లేనిపోని వివాదాలను నెత్తికెత్తుకోకుండా వ్యవహరించింది కేంద్ర ఎన్నికల కమిషన్. దేశంలో పెండింగ్ లో ఉన్న వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల విషయంలో పూర్తిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించి, అక్కడ రాజ్యాంగ పరమైన అవసరాలను గుర్తించి వ్యవహరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు అర్జెంటేమీ లేదు. ఆ మేరకు అక్కడి ప్రభుత్వాలు స్పందించాయి. అర్జెంటుగా ఉప ఎన్నికలను పెట్టేయమని అవి కోరలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కాస్త లేటైనా తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు సీఈసీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నాయి. అయితే అర్జెంటుగా ఉప ఎన్నిక అవసరం బెంగాల్ లో ఉంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆరు నెలల్లో ఆమె మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సిన తప్పని పరిస్థితుల్లో ఉన్నారు. ఆమె కోసం టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నిక జరుగుతుందా? అనే చర్చ జరుగుతూ వచ్చింది.
తమ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయని బెంగాల్ ప్రభుత్వం సీఈసీకి నివేదించిందట. దీంతో అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. బెంగాల్, ఒడిశాల్లో నాలుగు అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తద్వారా బెంగాల్లో రాజకీయ అంతర్నాటకానికి సీఈసీ అవకాశం ఇవ్వలేదు.
ఒకవేళ ఇప్పట్లో ఉప ఎన్నికలు లేవు.. అని అంతటా వాయిదా వేసి ఉంటే, సీఈసీ నిర్ణయంపై రాజకీయ పరమైన చర్చ మొదలైంది. మమతా బెనర్జీని ముఖ్యమంత్రి పీఠం నుంచి దించడానికే దేశంలోని అన్ని ఉప ఎన్నికలనూ సీఈసీ రద్దు చేసిందనే విమర్శలు వచ్చేవి. కరోనా పరిస్థితులు అని చెప్పినా ఎవ్వరూ వినరు.
ఎందుకంటే.. క్రితం సారి కరోనా పరిస్థితులను ఖాతరు చేయకుండానే బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. అలాగే బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కరోనా పరిస్థితులే ఉన్నాయి. అంటే రాష్ట్రాల ఎన్నికలకు కరోనా ఆటంకం కాదు, ఉప ఎన్నికలకు ఆటంకమా? అనే ప్రశ్న తలెత్తుతుంది. కేంద్రంలోని బీజేపీకి మమతపై ఏ రేంజ్ లో రాజకీయ కసి ఉందో చెప్పనక్కర్లేదు. ఇలాంటి నేపథ్యంలో ఉప ఎన్నికలన్నింటినీ వాయిదా వేసి ఉంటే.. సీఈసీ విమర్శల జడిలో తడిసేది. వివాదాస్పదం అయ్యేది.
అందుకే రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకుని సీఈసీ నిర్ణయం తీసుకోవడం సమంజసమే. ఉప ఎన్నికలకు అర్జెంటేమీ లేదన్న రాష్ట్రాల్లో మరోసారి, రాజ్యాంగ పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికలు తప్పని చోట.. మాత్రం షెడ్యూల్ ను ప్రకటించి సీఈసీ టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించింది.