టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన గురువును లెక్క చేయడం లేదు. గురువంటే విద్యాబుద్ధులు చెప్పిన వ్యక్తి మాత్రమే కాదు. జీవిత పాఠాలు, గుణపాఠాలు నేర్పే అనుభవాలను కూడా గురువులుగా భావిస్తే… ఎన్నో ప్రయోజనాలు.
గత సార్వత్రిక ఎన్నికల ఓటమి నుంచి ఇటు టీడీపీ, ఆ పార్టీ భవిష్యత్ రథసారథి లోకేశ్ ఏ మాత్రం గుణపాఠాలు నేర్చుకున్నట్టు లేదు. పైగా పార్టీ ఓటమే కాదు, స్వయంగా తాను కూడా ఓడిపోయిన సంగతిని లోకేశ్ విస్మరించినట్టున్నారు.
కనీసం తాను పోటీ చేయడానికి సురక్షితమైన ఒక నియోజకవర్గమంటూ లేని నేత లోకేశ్. రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణం. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంగళగిరి నుంచి నాటి సీఎం చంద్రబాబునాయుడు కుమారుడైన లోకేశ్ మంత్రి హోదాలో పరాజయం పొందడం ఆశ్చర్యం కలిగించింది.
పార్టీతో పాటు తన ఓటమికి కారణాలను తెలుసుకుని, తప్పుల్ని సరిదిద్దుకోవాలనే ఆలోచన చంద్రబాబు, లోకేశ్‌లలో ఏ మాత్రం కనిపించడం లేదు. తమను ఓడించిన ప్రజానీకానిదే తప్పు అనే భావన టీడీపీ అగ్రనేతల్లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
రాజకీయ చరమాంకంలో ఉన్న చంద్రబాబు విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడైన లోకేశ్ ఓటమి నుంచి ఎంతో నేర్చుకోవడానికి బదులు, అసలు పరాజయాన్నే నిరాకరించడం అతని పతనానికి దారి తీస్తోందని హెచ్చరించక తప్పదు.
ఎంత సేపూ సోషల్ మీడియా వేదికగా జగన్‌పై దుమ్మెత్తి పోయడం, పార్టీ కార్యకర్తలు హత్యకు గురైతే అక్కడికెళ్లి హెచ్చరించడం మినహా లోకేశ్ చేసింది, చేస్తున్నదేంటనే ప్రశ్నకు టీడీపీ నుంచి సమాధానం దొరకదు. పదేపదే ఒక వ్యక్తిని తిట్టడం వల్ల… తిట్టించుకున్ వారిపై సానుభూతి, అలాగే తిట్టే వారు అభాసుపాలు కావడం ఖాయం.
కావున ఈ విషయాలను గ్రహించి… కనీసం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకునైనా ఓటమి అనే గురువు నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాజకీయ జీవితాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడం లోకేశ్ చేతుల్లోనే ఉంది. మరి ఆయన ఏం చేద్దారో చూద్దాం.