తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుంచి వెళ్లగొట్టే దమ్ము లేదా? అంటే …లేదనే సమాధానం వస్తోంది. కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనపై సొంత పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోమటిరెడ్డి వ్యవహారశైలిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పైకి ఏమీ మాట్లాడ్డం లేదు. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాత్రం ఒకడుగు ముందుకేసి ….పార్టీ నుంచి కోమటిరెడ్డి వెళ్లిపోవాలని పరోక్షంగా హెచ్చరించడం చర్చకు దారి తీసింది.
ఇటీవల వైఎస్సార్ 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లారు. సమావేశానికి మూడు గంటల ముందుగా …అది రాజకీయ ప్రేరేపిత సమావేశమని, వెళ్లొద్దంటూ టీపీసీసీ హెచ్చరించింది. ఈ హెచ్చరికను కోమటిరెడ్డి పట్టించుకోలేదు.
ఆత్మీయ సమ్మేళనానికి ఆయన వెళ్లారు. అంతేకాదు, టీపీసీసీ హెచ్చరికపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని, ఇదే వేరే పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీతక్క రాఖీ కట్టి, పాదాభివందనం చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించి రేవంత్‌ను ఇరుకున పెట్టారు.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ మధుయాష్కీ గౌడ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చని, కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు మాత్రం పొడవకండని కోమటిరెడ్డికి ఆయన పరోక్షంగా హితవు పలికారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుగుదలైనా, తన ఉన్నతైనా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే అని ఆయన చెప్పు కొచ్చారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా?, వద్దా? అనేది అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన తెలిపారు.
కోమటిరెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని భావిస్తున్నప్పుడు…బయటికి పంపే దమ్ము లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. తమ నాయకుడిని పార్టీ నుంచి వెళ్లగొట్టే దమ్ము, ధైర్యం లేనప్పుడు… మధుయాష్కీ గౌడ్ హెచ్చరికలు, హితవులు దేనికని కోమటిరెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అసలు మధుయాష్కీ గౌడ్ ఎన్నికల్లో గెలవక ఎన్నేళ్లైందో తెలుసుకుని, ఇతరులకు నీతులు చెప్పాలని కోమటిరెడ్డి అనుచరులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
టీపీసీసీలో వైఎస్సార్ వ్యతిరేక, చంద్రబాబు అనుకూల వర్గం పెత్తనం చేస్తుండడం వల్లే…కాంగ్రెస్‌కు ఈ దుస్థితి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.