లైగర్ సినిమా ఆర్థిక వివాదాలు చినికి చినికి గాలివానగా మారుతున్నాయి. దర్శకుడు, ఆ సినిమా నిర్మాణ భాగస్వామి పూరి జగన్నాధ్ ఈ విషయంలో పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనను ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నారని అంటూ, ఫైనాన్షియర్ శొభన్, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుల పేర్లను పూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను ప్రస్తుతం ముంబాయిలో వుంటున్నానని, హైదరాబాద్ లోని తన ఇంట్లో వృద్ధురాలైన అత్తగారు, తన భార్య, కుమార్తె మాత్రమే వున్నారని, వరంగల్ శ్రీను, శోభన్ తన ఇంటి మీదకు దాడి చేస్తారని భయంగా వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు పోగు చేసి, వాట్సాప్ ల్లో తన ఇంటి మీదకు దాడి చేసేలా ప్రోత్సహిస్తున్నారని పూరి వివరించారు.
వాస్తవానికి వరంగల్ శ్రీను అగ్రిమెంట్ ను అమలు చేయడంలో విఫలమయ్యారని పూరి జగన్నాధ్ వివరించారు. లైగర్ సినిమాను అనుకున్న మొత్తానికి వరంగల్ శ్రీను కొనలేకపోయారు. దాంతో కొన్ని ఏరియాలను పూరి కనెక్ట్స్ సంస్థ వేరే పార్టీకి అమ్మేసారు. ఆ పార్టీ తిరిగి శోభన్ కు విక్రయించారు. దాంతో శోభన్ దగ్గర కొన్న వారంతా ఆయన వెంట పడుతున్నారు.
వరంగల్ శ్రీనుకు అడ్వాన్స్ లు ఇచ్చిన సునీల్, దిల్ రాజు లు తమ మొత్తాలు ఎలా రికవరీ చేసుకోవాలా అని చూస్తున్నారు. ఇలా లైగర్ లెక్కలు గజిబిజి అయిపోయాయి.