ఎన్టీఆర్ లాంటి స్టార్ బుల్లితెరపైకొస్తే ఎలా ఉంటుంది? టీఆర్పీల మోత మోగిపోవాల్సిందే. రేటింగ్స్ లో రికార్డులు బద్దలవ్వాల్సిందే. గతంలో ఇలా జరిగింది కూడా. కానీ ఈసారి అది రిపీట్ అవ్వలేదు. ''ఎవరు మీలో కోటీశ్వరుడు'' షోతో మరోసారి బుల్లితెర వీక్షకుల ముందుకొచ్చిన ఎన్టీఆర్.. రేటింగ్స్ పరంగా చెప్పుకోదగ్గ నంబర్లే సాధించినప్పటికీ.. రికార్డులైతే బద్దలుకొట్టలేదు. పైపెచ్చు ఎన్నో అనుమానాల్ని రేకెత్తించాడు, మరెన్నో ప్రశ్నల్ని మిగిల్చాడు.
ముందుగా రేటింగ్స్ విషయానికొద్దాం. ఎవరు మీలో కోటీశ్వరుడు సినిమాకు గరిష్టంగా వచ్చిన టీఆర్పీ 11.37. ఇక కనిష్టంగా వచ్చిన టీఆర్పీ 0.5. అంటే వ్యత్యాసం చాలా ఎక్కువ. ప్రారంభ ఎపిసోడ్స్ కే ఈ టీఆర్పీ అంటే, రాబోయే రోజుల్లో కచ్చితంగా తగ్గుతుంది. అది సహజం.
ఇక పోటీపరంగా చూసుకుంటే, గేమ్ షో జానర్ లో దీనిదే పైచేయి అయినప్పటికీ.. ఓవరాల్ గా చూసుకుంటే ఇది నంబర్ వన్ కాదు. ఎప్పట్లానే కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి లాంటి సీరియల్స్ అగ్రస్థానంలో నిలిచాయి.
బిగ్ బాస్ తో పోటీ తప్పదా?
నిజానికి కార్తీకదీపం టీఆర్పీని కొట్టడం ఎవ్వరితరం కాదు, కాబట్టి ఈ విషయంలో ఎన్టీఆర్ షోను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ త్వరలోనే స్టార్ మా ఛానెల్ లో బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది. నాగార్జున హోస్ట్ గా రాబోతున్న ఆ రియాలిటీ షోకు ఫిక్స్ డ్ ఆడియన్స్ ఉన్నారు. హోస్ట్ ఎవరైనా, కంటెస్టెంట్లు ఎంతమంది మారినా కొత్త సీజన్ వచ్చిదంటే చూసే జనాలు చాలామంది ఉన్నారు.
సో.. బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడుకు కచ్చితంగా పోటీ ఉంటుంది. ప్రారంభ ఎపిసోడ్స్ లోనే తన స్థాయికి తగ్గ టీఆర్పీలు సాధించలేకపోయిన ఎన్టీఆర్, రాబోయే రోజుల్లో స్టార్ మా సెగను ఎలా తట్టుకుంటాడో చూడాలి.
ఓవరాల్ గా మాత్రం జెమినీ టీవీ హ్యాపీ. ఎన్టీఆర్ రాకతో చాన్నాళ్ల తర్వాత ఆ ఛానెల్ 400 మార్క్ జీఆర్పీని అందుకుంది. తమన్నతో మొదలుపెట్టిన మాస్టర్ చెఫ్ ఇండియా కార్యక్రమం కూడా ఊపందుకుంటే.. ఈ ఛానెల్ మూడో స్థానానికి ఎగబాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.