క్షణం, రాక్షసుడు, ఎవరు ఇలా థ్రిల్లర్ జోనర్ సినిమాలను జనం మెచ్చుకోవడంతో అలాంటి సినిమాల కోసం వేట మొదలయింది. ఆ మధ్య బాలీవుడ్ లో వచ్చిన అంథాదూన్ సినిమా మీద దృష్టిపడింది. దాంతో చాలామంది ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు, నాలుగు బ్యాచ్ లు ట్రయ్ చేయడం ప్రారంభించారు.
గీతా ఆర్ట్స్ కోసం అల్లుఅరవింద్ ఈ సినిమా హక్కులు కొనాలని చూస్తున్నారు. ఈ సినిమాను మరి అల్లుశిరీష్ తో రీమేక్ చేస్తారో లేదా, వేరే హీరో కోసమో అన్నది తెలియాల్సి వుంది.
రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన కోనేరు సత్యనారాయణ కూడా ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. మరో నిర్మాత అభిషేక్ నామా ఆయనతో జత కలిసారు.
మరోపక్కన హీరో రవితేజ కూడా ఈసినిమా చేయాలని అనుకుంటున్నారు. అందువల్ల ఆయన కూడా ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు.
వీళ్లందరూ ఇలా వుంటే నైజాం ఏస్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఆసియన్ సునీల్, రామ్మోహనరావు కలిసి కూడా ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇంతమంది వెంటబడుతుంటే అంథాదూన్ హిందీ వెర్షన్ నిర్మాతలు అయిన వయాకామ్ వాళ్లు చెట్టెక్కి కూర్చున్నట్లు తెలుస్తోంది. రెండున్నర నుంచి మూడు కోట్లు ప్లస్ లాభాల్లో వాటా ఇవ్వాలని, తమ బ్యానర్ యాడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండున్నర కోట్ల వరకు ఓకె కానీ, మళ్లీ లాభాల్లో వాటా అనేసరికి వెనుకంజ వేస్తున్నట్లు బోగట్టా.