టీడీపీకి మరో నేత గుడ్ బై?

టీడీపీ మునిగిపోతున్న నావ. దానిలోనుంచి ఒక్కొక్కరే బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది తాము వెళ్లిపోతున్నామంటూ బాహాటంగా ప్రకటింంచి మరీ తమదారి తాము చూసుకుంటున్నారు. మరికొంతమంది సైలెంట్ గా పక్కనోళ్లకి కూడా తెలియకుండా కాలు బయటపెడుతున్నారు.  Advertisement…

టీడీపీ మునిగిపోతున్న నావ. దానిలోనుంచి ఒక్కొక్కరే బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది తాము వెళ్లిపోతున్నామంటూ బాహాటంగా ప్రకటింంచి మరీ తమదారి తాము చూసుకుంటున్నారు. మరికొంతమంది సైలెంట్ గా పక్కనోళ్లకి కూడా తెలియకుండా కాలు బయటపెడుతున్నారు. 

బుచ్చయ్య చౌదరి లాంటి నేతలు పార్టీని వీడుతామంటూ వార్నింగ్ లు ఇస్తూ దాన్ని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు మురళీమోహన్ లాంటి వారు ఎలాంటి చడీచప్పుడు లేకుండా పార్టీని వీడుతున్నారు. బంధనాలు తెంచుకుంటున్నారు.

గతంలో ఓ రేంజ్ లో చక్రం తిప్పిన సీనియర్ పొలిటీషియన్ మురళీమోహన్, ఇప్పుడు మెల్లగా టీడీపీకి దూరం జరుగుతున్నారు. ఆ మాటకొస్తే, తనకు ఇక రాజకీయాలు వద్దు అంటున్నారాయన. నిజానికి ఇది నైరాశ్యం కాదు, తలుపులు మూసుకుపోవడం వల్ల తన్నుకొచ్చిన వేదాంతం.

టీడీపీలో ఉంటే అధోగతే..

మురళీమోహన్ రాజకీయ నాయకుడే కాదు, ఆయనో మంచి వ్యాపారవేత్త. అలాంటి వ్యాపారస్తులు ఏది ఎప్పుడు లాభసాటిగా ఉంటుందో అదే చేస్తారు, తాము చేసే ప్రతి పనికీ లాభనష్టాలు బేరీజు వేసుకుంటారు. అందుకే ఇప్పుడు టీడీపీలో ఉండటం తనకి కానీ తన కుటుంబానికి కానీ ఏమాత్రం ఉపయోగం లేదని డిసైడ్ అయ్యారు మురళీమోహన్. 

గత ఎన్నికల్లో కోడల్ని బరిలో దించారు, గెలిపించుకోలేకపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి అమరావతిలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు.. అవన్నీ ఎక్కడికక్కడ ఫ్రీజ్ అయిపోయాయి. అమరావతిలో భూములు లాభానికి అమ్ముకోలేరు, అలాగని నష్టానికి వదిలించుకోలేరు. పాపం చంద్రబాబుది, ఫలితం మురళీమోహన్ వంటి నేతలది.

వయోభారం సాకుతో.. వానప్రస్థం..

మురళీమోహన్ కు వయసు మీదపడుతోంది. ఇలాంటి టైమ్ లో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం చాలా కష్టం. ఒకవేళ ఉండాలనుకున్నా ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారంటే బాగా కష్టం. 

అందులోనూ జగన్ టార్గెట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు కాబట్టే, ఇలాంటి టైమ్ లో జగన్ ను కెలక్కుండా ఉండడమే మంచిదని డిసైడ్ అయ్యారు. అందుకే రాజమండ్రి నుంచి బిచానా ఎత్తేసి, హైదరాబాద్ వచ్చేశారు. తను లోకల్ అని చెప్పుకునేందుకు రాజమండ్రిలో కట్టుకున్న ఇంటిని సైతం ఆయన అమ్మేశారని టాక్.

మురళీమోహన్ బాటలో ఇంకెందరు..?

చంద్రబాబు కూడా మురళీమోహన్ కి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఈ సీనియర్ నటుడు కమ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సైలెంట్ గా టీడీపీ నుంచి తప్పుకున్నారు. వయసు మీదపడిపోవడం ఒక కారణం, తమ వారసులను టీడీపీ గుర్తించకపోవడం మరో కారణం. 

మురళీమోహన్ లాంటి పరిస్థితి ఇంకా చాలామందికి ఉంది. వారంతా సైలెంట్ గా టీడీపీ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఉన్న స్నేహం కారణంగా చంద్రబాబుపై నిందలు వేయలేక, తమని తాము నిందించుకుంటూ బయటకెళ్తున్నారు.