా పెట్రో-డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు.

ఈనెల 7వ తేదీ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు పెట్రోల్ పై 8 రూపాయల 93 పైసలు, డీజిల్ పై 10 రూపాయల 7 పైసలు ధరలు పెరిగాయి. మరో వారం రోజులు పరిస్థితి ఇలానే
కొనసాగుతుందంటున్నారు నిపుణులు.

లాక్ డౌన్ తో చమురు సంస్థలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. వాటిని పూడ్చుకునేందుకు ఇలా ప్రతి రోజూ పెట్రోల్-డీజిల్ రేట్లు పెంచుతున్నాయి. అయితే సగటు వినియోగదారుడిపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

లాక్ డౌన్ తో దేశం ఆర్థికంగా కుంగిపోయింది. రావాల్సిన ఆదాయ తగ్గిపోయింది. ఇలాంటి టైమ్ లో పెట్రోల్ పై పన్ను తగ్గించడానికి కేంద్రం సముఖంగా లేదు. అందుకే ఓవైపు రేట్లు పెరుగుతున్నప్పటికీ మోడీ సర్కార్ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది.

ఇటు రాష్ట్ర ప్రభుత్వాల పరిస్థితి కూడా అలానే ఉంది. లాక్ డౌన్ తో ఆదాయం బాగా పడిపోవడంతో.. ఇప్పటికిప్పుడు పెట్రోల్-డీజిల్ పై విధిస్తున్న స్థానిక పన్నుల్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడడం లేదు.

ఈ పరిస్థితులన్నీ కలిపి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ తో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. మరికొంతమంది సగం జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పెట్రోల్-డీజిల్ ధరలు పెరిగాయంటే.. దానర్థం నిత్యావసరాల ధరలు  కూడా పెరుగుతాయన్నమాట. సో.. చమురు ధరల పెంపు అనేది సగటు భారతీయుడిపై పరోక్షంగా పెను ప్రభావం చూపించబోతోంది. ఆ దుష్ప్రభావం ఇప్పటికే మొదలైంది కూడా.

నాయకుడంటే అర్థం తెలిసింది