జనసేనాని పవన్‌కల్యాణ్‌తో పొత్తు వుంటుందని బీజేపీ పైకి ఎన్ని మాటలు చెప్పినా, లోలోపల మాత్రం అనుమానం వుంది. తమతో అధికారికంగా పొత్తులో వుంటూ, టీడీపీతో లోపాయికారి ఒప్పందాన్ని పవన్‌కల్యాణ్ కుదుర్చుకున్నారని బీజేపీ గుర్రుగా వుంది. ఏపీలో పాగా వేయాలని బీజేపీ కలలు కంటోంది. అయితే ఆ పార్టీకి అందర్నీ ఆకట్టుకునే ఒక ఫేస్ కరువైంది. అందువల్లే హీరో పవన్‌కల్యాణ్ తోక పట్టుకుని బీజేపీ వేలాడుతోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
పవన్‌కల్యాణ్ తమను కాదని టీడీపీ వెంట నడిస్తే ఏం చేయాలనే అంశంపై బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అందుకే పవన్‌కల్యాణ్‌పై వైసీపీ విమర్శలపై బీజేపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. పవన్‌ను చంద్రబాబు కలిసిన తర్వాత బీజేపీ స్వరంలో చిన్నచిన్నగా మార్పు చోటు చేసుకుంటోంది. ఇక పవన్ తమ వెంట నడవరనే నిర్ణయానికి బీజేపీ దాదాపు వచ్చినట్టుగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్‌ను అనవసరంగా “ఓన్” చేసుకోవడం ఎందుకనే అభిప్రాయం బీజేపీలో ఉంది. పవన్‌పై బీజేపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏదో మొహమాటానికి అన్నట్టు పవన్‌ను ఒకరిద్దరు నేతలు సమర్థిస్తున్నారు. అనంతపురం పర్యటనలో బుధవారం మీడియా సమావేశంలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందన చూస్తే… పవన్‌పై ఏదో పక్కా వ్యూహంతోనే నడుచుకుంటున్నారనే అభిప్రాయం కలుగుతోంది.
పవన్‌కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై తమ పార్టీ మాట్లాడబోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అలాగే కార్యకర్తల సమావేశంలో పవన్‌కల్యాణ్ చెప్పు చూపిస్తూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై అభ్యంతరకర భాషను వాడడంపై కూడా కూచుని మాట్లాడుకుంటామని ఆయన చెప్పడం గమనార్హం. అలాగే కన్నా లక్ష్మినారాయణ తనపై విమర్శలు చేయడంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా… తాను మాట్లాడనని స్పష్టం చేశారు.
బీజేపీలో ఒక పెళ్లికి నోచుకోని ప్రముఖ నాయకులున్నారు. పెళ్లయి కూడా కుటుంబానికి దూరంగా ఉన్న బీజేపీ ముఖ్య నేతల గురించి అందరికీ తెలుసు. అలాంటిది మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడం, అలాగే భార్యతో కలిసి వుంటూ, మరో మహిళతో వివాహేతర సంబంధాలు కొనసాగించడానికి సిద్ధాంత రీత్యా బీజేపీ వ్యతిరేకం. పవన్ చెప్పు తీసుకొని, దూషణకు దిగడంపై కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్టు, సోము వీర్రాజు మౌనం తెలియజేస్తోంది.
భవిష్యత్‌లో పవన్ తమకు ప్రత్యర్థిగా మారితే… ఇలాంటి వాటిని ఆయనపై అస్త్రాలుగా ప్రయోగించే ఉద్దేశంతోనే బీజేపీ మౌనాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. పవన్‌కు నైతిక విలువలు లేవని, మహిళలపై గౌరవం ఏ మాత్రం లేదని, హిందూ సంప్రదాయాలంటే లెక్కే లేదని, అలాగే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడ్తారని, అవన్నీ తమ దగ్గర వర్కౌట్ కావనే ఉద్దేశంతోనే చంద్రబాబు పంచన చేరారని రాజకీయ దాడి చేయడానికి బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
ఇవేవీ కారణాలు కాకపోతే, పవన్ తప్పు చేయలేదని సోము వీర్రాజు ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. అసలే బీజేపీ. ఆపై కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. పవన్ అంతు చూడాలని అనుకుంటే ఆ పార్టీకి నిమిషంలో పని అని రాజకీయ వర్గాల అభిప్రాయం.