బుల్లితెరపై కూడా వీళ్లు జాతిరత్నాలే!

కరోనా తర్వాత, మారిన పరిస్థితుల మధ్య థియేటర్లలోకి వచ్చిన జాతిరత్నాలు సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ కు ఊపు తెచ్చిన సినిమా కూడా ఇదే. ఇలా సూపర్…

కరోనా తర్వాత, మారిన పరిస్థితుల మధ్య థియేటర్లలోకి వచ్చిన జాతిరత్నాలు సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. కళ్లుచెదిరే వసూళ్లు సాధించింది. ఓవర్సీస్ మార్కెట్ కు ఊపు తెచ్చిన సినిమా కూడా ఇదే. ఇలా సూపర్ హిట్టయిన ఈ సినిమా, బుల్లితెరపై కూడా తన ప్రభంజనం చాటింది.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ఫస్ట్ టైమ్ ప్రసారం చేసిన ఈ సినిమాకు ఏకంగా 10.15 టీఆర్పీ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాది టాప్-5 రేటింగ్స్ లో జాతిరత్నాలు కూడా చేరిపోయింది. అలా సిల్వర్ స్క్రీన్ తో పాటు.. స్మాల్ స్క్రీన్ పై కూడా హిట్టయింది ఈ సినిమా.

నిజానికి జాతిరత్నాలు సినిమా బుల్లితెరపై పెద్దగా ఆడదని అంతా అనుకున్నారు. దీనికి ఓ రీజన్ ఉంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తొందరగానే ఓటీటీలోకి వచ్చింది. అయితే ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. 

అనుకున్న స్థాయిలో నంబర్స్ లేదా వ్యూయర్ షిప్ రాలేదు. దీంతో టీవీల్లో కూడా ఈ సినిమా ఫెయిల్ అవుతుందని భావించారు. కానీ జాతిరత్నాలు మాత్రం టీఆర్పీలో 10 మార్క్ అందుకొని టీవీల్లో కూడా హిట్ అనిపించుకుంది.

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హీరోలుగా నటించిన ఈ సినిమాను 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా.. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అనుదీప్ ఈ సినిమాకు డైరక్టర్.