రాయలసీమలో పార్టీని బలోపేతం చేసే క్రమంలో కర్నూలులో ఆదివారం బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ నేతలు శివప్రకాశ్, సునీల్ దియోధర్, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశంలో వ్యూహ రచన చేయనున్నారు.
అయితే తీవ్ర దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమకు న్యాయం చేయాల్సింది పోయి, అన్యాయం చేసిన పార్టీగా టీడీపీతో పాటు బీజేపీని కూడా ఆ ప్రాంతం గుర్తించుకుంది. గతంలో 2018, ఫిబ్రవరిలో రాయలసీమ డిక్లరేషన్ అంటూ కర్నూలులో ఇదే బీజేపీ ఓ తీర్మానం చేసింది. ఆ తర్వాత డిక్లరేషన్ ఊసే లేదు. కానీ సీమలో బలపడాలని బీజేపీ అనుకోవడం… ఆ పార్టీ దింపుడుకళ్లెం ఆశలే అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
రాష్ట్ర రెండో రాజధాని, హైకోర్టులను రాయలసీమలో ఏర్పాటు చేయాలని, వచ్చే బడ్జెట్లో రాయలసీమకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాయలసీమ డిక్లరేషన్‌లో బీజేపీ డిమాండ్ చేసింది. అలాగే ఆరు నెలలకు ఒకసారి రాయలసీమలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, నాలుగు జిల్లాలను ఎనిమిది జిల్లాలు చేయాలని, అధికారమంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదని బీజేపీ నాటి డిక్లరేషన్‌లో ప్రముఖంగా ప్రస్తావించింది.
ఎన్నికలతో సంబంధం లేకుండా నేడు కర్నూలులో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం కావడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే అధికార పార్టీనో, ప్రతిపక్షాన్నో ఇరుకున పెట్టడానికి మాత్రమే దేశంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ పరిమితం కాకూడదు. సీమ డిక్లరేషన్‌కు కట్టుబడి, వాటి సాధనకు ప్రభుత్వంపై లేదా ప్రభుత్వంతో కలిసి బీజేపీ పని చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఉదాహరణకు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్ర బీజేపీ ఎందుకు చొరవ చూపడం లేదనే నిలదీతలు వస్తున్నాయి.
రాయలసీమకు తాగు, సాగునీళ్లు అందించేందుకు జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణ సర్కార్ నుంచి ఏ విధంగా అడ్డంకులు ఎదురవుతున్నాయో అందరికీ తెలిసిందే. ఈ విషయమై కేంద్రానికి జగన్ ప్రభుత్వం పలుమార్లు ఫిర్యాదు చేసినా…మోడీ సర్కార్ చోద్యం చేస్తోందనే విమర్శలు లేకపోలేదు. ఎందుకంటే ఫిర్యాదుపై కనీస స్పందన కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కరువైంది. మరి రాష్ట్ర బీజేపీ ఏం చేస్తోందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కేంద్రాన్ని ఒప్పించి రాయలసీమకు సాగు నీటిని అందించే బృహత్తర చర్యలకు మద్దతు పలకాలి. విభజన చట్టంలో పేర్కొన్నట్టు సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఊసేలేదు. దీనిపై బీజేపీ వైఖరేంటో తెలియజేయాలి.
మతాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా, మానవత్వాన్ని పంచే, పెంచే చర్యల ద్వారా మాత్రమే సీమలో బలపడతామని బీజేపీ నేతలు గ్రహిం చాలి. తెలుగు సమాజంలో మత సామరస్యం, సహనం ఎక్కువ. బీజేపీ మత విద్వేషాలకు లోనయ్యే వారెవరూ ఇక్కడ లేరని గుర్తించాలని రాజకీయ విశ్లేషకులు హితవు చెబుతున్నారు.
అభివృద్ధి పనులతో మాత్రమే జనం మనసులను చూరగొనొ చ్చని అనేక ఉదాహరణలున్నాయి. కావున కరవు, పాలక పీడిత ప్రాంతమైన రాయలసీమకు సాగునీరు అందించడం, అలాగే ప్రత్యేక ప్యాకేజీ ఇప్పించడం ద్వారా మాత్రమే బలపడే అవకాశం ఉంది. ఆ దిశగా నేటి బీజేపీ సమావేశం జరిగితే బాగుంటుందని సీమ సమాజం ఆశిస్తోంది.