ఇదేనా నీ రాజకీయం రాములమ్మా!

పదేళ్ల కిందటి సంగతి.. తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తానన్నారు, అసలు రాజకీయం అంటే ఏంటో రుచిచూపిస్తానన్నారు, బంగారు తెలంగాణను తీసుకొస్తానన్నారు. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ రిజల్ట్ తేడా కొట్టిందో అప్పట్నుంచి ముఖం చాటేశారు విజయశాంతి. గత…

పదేళ్ల కిందటి సంగతి.. తెలంగాణ రాజకీయాల్ని శాసిస్తానన్నారు, అసలు రాజకీయం అంటే ఏంటో రుచిచూపిస్తానన్నారు, బంగారు తెలంగాణను తీసుకొస్తానన్నారు. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ రిజల్ట్ తేడా కొట్టిందో అప్పట్నుంచి ముఖం చాటేశారు విజయశాంతి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం తర్వాత.. స్థానిక నాయకులందరూ రాష్ట్ర పార్టీపై పెత్తనం కోసం తంటాలు పడుతుంటే.. విజయశాంతి మాత్రం సైలెంట్ అయిపోయారు.

ఎప్పుడో ఒకసారి సోషల్ మీడియా ద్వారా బైటకొస్తారు, కేసీఆర్ పై సుతిమెత్తని విమర్శలు చేస్తారు. అప్పట్లో ఉన్న పవర్, విగర్.. రెండూ విజయశాంతిలో కనిపించడంలేదు. అసలు రాములమ్మ రాజకీయ ప్రస్థానం తీసుకుంటే.. తొలి నుంచీ ఆమె సీరియస్ పొలిటీషియన్ అనిపించలేదు.

కెరీర్ ప్రారంభంలో బీజేపీ నేతగా క్రేజ్ తెచ్చుకున్నారు, ఆ తర్వాత తమిళ పాలిటిక్స్ లో అడుగు పెట్టాలనుకున్నా, కొన్ని కారణాల వల్ల మకాం తెలంగాణకు మార్చి తల్లి తెలంగాణ పార్టీతో కొన్నాళ్లు హడావిడి చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తో కలసిపోయి కేసీఆర్ కి సమాన హోదాలో కనిపిస్తూ తెలంగాణ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు విజయశాంతి.

అంతే.. పొలిటికల్ గా విజయశాంతి ఉచ్ఛస్థితి అదే. ఆ తర్వాత క్రమక్రమంగా ఆమె ప్రభ మసకబారుతూ వచ్చింది. టీఆర్ఎస్ లో అవమానాలతో ఉండలేక బైటకొచ్చి కాంగ్రెస్ లో చేరి అక్కడా పట్టు కోసం ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ మార్క్ రాజకీయాల ముందు నిలవలేకపోయారు. తొలి తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయాక, పూర్తిగా ఇంటికే పరిమితమై.. మళ్లీ రెండో సారి ఎన్నికలప్పుడు మాత్రమే బైటకొచ్చారు. స్టార్ క్యాంపెయినర్ గా హడావిడి చేశారు.

మళ్లీ పార్టీ ఓడిపోవడం, భవిష్యత్ లో గెలిచే అవకాశాలు లేకపోవడంతో సొంతగూటికి అంటే బీజేపీకి వెళ్లే ప్రయత్నాలు చేశారని టాక్. ఏమైందో ఏమో.. ఎటూ వెళ్లకుండా ఇంటికే పరిమితమై ఈ గ్యాప్ లో మహేష్ బాబు సినిమాలో నటించారు విజయశాంతి.

ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ కి పోటీ మేమంటే మేమంటూ కాంగ్రెస్, బీజేపీ ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఇలాంటి సమయంలో విజయశాంతి కనీసం బైటకి రావడం మానేశారు. ఫార్మాలిటీకైనా ప్రెస్ మీట్లకు హాజరు కావడంలేదు. చివరికి కరోనా కష్టకాలంలో కూడా బైటకొచ్చి ప్రజల్ని పలకరించిన దాఖలాలు లేవు. ఎప్పుడూ సోషల్ మీడియాలోనే కామెంట్స్ పెడుతున్నారు.

చివరికి పరిస్థితి ఎందాకా వచ్చిందంటే.. తమ ఆదేశాల ప్రకారం, కరోనా సహాయక చర్యల్లో పాల్గొనకుండా, ఇంట్లోనే కూర్చున్న నేతలపై వేటు వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ లిస్ట్ లో విజయశాంతి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. మొత్తమ్మీద కాంగ్రెస్ లో విజయశాంతి పొలిటికల్ కెరీర్ అవసాన దశలో ఉందని మాత్రం అర్థమవుతోంది. రాములమ్మ నెక్స్ట్ స్టెప్ ఎటో చూడాలి. 

నిమ్మగడ్డ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు

పార్టీని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అనలేదు