తెలుగు నేర్చుకోండి.. ఆంగ్లం చదువుకోండి

తెలుగు భాష గొప్పదే. దానిని అంతా కాపాడుకోవలసిందే. అదే సమయంలో తెలుగు యువత జీవితాలు కూడా అంతకన్నా గొప్పవి. వారు జీవితం నిలబెట్టుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా అద్యయనం…

తెలుగు భాష గొప్పదే. దానిని అంతా కాపాడుకోవలసిందే. అదే సమయంలో తెలుగు యువత జీవితాలు కూడా అంతకన్నా గొప్పవి. వారు జీవితం నిలబెట్టుకోవడానికి, ఉన్నతంగా ఎదగడానికి తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా అద్యయనం చేయవలసిన రోజులివి. కేవలం తెలుగు మాత్రం నేర్చుకుని బావిలో కప్పమాదిరి ఉంటామంటే ఎవరికి నష్టం? తెలుగు యువతకే నష్టం. ఆంద్రజాతికే నష్టం. అలా అని తెలుగును నిర్లక్ష్యం చేయాలని ఎవరూ చెప్పరు. 

తెలుగును వాడుక భాషలోకి తెచ్చిన గొప్ప వ్యక్తి గిడుగు రామమూర్తి పంతులు. ఆయనకు నివాళి అర్పించడం మంచి విషయమే. ఆ సందర్భంగా తెలుగు భాష గురించి, దాని విశిష్టత గురించి మాట్లాడుకోవడం కూడా ఆహ్వానించదగిందే. కాని ఆ సమయంలో కూడా ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయాలన్న తలంపు కొందరు పెద్దలకు రావడమే దురదృష్టకరం. ప్రతిపక్ష నేత, టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన కుమారుడైన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ లు కూడా చేసిన ప్రకటనలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. 

చంద్రబాబు చేసిన ప్రకటన మీడియాలో చదివితే తెలుగు కోసం ఈయన చేసినంత కృషి ఇంకెవరూ చేయలేదేమోనన్న భావన కలుగుతుంది. బోధన భాషగా, పాలన భాషగా ఉన్నప్పుడే ఆ భాష రాణిస్తుందని చంద్రబాబు సెలవిచ్చారు. తెలుగు భాషకు ఆ ప్రాప్తం లేకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలుగు భాషను నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్నట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దాని నుంచి రక్షించుకోవాల్సిన బాద్యత అందరిపై ఉందని ఆయన ఉద్బోధించారు. 

ఇంత ఉద్బోధ చేసిన చంద్రబాబు దాదాపు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో తెలుగును బోధన భాషగా, పాలనభాషగా ఎంతవరకు వృద్ది చేశారు. ఇంగ్లీష్ మీడియం గురించి చర్చ జరుగుతున్నప్పుడు మున్సిపల్ స్కూళ్లలో తొలుత తానే ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టానని చంద్రబాబు ఎందుకు చెప్పారు? పోని తన పాలనకాలంలో ఒక శాఖలో అయినా తెలుగులో ఫైళ్లను నడిపారా? ముఖ్యమంత్రిగా తన కార్యాలయంలో తెలుగు భాషనే వాడుతూ పైళ్లమీద రాశారా? కాని ఇప్పుడు మాత్రం బోధన భాషగా, పాలన భాషగా తెలుగు ఉండాలని చెబుతున్నారు. 

మంచిదే. తెలుగును నీరుకార్చమని ఎవరూ చెప్పరు. కాని ప్రపంచంతో పాటు మనం నడవలేకపోతే ఎంత వెనుకబడిపోతామో తెలుగుమీడియంలో చదివి నానాపాట్లు పడుతున్నవారిని అడిగితే తెలుస్తుంది. నిజమే. తెలుగులో చదువుకున్న కొద్ది మంది ఉన్నతస్థానాలలోకి వెళ్లి ఉండవచ్చు. అంతమాత్రాన అంతా తెలుగులోనే చదవాలని చెప్పడం మాత్రం కరెక్టు కాదని వారు వ్యవహరించిన తీరే చెబుతుంది. 

తెలుగు, తెలుగు అని గొంతెత్తుకుని చించుకుంటున్న ప్రముఖుల పిల్లలుకాని, మనుమళ్లుకాని ఎవరూ తెలుగు మీడియంలో చదవడంలేదేమి? అన్న ప్రశ్నకు వారు ఎవరూ జవాబు ఇవ్వరు. 1950 నుంచి 1980 దశకం వరకు ప్రైవేటు రంగంలో విద్య పెద్దగా రాలేదు. ఎవరైనా చదువుకోవాలంటే వీధిబడో, లేక ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవల్సి ఉండేది. అప్పట్లో ప్రభుత్వ స్కూళ్లలో కూడా పాఠాలు బాగానే చెప్పేవారు. కాని కాలక్రమేణ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు కూడా రాజకీయాలకు అలవాటు పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. 

అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదు.పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోవడం సంగతి అలా ఉంచి, తెలుగులో చదవడమే అంతంతమాత్రంగా తయారైంది. సైన్స్, ఇతర సాంకేతిక పుస్తకాలు తెలుగులో అనువదించినా అర్ధంకాని పరిస్థితి ఉంటుంది. ఆ రోజుల్లో అనేకమంది పిల్లలకు గ్రేస్ మార్కులు ఇస్తేకాని పరీక్షలు పాస్ కాలేకపోయేవారు. మరో వైపు ప్రవేటు స్కూళ్లలో మంచి విద్య ఇస్తున్నారన్న భావన,క్రమశిక్షణ ఉంటుందన్న అభిప్రాయం. 

అంతకు మించి ఇంగ్లీష్ మీడియం వల్ల తమ బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుందని తల్లిదండ్రులు నమ్మారు. అందువల్లే ముప్పై,నలభై ఏళ్ల క్రితమే కొత్తగా పెట్టిన మిషనరీ స్కూళ్లకు విపరీతమైన గిరాకీ ఉండేది. కాస్త స్థోమత కలిగినవారంతా ఆ స్కూళ్లలోనే చదువుకునేవారు.ఆ తర్వాత మెజార్టీ ప్రైవేటు స్కూళ్లు ప్రైవేటు రంగంలోనే స్థాపితమయ్యాయి. దాంతో ప్రభుత్వ స్కూళ్లలో కేవలం బలహీనవర్గాలవారు. నిరుపేదల పిల్లలకే పరిమితం అయ్యాయి. దీంతో సమాజంలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు అవే అసమానతలు కోరుకునేవారు. 

ఆధిపత్యవర్గాలవారు ఇతరుల ఉన్నతిని కాని, మార్పును కాని అంగీకరించలేరు. ప్యూడల్ భావాలు కలిగినవారు తమ పిల్లలను, ఆ తర్వాత సంతతి వారిని మాత్రం మంచి స్కూళ్లలో చదివిస్తూ, ఆంగ్ల మీడియంలో బోధన చేయిస్తూ, సాధారణ ప్రజలకు మాత్రం మాతృభాషలోనే చదువుకోవాలని నీతులు చెబుతుంటారు. అంతదాకా ఎందుకు..చంద్రబాబు నాయుడు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్లారు కదా..ఆయన తెలుగుమీడియంలోనే చదివారు కదా..అయినా ఇంగ్లీష్ లో రాణించారా? 

పట్టుమని పది వ్యాఖ్యలు ఆంగ్లంలో వాగ్దాటితో మాట్లాడగలరా అన్న ప్రశ్నను ఆయన రాజకీయ ప్రత్యర్దులు వేస్తుంటారు. దానికి ఆయన వద్ద జవాబు ఉందా? కాని అదే ఆయన కుమారుడు లోకేష్ ఆంగ్లం బాగానే మాట్లాడగలరు. కాకపోతే తెలుగులో అంత ప్రావీణ్యత సాదించలేకపోయారు. దానికి కారణం చంద్రబాబేనని అనవచ్చా? లోకేష్ ను తెలుగు మీడియంలో ఎందుకు చదివించలేదు? ప్రభుత్వ స్కూల్ లో ఎందుకు వేయలేదని అడిగితే జవాబు ఏమి ఉంటుంది. 

లోకేష్ కూడా వాడుక భాష గురించి సందేశం ఇచ్చారు. మరి ఆయన తన కుమారుడిని ఇప్పుడు ఎక్కడ చదివిస్తున్నది కూడా చెప్పి ఉంటే ఆదర్శంగా ఉండేది కదా? దివంగత నేత,కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు పిజి చేసి, లా కూడా చదివారు. అయినా ఆంగ్లలో ప్రావీణ్యుడు కాలేకపోయారు. తెలుగు మీడియంలోనే చదువుకోవడం వల్ల ఆయన ఆంగ్లంపై పట్టు తెచ్చుకోలేకపోయారు. పార్లమెంటులో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఎన్నో తప్పులు దొర్లుతుండేవి. 

పాత్రికేయులు సరదాగా ఆయనను ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, మనం ఏమైనా ఆక్ఫఫర్డ్ యూనివర్శిటీ చదివామా? తనకు వచ్చిన భాషతోనే మాట్లాడానని సరదాగా చెప్పేవారు. ఆయన పిల్లలు డిల్లీలో మంచి స్కూల్ లో చదువుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు, లోక్ సభ సభ్యుడు రామ్మోహన్ నాయుడు ఆంగ్లంలో ఎంత బాగా మాట్లాడగలుగుతున్నారు? మరి ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుదా? లేదా? జనసేన అదినేత పవన్ కళ్యాణ్ తన పిల్లలు ఓక్రిడ్జ్ స్కూల్ లో చదువుకుంటున్నారని గతంలో చెప్పినట్లు గుర్తు. 

అక్కడ తెలుగు మీడియం ఉందా? ఆంగ్ల మీడియం ఉందా? ఆయా దేశాలలో ఉండే కొందరు తెలుగువారు భాష గురించి కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం తప్పు కాదు. కాని ఆ దేశాలలో వారి పిల్లలు తెలుగు మీడియంలో చదువుతున్నారా? ఏపీలోకాని, తెలంగాణలో కాని ఎమ్.పిలు, ఎమ్మెల్యేల పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుతున్నారా? వారంతా ఆంగ్లంలోనే ఎందుకు విద్యను అభ్యసిస్తున్నారు.

మరి సామాన్యుల విషయంలో మాత్రం ఎందుకు కొందరు నేతలు విభిన్నంగా వ్యవహరిస్తున్నారు అంటే కేవలం తాము చేయలేని పని ఎవరైనా చేస్తుంటే అసూయ అయినా కావాలి? లేదా పేదలకు ఇంగ్లీష్ విద్య ఎందుకు అన్న భావన అయినా కావాలి.వీరే కాదు.కొందరు పత్రికాధిపతులు తాము తెలుగును ఉద్దరిస్తున్నామన్నట్లుగా ప్రచారం చేసుకుంటుంటారు. కాని వాళ్ల పిల్లలను మాత్రం పెద్ద, పెద్ద ఆంగ్లమీడియం స్కూళ్లలోనే చదివిస్తున్నారు. 

అలా కాకపోతే ఈ నేతలు కాని, పత్రికాధిపతులుకాని, లేదా అంతకంటే ఉన్నతస్థానాలలో ఉన్నవారు కాని గుండెమీద చేయి వేసుకుని తమ పిల్లలు తెలుగు మీడియంలోనే చదివారనో, ఇకపై చదివిస్తామనో చెప్పమనండి. అప్పుడు వారిని శభాష్ అనవచ్చు. అంతేకాదు..తెలుగు గురించి ఇన్ని చెప్పేవారు తాము స్థాపించిన స్కూళ్లను ఆంగ్ల మీడియంలో ఎందుకు నడుపుతున్నారంటే దానికి రిప్లై ఉండదు. కాని మాతృభాష మీద సందేశాల మీద సందేశాలు ఇస్తుంటారు.

ఆచరించి చూపితే వాటిని విలువ అంటుంది కాని చెప్పేటందుకే నీతులు అన్నట్లు వ్యవహరిస్తే ప్రజలు అర్ధం చేసుకోలేని అమాయకులా? తెలంగాణలో ఈ మధ్య డిగ్రీ క్లాస్ లకు అడ్మిషన్లు అడిగినవారిలో తొంభై శాతం మంది ఆంగ్ల మాద్యమాన్నే కోరుకున్నారు. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటో వారికి తెలుసు కనుకే అలా ఎంపిక చేసుకున్నారు. అంత మాత్రాన వారికి తెలుగు రాదని, రాకూడదని కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆంగ్ల మీడియం ను చిన్న తరగతుల నుంచే ప్రవేశ పెట్టాలని ప్రయత్నిస్తోంది.అదే సమయంలో తెలుగును కంపల్సరీ్ సబ్జెక్ట్ గా చేసింది. ఇంతవరకు అనేక ప్రైవేటు స్కూళ్లలో అసలు తెలుగే లేకపోయినా ఎవరూ అడగలేదు. 

ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం అనగానే ఏదో కొంప మునిగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడుగడుగునా అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. దానికి కారణం కేవలం ద్వేషం తప్ప మరొకటి కాదనిపిస్తుంది. ఎన్నడూ లేని విదంగా వైసిపి ప్రభుత్వం ఆయా సబ్జెక్టులలో ఇంగ్లీష్, తెలుగు లలో ఒకే పుస్తకంలో పాఠ్యాంశాలు ఇస్తోంది. మరి అది తెలుగును పరిరక్షించినట్లు కాదా? పిల్లలకు మరింత సులువుగా ఉండే మార్గం కాదా? 

నాడు-నేడు కింద స్కూళ్లను వేల కోట్లు వ్యయంతో బాగుచేస్తున్న తీరు అందరిని ఆకర్షిస్తోంది. దానికి తోడు ఆంగ్ల మీడియం ను కూడా జోడిస్తుండడంతో సుమారు ఆరు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో పెరిగారు. దానిని బట్టే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ఆ మంచి పని జనంలోకి వెళ్లకూడదన్న దురుద్దేశంతో కొందరు ఇలా తెలుగు ,తెలుగు అంటూ ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. 

ఉన్నత, ధనిక వర్గాల వారు ఈ రోజున ఏ ఒక్క శాతం అయినా ఆంగ్ల మీడియంలో కాకుండా తెలుగు మీడియంలో పెడుతున్నారా? పోని తెలుగు గురించి సుద్దులు చేప్పే ఈ నేతలు ఎవరైనా తమ వారసులను తెలుగు మీడియంలో చదివిస్తున్నారా?అంటే అదీ లేదు. గిడుగు రామ్మూర్తి పంతులు తీసుకు వచ్చిన వాడుక భాష వల్ల తెలుగుకు మేలు కలిగింది. అందులో సందేహం లేదు. కాని ఆయన తెలుగులోనే చదవండి ..మరే భాష నేర్చుకోవద్దు అని చెప్పలేదు. వర్తమాన సమాజంలో ఏది మంచో, ఏది కాదో, ప్రజలందరికి తెలిసిపోతోంది.

దేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర దేశాలకు వెళ్లాలన్నా ఇంగ్లీష్ మాద్యమమే కీలకం అన్న సంగతి పదే,పదే చెప్పనక్కర్లేదు. అందుకే పైకి నీతులు చెప్పే నేతల మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదు. తెలుగు తప్పనిసరిగా నేర్చుకోండి..ఆంగ్లంలో చదువుకోండి అన్న నినాదం తెలుగువారికి ఎంతైనా మేలు చేస్తుందని చెప్పాలి.

Kommineni