మనవాడు ముఖ్యమంత్రికి నమస్కారం పెడితే అది అవమానం. అదే పక్క రాష్ట్రంవాడు మరో ముఖ్యమంత్రికి కాళ్లు మొక్కితే పెడితే పద్ధతి.
చిరంజీవి జగన్ మోహన్ రెడ్డికి చేతులు జోడించి దండం పెడితే అది ముఖ్యమంత్రి ఏకంగా మెగాస్టార్ ని అవమానించేసినట్టు. అదే రజినీకాంత్ యూపీ సిఎం కాళ్లకి దండం పెట్టాడని ఆయన అభిమానులు అవమానంగా ఫీలౌతుంటే దానిని పెద్దమనసుతో అర్ధం చేసుకోవాలంటూ సూక్తులు.
సోషల్ మీడియాలో కొందరు రజినీకాంత్ చర్యని ఒక మతపెద్దకి పెట్టిన దండంగా అర్ధం చేసుకోమని సూక్తులు చెప్తున్నారు. దానికి అదే వర్గానికి చెందిన కొందరు బాగా చెప్పారంటూ కితాబిస్తున్నారు. మధ్యలో మరొకడు “అరవవాళ్లు అంతేలే..అతిగాళ్లు” అంటూ కామెంటు పెడతాడు. మరి చిరంజీవి జగన్ మోహన్ రెడ్డికి చేసిన నమస్కారం విషయంలో వీళ్లకి తమ వర్గం వాళ్లు చేసిన “అతి” గుర్తురాలేదా!
యోగి ఆదిత్యనాథ్ కి పాదనమస్కారం చేసినందుకు అభిమానులు, తమిళులు రజినీని తిట్టిపోస్తుంటే ఆయనకి మద్దతుగా మన తెలుగుజాతిలోని ఇలాంటి మేథావి వర్గం ఒకటి బయలుదేరింది. వీళ్లెవ్వరూ అప్పట్లో చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ కి నమస్కారం పెట్టడంలో తప్పేంటని అడిగిన పాపానికి పోలేదు.
చిరంజీవి జగన్ మోహన్ రెడ్డి కుర్చీకి ఇచ్చిన గౌరవమే తప్ప అదేమీ అంత అవమానకరమైన పని కాదని ఎవ్వడూ చెప్పలేదు.
షారుఖ్ ఖాన్ లాంటి జాతీయ స్థాయి నటుడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళ్లకి దండం పెట్టాడు. ఆ ఫోటో ఇప్పటికీ నెట్లో కొడితే కనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నటుడైన చిరంజీవి జగన్ కి కేవలం నమస్కారం పెడితే తప్పేంటో.
అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా తన అవివేకాన్ని, కుళ్లుని బయటపెట్టుకుని చిరంజీవి చేత జగన్ దండం పెట్టించుకున్నాడని ఊగిపోయాడు. కనీసం చిరంజీవి అయినా అది తాను కుర్చీకి ఇచ్చిన గౌరవంగా పరిగణించమని పబ్లిక్ గా ఎందుకు చెప్పలేదో! తన తమ్ముడితో సహా అందరూ ముఖ్యమంత్రిని పొగరుబోతని తిడుతుంటే మౌనంగా కూర్చుని ఎంజాయ్ చేసిన మెగానుభావుడు చిరంజీవి.
ఒక వర్గానికి తలమానికంగా ఉన్న ఇలాంటి స్థాయి నటులు, రాజకీయ నాయకులు హుందాతనం వదిలి ఇలా తమలోని కుళ్లుని బయటపెట్టడం ద్వారా అది తమ జాతిలక్షణంగా ప్రపంచానికి చాటేవారవుతారని తెలుసుకోవాలి. ఆ ప్రమాదం ఉంది కనుక పబ్లిక్ గా ఏం మాట్లాడాలి, ఎలా స్పందించాలి, ఎంత వరకూ స్పందించాలి అనేవి తెలుసుకోవాలి.
పవన్ కళ్యాణ్ ఆ విషయంలో జగన్ ని తప్పుబట్టడం ఎంత అవివేకమో, చిరంజీవి తన చర్యని సమర్ధించుకోకపఓవడం కూడా అంతే మూర్ఖత్వం.
ఏ రకంగా చూసుకున్నా చిరంజీవి కంటే రజినీకాంత్ రేంజ్ చాలా పెద్దది. అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి అభిమానులున్నారు. జాతీయస్థాయిలో కూడా పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే స్టేటస్ తనది.
రాజకీయాలు తనకి సరికావని అసలు ఆ వైపు అడుగేపెట్టకుండా తన పని తాను చేసుకుపోతున్న స్థాయి రజినీది. ఏదో ఊహించుకుని రాజకీయాల్లోకి దూకి భంగపడి, తల్లిలాంటి పార్టీని కాంగ్రెసుకి అమ్మేసిన వ్యక్తి చిరంజీవి.
తెర మీద తప్ప బయట విగ్గు కూడా పెట్టుకోకుండా, మేకప్పులేకుండా ఒక నిఖార్సైన యోగిలా బతికే మర్యాదస్తుడైన వినయశీలి రజినీ. కూతురువయసున్న హీరోయిన్స్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా మాస్ చేష్టలు చేస్తూ తన హుందాతనాన్ని తగ్గించుకుంటున్న నటుడు చిరంజీవి.
ఇలా కంపేర్ చేయడం కొందరికి నచ్చకపోవచ్చు. చిరంజీవి అభిమానిగా నేనే చెబుతున్నాను. ఆయన కేవలం నటుడే కాదు కచ్ఛితంగా గొప్పవాడే. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ప్రజాసేవ చేస్తున్నవాడే.
కానీ తనని ఎవడో స్టేజెక్కి పొగుడుతున్నప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేయడం, తనకు వత్తాసు పలుకుతూ జగన్ మోహన్ రెడ్డినో, గరికిపాటి నరసింహారావునో తన అభిమానులు బూతులు తిడుతుంటే మాటవరసకైనా ఖండించకుండా మౌనం వహించడం…లాంటి చేష్టల ద్వారా ఎప్పటికప్పుడు తన గౌరవానికి తానే భస్మాసురుడౌతున్నాడు.
అదలా ఉంచితే ఇక్కడ చెప్పేది ఒక్కటే. రజినీకాంత్ యూపీ ముఖ్యమంత్రికి, షారుఖ్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రికి పాదనమస్కారం చేసినప్పుడు చిరంజీవి ఆంధ్ర ముఖ్యమంత్రికి చేతులు జోడించి దండం పెట్టడం ఏ మాత్రం చిన్నతనం కాదు.
ఈ విషయాన్ని ఇప్పుడు రజినీకాంత్ చర్యని సమర్ధిస్తున్న కుహనా మేథావులు, పవన్ కళ్యాణ్, నాగబాబు, మెగాభిమానులతో పాటూ చిరంజీవి కూడా బుర్రకెక్కించుకోవాలి.
– హరగోపాల్ సూరపనేని