‘పోలవరం’ పాపం బాబుకు చుట్టుకుంటుందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గతంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నిగ్గు తేల్చడానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. అవినీతి జరిగిన మాట వాస్తవమేనని ఆ కమిటీ…

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గతంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నిగ్గు తేల్చడానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. అవినీతి జరిగిన మాట వాస్తవమేనని ఆ కమిటీ లెక్కతేల్చింది. ఎవరి పాత్ర ఎంత? అవినీతి మోతాదు ఎంత? అనే వివరాలు ఇంకా బయటకురాలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అంతకంటే భారీగా, నిర్వాసితులకు పరిహారం చెల్లించే విషయంలో, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఇప్పుడు ప్రధానంగా తెరమీదకు వస్తున్నాయి. చూడబోతే ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు మెడకు చుట్టుకునే ప్రమాదం పొడసూపుతోంది.

పోలవరం డ్యాం నిర్మాణం విషయంలో అత్యంత పెద్ద ఆర్థికభారం నిర్వాసితులకు పరిహారం చెల్లించడమే. ప్రాజెక్టు నిర్మాణానికి, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే కూడా ఎక్కువ మొత్తం నిర్వాసితులకే ఇవ్వాలి. పోలవరం డ్యాం వలన పరిసర మండలాల్లోని అనేక గ్రామాలను ఖాళీ చేయించాల్సి వస్తుంది. వీరిలో ప్రధానంగా గిరిజనులు అంతకంటే వెనుకబడిన వర్గాల వారు ఎందరో ఉన్నారు. వీరిని మోసం చేసి, బినామీ పేర్లు సృష్టించి నిర్వాసితులకు పరిహారం పేరుతో వందల వేల కోట్లు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రేషన్ డీలర్ల నుంచి మంత్రుల వరకు అందరికీ ఇందులో పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలు కొత్తగా వినిపిస్తున్నవి కాదు. చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నప్పుడు కూడా విస్తృతంగా వినిపించాయి. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ- తెరవెనుక నుంచి పరిహారం చెల్లింపులో అవినీతిని వెలికిలాగే ప్రయత్నం చేస్తున్నట్లుగా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇందులో ఇరుక్కునే అవకాశం పుష్కలంగా ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు.

పోలవరం నిర్వాసితుల సంక్షేమ సమితి పేరిట ఒక పోరాటం ప్రారంభమైంది. ఆ పోరాటానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కూడా జతకలిసింది. వీరిద్దరూ కలిసి నిర్వాసితుల కోసం పోరాటాన్ని ఉధృతం చేశారు. ఈ రెండు వ్యవస్థలు కలిసి చేస్తున్న పోరాటానికి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సారథ్యం తీసుకుంది.

అంతాకలిసి, పోలవరం ఇంజినీర్లను, అలాగే ప్రాజెక్టు అథారిటీ వారిని కూడా కలిశారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పోలవరం అధికారులకు మౌఖిక ఆదేశాలు వచ్చినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. కేంద్రం సూచనలతో అథారిటీ గనుక అవినీతిని లెక్క తేల్చే పనిలో పడితే పరిహారంలో నిధులు బొక్కిన నాయకులకు చిక్కులు తప్పవని అర్థమవుతోంది.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!