రాజధాని వ్యవహారంపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు పెట్రోల్ పోసి ఈ వ్యవహారం పై రచ్చరేపింది తెలుగుదేశం పార్టీ. రాజధాని తరలించేస్తున్నారు.. అక్కడి రైతులు అన్యాయం అయిపోతున్నారంటూ.. తెలుగుదేశం పార్టీ వాదన మొదలుపెట్టింది. అయితే అక్కడ భూములు ఇవ్వడానికే కొంతమంది రైతులు వెనుకడుగు వేశారు. ఏదో కొద్దిమేర మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయనేది కూడా తెలుగుదేశం వాళ్ల వాదనే!
తనపై నమ్మకంతో రైతులు భూములు ఇచ్చారని చంద్రబాబు చెబితే, రైతుల నుంచి ప్రభుత్వానికి జరిగిన రిజిస్ట్రేషన్లే కొద్దిమేర అని తెలుగుదేశం నేతలు ఇప్పుడు చెబుతూ ఉన్నారు. వాళ్లలోనే చాలా గందరగోళం కనిపిస్తూ ఉంది. ఆ సంగతలా ఉంటే.. రాజధాని గురించి మరోసారి స్పందించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని ఏదో ఒక సామాజికవర్గం సొంతం అయితే చాలదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇలా నర్మగర్భంగా మాట్లాడారు ఆయన. అంతే కాదు.. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి వ్యయం ఎక్కువ అవుతుందనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వానికి అయినా, ప్రైవేట్ వ్యక్తులకు అయినా అక్కడ నిర్మాణవ్యయం ఎక్కువవుతుందని వ్యాఖ్యానించారు.
కృష్ణానదికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద వస్తేనే రాజధానిలో కొంత ప్రాంతం వరద ప్రభావితం అయ్యిందని, అదే పదకొండు లక్షల క్యూసెక్కుల వరద వస్తే మొత్తం ప్రాంతం మునిగిపోతుందని ఆయన వివరించారు. రాజధానిని మారుస్తున్నట్టుగా ఆయన ఇప్పుడు కూడా చెప్పలేదు.
అమరావతిలో పరిస్థితి గురించి మాత్రం బొత్స వివరించే ప్రయత్నం చేశారు. ఇక రాజధాని విషయంలో పవన్ కల్యాణ్ స్పందన గురించి బొత్స రియాక్ట్ అయ్యారు. ఆయన స్పందన ఏదో ద్వంద్వర్థంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు.