న్యాయ సలహాదారుల విషయమై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ న్యాయ విభాగ సర్కిల్స్‌లో విస్తృత చర్చకు దారి తీసింది. న్యాయ విభాగంలో ఇటీవలి నియామకాలపై వైసీపీ న్యాయవాదుల్లో అసంతృప్తి ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఈ సందర్భంగా తిరుమలశెట్టి కిరణ్ అనే న్యాయవాది గురించి వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైసీపీ నియామకాల్లో ఈ దుస్థితి ఉండడం వల్లే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందంటున్నారు.
“న్యాయ సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వడం లేదు. కోర్టుకు సైతం న్యాయ సలహాదారులు సరిగ్గా సహకరించడం లేదు. న్యాయ స్థానాలకు తగిన రీతిలో సహకరించకపోవడం వల్లే మేము జోక్యం చేసుకోవాల్సి వస్తోంది” అని హైకోర్టు వ్యాఖ్యానాలను ఉదహరిస్తూ వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ఇటీవల జీపీ నియామకాల్లోని డొల్లతనం గురించి విమర్శలు గుప్పిస్తున్నారు.
రెండు వారాల క్రితం ఏపీ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులు (జీపీ) వెంకట్రావు, హబీబ్ షేక్, గెడ్డం సతీష్‌బాబు రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు రాజీనామాలు చేయడం గమనార్హం. వీరి స్థానంలో తిరుమలశెట్టి కిరణ్, వడ్డిబోయిన సుజాత, జె.సుమతిలను నియమిస్తూ ఈ నెల 11న న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి ఉత్తర్వులిచ్చారు.
వీరంతా అడ్వొకేట్ జనరల్ పర్యవేక్షణ, నియంత్రణలో బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. వీరికి గౌరవ వేతనం, అలవెన్సుల కింద ప్రభుత్వం నెలకు రూ.లక్ష చెల్లించనుంది. మరీ ముఖ్యంగా న్యాయ సంబంధ పదవుల నియామకాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. సహజంగా ఏ ప్రభుత్వమైనా పార్టీ సానుభూతి పరులను, అధినేతను అభిమానించే వారికే ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.
కానీ ఈ విషయంలో జగన్ సర్కార్ రూటే సపరేటు అంటోంది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తిరుమలశెట్టి కిరణ్ అనే న్యాయవాది సోషల్ మీడియా వేదికగా జనసేన గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, తెలుగుదేశం పార్టీ విధానాలను తన ఫేస్‌బుక్ పేజీలో తూర్పారపట్టారు. ప్రస్తుతం ఆయన ఫేస్‌బుక్ పేజీలను స్క్రీన్ షాట్ తీసి వైసీపీ శ్రేణులు తమ సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేశాయి. కీలక న్యాయ విభాగాల్లో ముందూవెనుకా ఆలోచించకుండా, ఎవరేమిటో తెలుసుకోకుండా పదవులు కట్టబెట్టడంపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
ఇప్పటికీ తిరుమలశెట్టి కిరణ్ ఫేస్‌బుక్ పేజీలో సార్వత్రిక ఎన్నికల ముందు డేట్లలో ఉన్న పోస్టింగ్‌లు చూస్తే…వైసీపీకి వ్యతిరేకంగా ఎలా పనిచేశారో అర్థమవుతుంది. ఉదాహరణకు కొన్నింటిని ప్రస్తావిద్దాం.
తెలుగుదేశం, వైసీపీ గెలిస్తే…
వాళ్ల ఆస్తులు పెరుగుతాయి. వాళ్ల కేసులు మాఫీ. మనకి అదే పుచ్చిపోయిన బియ్యం, గ్యాస్ ఖర్చు
జనసేన గెలిస్తే…
మన కుటుంబాలు బాగుపడతాయి. బియ్యం బదులు రూ.2,500 నుంచి రూ.3500. వండుకోడానికి గ్యాస్ ఉచితం. వికలాంగులకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు. వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు….సామాన్యుడి సేన పేరుతో 2019, ఏప్రిల్ 10న పెట్టిన పోస్టింగ్‌ను ప్రస్తుత జీపీ తిరుమలశెట్టి కిరణ్ నాడు షేర్ చేశారు.
ఇలా జనసేనకు అనుకూలంగా అనేక పోస్టులను షేర్ చేయడంతో పాటు తనే కొన్ని స్వయంగా పెట్టడాన్ని తిరుమలశెట్టి కిరణ్ ఫేస్‌బుక్ పేజీలో ఇప్పటికీ చూడొచ్చు. అయితే వ్యక్తుల ఇష్టాయిష్టాలను తప్పు పట్టే హక్కు ఎవరికీ లేదు. మనం అభిమానిస్తున్న వారినే ఇతరులు కూడా అభిమానించాలనుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి లేదు. కానీ సమస్యల్లా ఎక్కడంటే…వైసీపీ ముద్ర వేసుకుని , జగన్‌ను సీఎంగా చూడాలనే తపనతో పనిచేసిన, ఇబ్బందులు పడ్డ న్యాయవాదులను…అధికారంలోకి వచ్చాక విస్మరించడమే.
అలాంటి వారికి మాత్రం సరైన న్యాయం జరగలేదనేందుకు ఇలాంటి నియామకాలే నిదర్శనమంటూ వైసీపీ సోషల్ మీడియాలో సరికొత్త వాదన తాజాగా తెరపైకి వచ్చింది. నాలుగు నెలల క్రితం టీటీడీలో కూడా చంద్రబాబుపై పీహెచ్‌డీ చేసిన వ్యక్తి పోస్టును రెగ్యులర్ చేయడం వివాదాస్పదమైంది. ఈ విషయం చివరికి సీఎం జగన్‌కు తెలిసి…నియామకాన్నే రద్దు చేశారు.
ప్రస్తుతం జీపీల నియామకాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో కొందరు న్యాయవాదులున్నట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా గ్రూపుల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే చర్చ కూడా మరోవైపు నడుస్తోంది. ఇలాంటి నియామకాలు మరెన్ని జరిగాయో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఎంతో నమ్మకంతో సీఎం జగన్ కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగిస్తే…వారు తమ ఇష్టానుసారం నామినేటెడ్, ఇతర పదవుల్లో నియమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిజంగా పార్టీ కోసం పనిచేసిన వారికంటే…పైరవీలకే ప్రాధాన్యం దక్కుతుందనే విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.