కొండకు దారం కడితే గులకరాయి వచ్చిందే!

సినీ నటుడు ఆలీ కొండకు దారం కట్టారు. వస్తే కొండ.. పోతే దారం.. అని నిమ్మళంగా కూర్చున్నారు. సహనంగానే వేచి చూశారు. కాలం గడిచింది. ఈలోగా కట్టిన దారానికి ఫలితం వచ్చింది.. కొండ కాదు,…

సినీ నటుడు ఆలీ కొండకు దారం కట్టారు. వస్తే కొండ.. పోతే దారం.. అని నిమ్మళంగా కూర్చున్నారు. సహనంగానే వేచి చూశారు. కాలం గడిచింది. ఈలోగా కట్టిన దారానికి ఫలితం వచ్చింది.. కొండ కాదు, ఓ గులకరాయి వచ్చింది. పరిస్థితి చూస్తే ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. రాజ్యసభ ఎంపీ పదవిని ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి ఆశ్రితుడిగా ఆశలు పెంచుకున్న సినీ నటుడు ఆలీ ని ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి వరించింది.

సినీ నటుడు ఆలీకి రాజకీయ కోరిక ఈనాటిది కాదు. ఎంపీ కావాలనే ఆశతో ఆయన గతంలోనూ రకరకాలుగా రాజకీయ గంతులు వేశారు. ఏవీ పెద్దగా ఫలించలేదు. చివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఏకంగా రాజ్యసభ ఎంపీ పదవిని టార్గెట్ చేశారు. పార్టీ వర్గాల ద్వారా ప్రచారంలోకి వచ్చిన లీకులు, రాజకీయ వాతావరణం అన్ని ఆలీకి అనుకూలంగా ఉన్నట్లుగానే కనిపించాయి. 

ఆలీ కూడా చాలా లౌక్యంగా తన సేవలను ఏరకంగా వాడుకోవాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని మాత్రమే మీడియా ముందు ప్రకటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఎంపీ పదవులకు పేర్లను ప్రకటించే సమయానికి ఆలీకి అందులో చోటు దక్కలేదు. తన నిరాశను బయటపడనివ్వకుండా ఆలీ మౌనంగా ఉండిపోయారు. ఇన్నాళ్లకు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవి లభించింది.

నిజానికి ఆలీకి ఈ సలహాదారు పదవి అనేది కంటి తుడుపుగా ఇచ్చిన వ్యవహారమే తప్ప ఆయనకు పెద్దగా ఉపయోగపడేది లాభించేది కాదు. జగన్ ప్రభుత్వంలో బోలెడు మంది సలహాదారులు ఉన్నారు. వారికి మూడు లక్షల రూపాయల వేతనం కొన్ని అలవెన్సులు అధికార హోదాలు అన్నీ కలిపి ఐదు లక్షల రూపాయల మేరకు నెలసరి గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. 

రాజకీయ నిర్వాసితులు, జగన్ ఆశ్రితులు, విధేయులు, మరో రకంగా గత్యంతరమూ ప్రత్యామ్నాయ ఉపాధి లేని వారికి మాత్రమే సలహాదారుల పదవి సరైనది. ఒకరిద్దరి విషయంలో మినహా తతిమ్మా సలహాదారుల పదవులన్నీ ఇప్పటిదాకా అలాగే జరుగుతూ వస్తున్నాయి. 

ఆలీకి కూడా అలాంటి  కంటి తుడుపు పదవి ఇవ్వడం గౌరవప్రదం ఏమీ కాదు. ఆలీ ఒక రోజుకు కనీసం రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే నటుడు. చేస్తే చేతినిండా సినిమాలు కూడా ఉంటాయి. కానీ టీవీ కార్యక్రమాల ప్రయోక్త గానే బిజీగా గడుపుతున్నాడు. నెలకు 5 లక్షల రూపాయల గౌరవ వేతనం ఆలీకి ఒక లెక్కలోనిది కాదు. పోనీ అధికార పదవి ఉంది కదా అనుకుంటే, ఈ రూపంలో ఆయన ఆశించినది కాదు. అందుకే ఈ నియామకం గమనించినప్పుడు ఆలీ– కొండకు దారం వేస్తే గులకరాయి లభించింది అని అనుకోవాల్సి ఉంటుంది!