ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోడి కత్తి శీను కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. తమపై దయ చూపాలని సీఎంను వేడుకున్నారు. సీఎం స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్‌పై శీను అనే యువకుడు కోడికత్తితో హత్యాయత్నం చేశాడు.
ఈ ఘటనలో తృటిలో జగన్ తప్పించుకున్నారు. భుజానికి గాయమైన జగన్, అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లి ఆస్ప త్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. ఈ ఘటనలో నిందితుడైన శీను రిమాండ్ ఖైదీగా జైల్లో గడుపుతున్నాడు. మరోవైపు తమ కుమారుడికి బెయిల్ ఇవ్వాలని తల్లిదండ్రులు వేడుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్‌ను కోడి కత్తి శీను తల్లిదండ్రులు కలుసుకున్నారు. నిరభ్యంతర సర్టిఫికెట్ ఇచ్చి తమ కుమారుడి బెయిల్‌కు మార్గం సుగుమం చేయాలని సీఎంను వారు వేడుకున్నారు. వృద్ధాప్యంతో బాధపడు తున్నామని, కుమారుడే పోషించాల్సి వుందని, దయ చూపాలని జగన్‌ను వారు అభ్యర్థించారు. ఈ మేరకు సీఎంకు వినతిపత్రం సమర్పించారు.
తనపై కోడికత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి తల్లిదండ్రులకు జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి సానుకూలంగా వ్యవహరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తనకు వినతిపత్రం ఇచ్చేందుకు వారికి అనుమతి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే శీనుకు బెయిల్ దక్కడం ఖాయం. సీఎం ఎలా స్పందిస్తారో చూడాలి.