జ‌గ‌న్‌కు ఇష్టం లేక‌పోతే ఇలా చేస్తాడు…!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఇష్టం లేని ప‌ని అస‌లు చేయ‌రు. రాజ‌కీయంగా లాభ‌న‌ష్టాల‌ను అస‌లు లెక్కించ‌రు. ఈ విష‌యం మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుల విష‌యంలో మ‌రోసారి రుజువైంది. జ‌గ‌న్ ఒక్క‌సారి చ‌ల్ల‌ని చూపు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఇష్టం లేని ప‌ని అస‌లు చేయ‌రు. రాజ‌కీయంగా లాభ‌న‌ష్టాల‌ను అస‌లు లెక్కించ‌రు. ఈ విష‌యం మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుల విష‌యంలో మ‌రోసారి రుజువైంది. జ‌గ‌న్ ఒక్క‌సారి చ‌ల్ల‌ని చూపు చూసి ఉంటే… మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రులు దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్సీ శివ‌నాథ‌రెడ్డి వైసీపీలో చేరి ఉండేవారు. జ‌మ్మ‌ల‌మడుగులో వైసీపీకి ఎదురు లేకుండా ఉండేది. ఇదే ప‌ని గ‌తంలో చంద్ర‌బాబునాయుడు చేసి ఎన్నిక‌ల్లో భంగ‌ప‌డ్డారు.

మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌డ‌ప పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ త‌ర‌పున గెలుపొంది, టీడీపీలోకి ఫిరాయించ‌డంతో పాటు మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్‌ను నానా తిట్లు తిట్టారు. ఇదే ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోలేకుండా చేసింది. 

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆదినారాయ‌ణ‌రెడ్డికి భ‌యం ప‌ట్టుకుంది. ఆయ‌న టీడీపీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయ‌న సోద‌రులు మాజీ ఎమ్మెల్సీ దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్సీ శివ‌నాథ‌రెడ్డి మాత్రం చేర‌లేదు. అలాగ‌ని టీడీపీలో కూడా యాక్టీవ్‌గా క‌నిపించ‌లేదు. పైగా మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం మండ‌లిలో ప్ర‌వేశ పెట్ట‌గా … టీడీపీ విఫ్‌ను ధిక్క‌రించి క‌డ‌ప జిల్లాకు చెందిన శివ‌నాథ‌రెడ్డి మ‌ద్ద‌తుగా నిలిచారు.

ఆ త‌ర్వాత ఉక్కు ఫ్యాక్ట‌రీ నిర్మాణ నిమిత్తం జ‌మ్మ‌ల‌మ‌డుగుకు వ‌చ్చిన సీఎంపై దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి, శివ‌నాథ‌రెడ్డి ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. దీంతో మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రులు వైసీపీలో చేరుతార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. అయినప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం ప్ర‌స‌న్నం కాలేదు. మ‌రోవైపు శివ‌నాథ‌రెడ్డికి టీడీపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 

వైసీపీ కోసం ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా లెక్క చేయ‌కుండా కోరి ద‌గ్గ‌ర‌కు వెళుతున్నా… కాద‌ని దూరంగా పెట్టిన వైసీపీపై దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి, శివ‌నాథ‌రెడ్డి కోపంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌మ్మ‌ల‌మ‌డుగులో దిక్కేలేని టీడీపీ వైపు మ‌న‌సు పారేసుకున్నారు. ఇదే అద‌నుగా భావించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి కుమారుడు భూపేశ్‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు ఇన్‌చార్జ్ బాధ్య‌త‌ల్ని క‌ట్ట‌బెట్టింది. 

గ‌తంలో భూపేశ్ వైసీపీ యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇప్పుడు ఆదినారాయ‌ణ‌రెడ్డి అన్న కుమారుడికి జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు అప్ప‌గిండంతో త‌ప్ప‌కుండా టీడీపీ బ‌ల‌ప‌డుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ప్ర‌స్తుతానికి ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ నేత కావ‌డం కేవ‌లం సాంకేతిక‌మే అని, ఎన్నిక‌ల నాటికి ఆ కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని జ‌నం చ‌ర్చించుకుంటున్నారు. మొత్తానికి జ‌గ‌న్ కాద‌నుకున్న త‌ర్వాతే ఆదినారాయ‌ణ‌రెడ్డి కుటుంబ స‌భ్యులు తిరిగి టీడీపీలోనే కొన‌సాగ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌నేది వాస్త‌వం.