వైయస్సార్ పన్నెండవ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో సంస్మరణ సభ పెట్టారు. సంస్మరణ సభ అనగానే గతాన్ని గుర్తు తెచ్చుకుని, ఆనాటి రోజుల్ని సింహావలోకనం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ యీ సభది వెనకచూపు కాదు, ముందుచూపు అనిపించింది. ఎందుకంటే ఆ సభలో విజయమ్మగారు షర్మిల భవిష్య రాజకీయ జీవితం గురించే మాట్లాడారు. షర్మిల సరేసరి! ఆమె కొత్తగా పెట్టిన పార్టీ తెలంగాణలో అర్జంటుగా అధికారంలోకి వచ్చేసి ఆమె ముఖ్యమంత్రి అయిపోవడానికి వైయస్ అభిమానులందరూ కలిసి రావాలని కోరడమే ఆ సభ ఉద్దేశం అని స్పష్టంగా తెలియ చెప్పేసింది. దానికి ఉపయోగ పడవలసినది రాజకీయనాయకులు. వారొక్కరినే పిలిస్తే బాగుండదని పారిశ్రామికవేత్తలను, డాక్టర్లను, పాత్రికేయులను, రిటైరైన అధికారులను పిలిచారు, ఆటలో అరటిపండులా! వారి ప్రసంగాలేవీ మీడియాలో రాలేదు. నాయకుల్లో కూడా రిటైరైన వారు, విరామం తీసుకుంటున్నవారు హాజరయ్యారు. ప్రస్తుతం ఎంపీగా వున్నవారిలో కోమటిరెడ్డి మాత్రమే హాజరయ్యారు. అది వైయస్ మీద భక్తితోనో, రేవంత్ మీద కసితోనో అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి.
రాజన్న రాజ్యం ఆంధ్రలో తెచ్చేశారు కాబట్టి, తెలంగాణలో కూడా తెచ్చేయాలని విజయమ్మ అభిలాష వ్యక్తం చేశారు. ఆ వచ్చే రాజన్న రాజ్యం కూడా వైయస్‌కు చెందిన కాంగ్రెసు పార్టీ ద్వారానో, వైయస్‌కు అనుయాయులుగా వుండి, యిప్పుడు వేరే పార్టీలో వున్న నాయకుడి ద్వారానో వస్తే చాలనుకుంటారేమో, అలా కాదు, వైయస్ కూతురు షర్మిల ద్వారానే రావాలని స్పష్టం చేశారు. ‘రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, రాక్షసరాజ్యం, అది మళ్లీ రావాలా’ అని కొందరు విసుర్లు విసురుతున్నారు. ఒకరి పాలన ఎలా వుంది అన్నది వ్యక్తిగతమైన అభిప్రాయంగా తయారవుతోంది. చంద్రన్న రాజ్యం మళ్లీ రావాలని గోరంట్ల వారు మొన్ననే పిలుపు నిచ్చారు. రెండున్నర ఏళ్లుగా, రెండున్నరేమిటి, బాబు ఫిరాయింపుదార్లను చేర్చుకోవడం మొదలుపెట్టిన రోజు నుంచి, అంటే ఏడేళ్లపైన అన్నమాట, ఘోరంగా కనబడిన టిడిపి పరిస్థితి ఆయన దృష్టిలో ఒక్క రోజులో మారిపోయింది.
ఎలా మారింది? బాబుతో ఒక్క సమావేశంతో ఆయన దృక్కోణమే మారిపోయింది. ‘ఒక్క పిలుపుతో పిలిచితే పలుకుతావట’ అవి వెంకటేశ్వర స్వామిపై పాట వుంది. కానీ ఎలా పిలవాలో భక్తుడు తెలుసుకోవాలి. ఫోన్లో పిలిస్తే పలకరు యీ టిడిపి దైవం. ఇంటి కప్పెక్కి, గోల చేసి, పిలవాలి. రామదాసు ‘ఇక్ష్వాకులతిలక, ఇకనైనా..’ అని మొత్తుకున్నంత కాలం రాముడు విన్నాడా? లేదు. ‘ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగావు..’ అని తిట్లు లంకించుకుంటే అప్పుడు దిగాడు. ఎటొచ్చీ రాముడు భక్తుడి కోసం దిగివచ్చాడు. 2021 దేవుడి వాహనం ‘గగనానికి, యిలకూ బహుదూరం..’ అనడం చేత భక్తుణ్నే రాజమండ్రి నుంచి హైదరాబాదు పిలిపించి నచ్చచెప్పడం జరిగింది. ‘ఈ 73 ఏళ్ల వయసులో నాకేం కావాలి? ఆత్మగౌరవం కూడా లేని పార్టీలో వుండడమెందుకు? రాజీనామా చేస్తాను, రాజకీయాల్లో కొనసాగుతానో లేదో తెలియదు’ అని 15 రోజుల క్రితం అన్న గోరంట్లకు హఠాత్తుగా ఆత్మగౌరవం తిరిగి వచ్చేసింది.
ఈ వయసులో కూడా రాజకీయాలు చురుగ్గా చేయాలన్న సరదా పుట్టింది. ‘టిడిపిని ముందుకు తీసుకుపోతాను. దాన్ని మళ్లీ అధికారంలోకి తెస్తాను. చంద్రన్న రాజ్యం తిరిగి వెలిసేట్లా చేస్తాను’ అని ప్రకటించేశారు. నిజానికి 15 రోజుల్లో ఏం మారింది? పార్టీ అంతర్గత సమావేశం జరిగి లోటుపాట్ల గురించి నికార్సయిన చర్చ జరిగిందా? నెంబర్ టూగా లోకేశే వున్నారు. గోరంట్లను పిలిచి, సారీ అనలేదు. పార్టీలో యువరక్తం ఎక్కిస్తున్నాం కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోండి, ఆ రాజ్యాలు తిరిగి తెచ్చే గోల మేం చూసుకుంటాం అని తండ్రి ద్వారా చెప్పించినట్లు లేదు కాబట్టి గోరంట్ల ఆ భారమేదో తన మీదే వుందని ఫీలయ్యారు. ఇంతకీ చంద్రన్న రాజ్యం మళ్లీ రావాలని గోరంట్లతో బాటు ప్రజలూ అనుకుంటున్నారో లేదో తెలియదు. 2019లో 13శాతం సీట్లిచ్చి సరిపెట్టిన జనం 2021 నాటికి 51శాతం సీట్లిస్తారో లేదో తెలియదు. అలాగే వైయస్ రాజ్యం తెలంగాణలో రావాలని విజయమ్మ, షర్మిల కోరుకుంటున్న స్థాయిలో ప్రజలు కోరుకుంటున్నారో లేదో తెలియదు.
అయినా పార్టీ పెట్టాక ప్రయత్నమంటూ గట్టిగా చేయాలి కాబట్టి షర్మిల అన్ని ఉపాయాలూ ప్రయోగించి చూస్తున్నారు. లేకపోతే వైయస్ పోయిన 12 ఏళ్ల దాకా ఆయన వర్ధంతి సభ యీ స్థాయిలో పెట్టాలన్న ఆలోచన రాకపోవమేమిటి? పోనీ అదేదో ఆంధ్రలో పెట్టకుండా హైదరాబాదులో పెట్టడమేమిటి? రాజకీయాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు, బాగుంది. ఆ మాట మీద నిలబడాలి కదా! నివాళి ఘటించి వదిలేస్తే హుందాగా వుండేది. అంతర్లీనంగా అందరికీ షర్మిల వైయస్ కూతురు అని గుర్తు చేసినట్లు వుండేది. తర్వాతి రోజుల్లో యీ వీడియోలను ఎన్నికల ప్రచారంలో వాడుకుని వుండాల్సింది. కానీ బొత్తిగా బాహాటంగా రాజకీయ ప్రకటనలు చేసేసి తమ తాపత్రయాన్ని చాటుకున్నట్లయింది.
‘‘నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రాంత ప్రజలు నా కుటుంబం, నా బాధ్యత. ఈ మేరకు నాన్న నా గుండెలపై ఒక విల్లు రాశారు. నాన్న ప్రేమించిన యీ ప్రజలకు ఆయన వర్ధంతి రోజున మాట యిస్తున్నా. వీరి కోసం కొట్లాడతా. రాష్ట్రంలో మళ్లీ వైయస్ పాలన తెస్తా.’’ అంటూ ఉపన్యసించారు షర్మిల. ఆ విల్లును పన్నెండేళ్ల పాటు అమలు చేయకుండా ఎక్కడ దాక్కున్నావు? జగన్ జైల్లో ఉన్నపుడు పాదయాత్ర చేయడం తప్ప, తర్వాత ఏం చేశావ్? నీ బాధ్యత యిప్పుడే గుర్తుకు వచ్చిందా? అని తెలంగాణ ఓటరు అడిగితే షర్మిల దగ్గర సమాధాన మేముంది? ‘ఉమ్మడి రాష్ట్రం అవిచ్ఛిన్నంగా వుంటే, వైసిపి గెలిచి, మా అన్న ముఖ్యమంత్రి అయిపోయి వైయస్ పాలన తెచ్చేసి వుండేవాడని 2014 వరకు ఊరుకున్నాను’ అని షర్మిల చెప్పవచ్చు. కానీ 2014 తర్వాతి నుంచి ఆమె నిర్లిప్తతతకు, నిష్క్రియాపరత్వానికి ఏం జవాబు చెప్తుంది?
ఆమెకు తెలంగాణపై అంత ప్రేమ వుండి వుంటే, తెలంగాణ ప్రజలను ఉద్ధరించాలని కంకణం కట్టుకుని వుంటే జగన్ తెలంగాణ జోలికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నాడు కాబట్టి తనతో విభేదించి, యిప్పుడు పెట్టుకున్న పార్టీ అప్పుడే పెట్టి వుండాల్సింది. ఖమ్మం వంటి జిల్లాలలోనైనా పార్టీ నడిపి వుండాల్సింది. హైదరాబాదులో కార్పోరేషన్ ఎన్నికలలో పోటీ చేసి వుండాల్సింది. ఆంధ్ర మూలాలున్న వ్యక్తిగా, సమైక్యవాది ఐన వైయస్ కూతురిగా హైదరాబాదులోని ఆంధ్రమూలాల వారు ఆదరించేవారేమో! ఆమె పార్టీకి ఏ పదో, పరకో స్థానాలు వచ్చేవేమో! ఆమె ఓ కౌన్సిలర్ అయ్యేదేమో! అదేమీ చేయకుండా యిన్నాళ్లూ ఎక్కడో వుండి, ఇప్పుడు సడన్‌గా ముఖ్యమంత్రి అయ్యి మీకు సేవ చేసేస్తానంటే చేయించుకోవడానికి యివతలివాళ్లు సిద్ధంగా వుండాలిగా!
తెలంగాణ గురించిన సాంకేతిక అంశాలు, అవసరాలు, సామాజిక వ్యవస్థ గురించి ఆమెకు ఏ మాత్రం తెలుసునో యిప్పటిదాకా బయటపడలేదు. నిరుద్యోగ సమస్య ఒక్కదాన్నే హైలైట్ చేసుకుంటూ పోతోంది. నాయకురాలిగా కూడా ఆమె ప్రజ్ఞపై అందరికీ సందేహాలున్నాయి. వచ్చిన కాసిన్నిమందీ వెనక్కి వెళ్లిపోతున్నారు. మొన్న సమావేశంలో కూడా వచ్చినవారిలో ఆల్మోస్ట్ అందరూ ఆంధ్ర ప్రాంతం వాళ్లే. తెలంగాణ నుంచి వచ్చిన ఎంపీ ఒకరే, మాజీ ఎంపీలు యిద్దరు, మాజీ ఎమ్మెల్యే ఒకరు. హాజరైన రాజకీయేతర ప్రముఖుల్లో కూడా చాలా మంది ఆంధ్రమూలాల వారే ఉన్నారు. దీని కారణంగా షర్మిలపై ఆంధ్ర ముద్ర మరింత బలంగా పడింది. అది తెలంగాణలో ఏ మాత్రం లాభదాయకం కాదు. సినిమావాళ్లు ఎవరూ రాలేదు. మోహన్‌బాబు ఆడియో సందేశాన్ని, కృష్ణ వీడియో సందేశాన్ని పంపారు. వచ్చినవారందరూ వైయస్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ గతాన్ని నెమరేశారు తప్ప భవిష్యత్తులో వైయస్ పాలన మళ్లీ రావాలని ఎవరూ అనలేదు.
అయినా విజయమ్మకు ఆశ చావలేదు. ‘షర్మిల వైయస్‌కు ముద్దుబిడ్డ. నాన్నే లోకంగా వుండేదామెకు. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలని ముందుకు వెళుతోంది. మీరందరూ ఆశీర్వదించాలి.’ అని విజ్ఞప్తి చేశారు. వైయస్ భార్య కదాని ఆవిడ మొహం చూసి మర్యాదపూర్వకంగా రాజకీయేతర ప్రముఖులు యీ సభకు వచ్చారు తప్ప వారికి ఒనగూడే లాభం ఏమీ లేదు. వైయస్ మరణించి 12 సంవత్సరాలైంది. ఈ సభకు హాజరు కావడం వలన జగన్‌తో ఏమైనా పని వుంటే అది జరక్కుండా పోతుంది కూడా! వాళ్లు చూపించిన యీ గౌరవాన్ని విజయమ్మ యీ విజ్ఞప్తి ద్వారా చెడగొట్టుకున్నారు. ఆవిడ ఎందుకిలా మాట్లాడింది అని ఆలోచిస్తే షర్మిల మొహమాట పెట్టింది అనుకోవాలి. అన్నయ్య కంత చేశావుకదా, నాకు మాత్రం ఎందుకు చేయవు అని ఆమె అడిగితే, యీమె కాదనలేక పోయింది అని సర్దిచెప్పుకోవాలి.
కానీ ఒక తల్లిగానే కాక, 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో వున్న వ్యక్తి భార్యగా ఆమె తన కూతురికి కాస్త వివేకం నూరిపోసి వుండాల్సింది. ‘జగన్ ఆంధ్రలో గెలిచాడంటే, దానికి కారణం 2009 నుంచి తను చేస్తున్న పోరాటం. ముఖ్యంగా 2014 ఎన్నికల ముందు, తర్వాత టిడిపితో తలపడి, నానా కష్టాలూ పడ్డాడు. తన ఎమ్మెల్యేలను టిడిపి ఎగరేసుకుని పోతూ వుంటే, తన గురించి దుష్ప్రచారం మీడియాలో విపరీతంగా సాగుతూంటే తట్టుకుని నిలబడ్డాడు. పాదయాత్ర సంగతి సరేసరి. ఫిరాయింపులను, టిడిపి ఒత్తిళ్లను తట్టుకుని నిలబడడానికి ఎంతో రాజకీయ చాతుర్యం, ఓర్పు, ప్రణాళిక అవసరం. నువ్వు తెలంగాణలో అలాటి కష్టమేం పడ్డావ్? కెసియార్ దుష్పరిపాలన ఏడేళ్లగా సాగుతూందని యిప్పుడంటున్నావు కదా! నువ్వు ఎదిరించావా? పోరాడావా? నో పెయిన్, నో గెయిన్! కేవలం వైయస్ కూతురన్న హోదా తప్ప వేరేదీ లేకుండా గోదాలోకి దిగి, మధ్యలో నా పేరు కూడా ఉపయోగించుకుంటే ఎలా?’ అని చెప్పి వుండాల్సింది.
అలా చెప్పకపోవడం వలన విజయమ్మ, షర్మిల కలిసి చేసిన యీ సంస్మరణ సభ ఒక ప్రహసనంలా మిగిలింది. దీనివలన షర్మిల పార్టీకి లాభం కంటె నష్టమే ఎక్కువ కలిగిందనుకోవాలి.