ప్యాకేజీయా.. క్యాబేజీయా.. … ?

ప్యాకేజ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. కదా. అవును ఏపీలో నాడు తెలుగుదేశం ఏలుబడిలో ప్రత్యేక హోదాకు బదులుగా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి తలూపారు. ఆ తరువాత ప్యాకేజీ కధ ఏమైందో అందరికీ…

ప్యాకేజ్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది. కదా. అవును ఏపీలో నాడు తెలుగుదేశం ఏలుబడిలో ప్రత్యేక హోదాకు బదులుగా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి తలూపారు. ఆ తరువాత ప్యాకేజీ కధ ఏమైందో అందరికీ తెలిసిందే.

అందుకే ప్యాకేజీ అంటే ఎవరైనా అమాయకుల చెవిలో పెద్ద క్యాబేజీ పూవు తెచ్చి పెడుతున్నారా అని అనుమానిస్తారు. ఇపుడు మరో ప్యాకేజీ ఏపీకి అందబోతోంది. అది విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసమట. బ్రహ్మాండమైన ప్యాకేజీన‌ట.

ఆ ప్యాకేజీని ఆస్వాదిస్తూ ఉక్కు కర్మాగారంపై పైవేట్ గొడ్డలి వేటు పడినా కూడా ఏ నొప్పీ లేకుండా హాయిగా భరించేయవచ్చునట. విశాఖ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి నోట ఈ ప్యాకేజీ మాట వినిపించింది. 

ఉక్కు కార్మికులకు అద్భుతమైన ప్యాకేజీ రెడీగా ఉందని ఆమె చెబుతూ వారి ఉపాధికి గట్టి భరోసా ఉందని తేల్చేశారు. అంటే రేపో ఎల్లుడో విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం ఖాయమని చిన్నమ్మ చెప్పకనే చెప్పేశారన్న మాట.

మొత్తానికి ఈ ప్యాకేజీ బీజేపీ నేతలకు బహు బాగు అనిపించవచ్చు కానీ కార్మిక లోకం మాత్రం ఇంతెత్తున ఎగిరిపడుపడుతోంది. మాకు మీ ప్యాకేజీలు వద్దు క్యాబేజీలు వద్దు, విశాఖ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే అసలు ఊరుకునేది లేదంటూ కార్మికులు అల్టిమేటం జారీ చేశారు. 

మరో వైపు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద చేసిన కామెంట్స్ కి వ్యతిరేకంగా వారు ఖబడ్దార్ జీవీఎల్ అంటూ ఆందోళన కూడా చేపట్టారు.