మన్యానికి మంచు రోజులు

మంచు కురిసే వేళలో హాయిగా విహరిస్తూ ప్రకృతి ఒడిలో తేలియాడిపోవాలని ఎందరో కలలు కంటారు. వేగవంతమైన జీవితంలో పడి కాలుష్యపు కోరలలో చిక్కిన మహా నగరాలలో యాంత్రికంగా బతుకులీడుస్తున్న వారంతా కాస్తా సేద తీరేందుకు…

మంచు కురిసే వేళలో హాయిగా విహరిస్తూ ప్రకృతి ఒడిలో తేలియాడిపోవాలని ఎందరో కలలు కంటారు. వేగవంతమైన జీవితంలో పడి కాలుష్యపు కోరలలో చిక్కిన మహా నగరాలలో యాంత్రికంగా బతుకులీడుస్తున్న వారంతా కాస్తా సేద తీరేందుకు విశాఖ ఏజెన్సీకే వస్తారు.

అక్కడ ఒకవైపు అచ్చమైన  పచ్చదనం, ఎంతైన కొండలు, మరో వైపు ఉరకలేసే జలపాతాలు ఇలా ప్రకృతి ఒడిలో మైమరచిపోవాలని అనుకుంటారు. అయితే శీతకాలంలో ఈ ప్రాంతాలు అద్భుతంగా ఉంటాయి. కానీ చూడబోతే ఇప్పుడే విశాఖ గిరి సీమలకు శీతాకాలం వచ్చిందా అన్న భ్రాంతి కలుగుతోంది. 

గత కొద్ది రోజులునా సాయంత్రం అవుతూనే మంచు దుప్పటి కప్పినట్లుగా ఇక్కడ పరిసరాలు మారిపోతున్నాయి. మంచు కరుగుతూ మన్యాన్ని అందులో దాచేసుకుంటోంది. పాడేరు, అరకు సహా ఇతర టూరిజం స్పాట్స్ ఇపుడు సందర్శకులకు కనువిందు చేస్తూ సరికొత్త అనుభూతులను కలిగిస్తున్నాయి. 

సెప్టెంబర్లోనే ఈ రకమైన వాతావరణం ఉంటే మరో ఆరు నెలల పాటు అద్బుతమైన దృశ్యాలనే కళ్ల చూస్తామని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు. దాంతో అక్టోబర్ తరువాత రావాల్సిన టూరిస్టులు ఇప్పటి నుంచే క్యూ కట్టేస్తున్నారు. అలా మన్యానికి మంచి రోజులు మంచు రోజులు ముందే వచ్చేశాయని అంతా ఆనందిస్తున్నారు. 

టూరిస్టుల మీదనే ఆధారపడి ఉపాధి పొందే వారంతా సంబరపడుతున్నారు కూడా. గత రెండేళ్ళుగా కరోనా బారిన పడి టూరిజానికి ఆదాయం తగ్గిందని, ఈసారి పరిస్థితులు మారితే మళ్లీ పుంజుకుంటామని పర్యాటక శాఖ అధికారులు కూడా ధీమాగా చెబుతున్నారు.