ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి ఆలస్యంగానైనా నిజం మాట్లాడారు. అయితే ఆయన అభిప్రాయం జనం మెచ్చేలా, జగన్‌ను నొప్పించేలా ఉందని చెబుతున్నారు. సాధారణంగా జగన్ మేనమామ వివాదాలకు దూరంగా ఉంటారు. తమకు కూడా దూరంగా ఉంటారని ఆయన్ను ఎన్నుకున్న కమలాపురం నియోజకవర్గం వాపోతూ వుంటుంది. అది వేరే సంగతి.
ప్రస్తుతానికి వస్తే… సీబీఐ విచారణకు హాజరైన జగన్ మేనమామ రవీంద్రనాథరెడ్డి సంచలన ప్రకటన చేశారు. కడప కేంద్ర కారాగారంలో శనివారం సాయంత్రం సుమారు గంటకు పైగా సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు.
వివేకా హత్యకు టీడీపీ నేతలే కారణమంటూ ఆయన ఆ రోజు మొట్ట మొదటగా సంచలన ఆరోపణ చేశారు. ఆ తర్వాత వైసీపీ నేతలంతా వివేకా హత్యకు టీడీపీనే కారణమంటూ రవీంద్రనాథరెడ్డిని ఫాలో అయ్యారు.
ఈ నేపథ్యంలో రవీంద్రనాథరెడ్డిని సీబీఐ విచారించడం ప్రాథాన్యం సంతరించుకుంది. టీడీపీ నేతలే కారణమని చెప్పడానికి గల కారణాలు, ఆధారాల గురించి రవీంద్రనాథరెడ్డిని విచారించి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అనంతరం ఆయన మీడియాతో అన్న మాటలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఏమన్నారంటే…
“వివేకా హత్య రెండేళ్లకు పైన అవుతోంది. ఇంకా దోషులెవరో తేల్చ లేదు. ఇది మాకు చాలా అవమానకరంగా ఉంది. ఇప్పటికైనా త్వరగా తేల్చండి” అని సీబీఐ అధికారులను కోరినట్టు రవీంద్రనాథరెడ్డి వెల్లడించారు.
ప్రజానీకం కూడా ఇదే విమర్శ చేస్తోంది. తనయుడే పాలకుడిగా ఉన్నప్పటికీ చిన్నాన్న హత్య కేసు మిస్టరీని ఛేదించలేదనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే సీబీఐకి విచారణ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని జనం చర్చించుకుంటున్నారు. అదే మాటను రవీంద్రనాథరెడ్డి కూడా అనడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.