పతంజలి పచ్చి మోసం.. నిజంగానే ఇది కరో’నిల్’

చంద్రబాబు అధికారంలో ఉంటే.. హెరిటేజ్ ఫుడ్స్ పై ఎవరైనా ఎంక్వయిరీకి వెళ్తారా..? బీజేపీ అధికారంలో ఉంటే పతంజలి జోలికి ఎవరైనా వస్తారా..? ఆ ధీమాతోనే రామ్ దేవ్ బాబా మరోసారి జనాల్ని దగా చేయాలని…

చంద్రబాబు అధికారంలో ఉంటే.. హెరిటేజ్ ఫుడ్స్ పై ఎవరైనా ఎంక్వయిరీకి వెళ్తారా..? బీజేపీ అధికారంలో ఉంటే పతంజలి జోలికి ఎవరైనా వస్తారా..? ఆ ధీమాతోనే రామ్ దేవ్ బాబా మరోసారి జనాల్ని దగా చేయాలని చూశారు. కరోనా టైమ్ లో కరోనిల్ అనే మందుని మార్కెట్ లోకి విడుదల చేసి హంగామా చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వ శాఖలే.. అది కరోనా మందు కాదు అని తేల్చేశాక, రామ్ దేవ్ బాబా బండారం మరోసారి బట్టబయలైంది.

బీహార్ కోర్టులో దీనిపై ఓ క్రిమినల్ కేసు కూడా నమోదైంది. స్వదేశీ, సహజసిద్ధమైన ఉత్పత్తులు అనే ముసుగులో రామ్ దేవ్ బాబా, అతని పార్టనర్ బాలకృష్ణ.. పతంజలి ప్రోడక్స్ట్ ని మార్కెట్లోకి తెచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అండతో మరింత రెచ్చిపోయారు. అప్పటికే యోగా పేరుతో పెద్ద పెద్దోళ్లందర్నీ బురిడీ కొట్టించిన రామ్ దేవ్ బాబా.. పతంజలితో వేల కోట్ల సంపద పోగేశారు. వివిధ రాష్ట్రాల్లో రాయితీపై కారు చౌకగా వేల ఎకరాలని భూమినీ స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో పతంజలి దెబ్బకి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ వణికిపోయాయి. సబ్బు బిల్ల దగ్గర్నుంచి, శానిటైజర్ల వరకు.. అన్నిటినీ తయారు చేస్తూ.. అన్ని రకాల కంపెనీలకి ముచ్చెమటలు పట్టించారు రామ్ దేవ్.

పతంజలి ఉత్పత్తుల్లో డొల్లతనాన్ని కొందరు విద్యావంతులు గ్రహించినా.. చాలామంది వాటికే అలవాటు పడ్డారు. కేంద్ర మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలతో కనిపించే రామ్ దేవ్ బాబా.. పతంజలిని ఓ ప్రభుత్వ బ్రాండ్ గా మార్చేశారు. చివరకు కరోనా టైమ్ లో అడ్డంగా బుక్కయ్యారు. గతంలో కూడా క్యాన్సర్, ఎయిడ్స్, కిడ్నీ-లివర్ సంబంధిత వ్యాధులకు ప్రకృతి ప్రసాదించిన మందులంటూ.. కొన్ని ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తెచ్చిన బాబా.. ఆ తర్వాత అవి కేవలం రోగనిరోధక శక్తి పెంచేవి మాత్రమేనంటూ మాటమార్చారు.

పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిపాలైతే.. వాడింది అల్లోపతి మందులా లేక పతంజలి మందులా.. అంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అప్పట్నుంచీ ఆ బ్రాండ్ వేల్యూ తగ్గుతూ వచ్చింది. ఈ కరోనా టైమ్ లో చేసిన తాజా మోసానికి అది మరింత దిగజారుతోంది.

రోగనిరోధక శక్తి పెంపొందించడం, జలుబు, దగ్గుని తగ్గించేందుకు ఉపయోగపడతాయంటూ ఆయుష్ శాఖ దగ్గర లైసెన్స్ కి దరఖాస్తు చేసుకుని, మరోవైపు కరోనా నివారణ మందులంటూ కరోనిల్ ను మార్కెట్లోకి వదిలారు. వారం రోజుల్లోగా మెరుగైన ఫలితాలు వచ్చాయి, మేం పరీక్షించాం అంటూ బుకాయించారు.

ఇంకా నయం.. బీజేపీకి చెందినవారెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఒకవేళ బీజేపీ నేతలు వచ్చి ఉంటే కచ్చితంగా ఆ పార్టీ ఇరుకున పడేది. అయితే దీని వెనక బీజేపీ నేతలున్నారనే విషయం మాత్రం సుస్పష్టం. ప్రముఖ శాస్త్రవేత్తలే కరోనా ఔషధం కనుక్కోడానికి ఏడాది టైమ్ పడుతుందని చెబుతుంటే.. కరోనా కిట్ అంటూ ఇంత ధైర్యంగా రామ్ దేవ్ మందుల్ని మార్కెట్లోకి తెచ్చాడంటే పెద్దల సపోర్ట్ పుష్కలంగా ఉన్నట్టే.

నిమ్మగడ్డ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు