బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో విడుదలకు రంగం సిద్దమైంది. మరో వారంరోజుల్లో సినిమా జనం ముందుకు రాబోతోంది. సరైన సినిమా లేక దాదాపు నెల రోజులుగా సినిమా ప్రియులు ఎదురుచూస్తున్న టైమ్ లో సాహో వస్తోంది. దాదాపు వీలయినన్ని ఎక్కువ థియేటర్లలో సాహో ప్రదర్శించబోతున్నారు. అదేవిధంగా ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇదికాక యూనిఫామ్ టికెట్ ప్రైస్, టికెట్ హైక్ కూడా వుంది.
ఇవన్నీ కలిసి సాహోకి మంచి ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తోంది. బాహుబలి వన్ ఫస్ట్ డే ఓపెనింగ్ అద్భుతం ఏమీకాదు. కానీ బాహుబలి 2 ఓపెనింగ్ మాత్రం అద్భుతమే, వరల్డ్ వైడ్ గా దాదాపు 120 కోట్ల మేరకు వసూలు చేసింది. వీటిలో ఫిక్స్ డ్ హైర్ లు, మినిమమ్ గ్యారంటీ లాంటి వ్యవహారాలు కూడా కలిసి వుంటాయి. అది కామన్.
సాహో విషయానికి వస్తే, తొలినాడు బాహుబలి 2 రికార్డును దాటుతుందా లేదా అన్నది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే తొలిరోజు యాభై కోట్లు తెచ్చుకుని, బాహుబలి 2 రికార్డు (సుమారు 43 కోట్లు)ను బద్దలు కొడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో, అలాగే హిందీ వెర్షన్ ఏ మేరకు వసూలు చేస్తుంది అన్నదాన్ని బట్టి వరల్డ్ వైడ్ రికార్డు ఆధారపడి వుంటుంది. బాహుబలి 2 విడుదల నాటికి ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ వేరు. ఆ హడావుడి వేరు. ఎటువంటి ప్రచారం పెద్దగా చేయకుండానే పార్ట్ వన్ ఇచ్చిన కిక్ తో పార్ట్ 2 కు విపరీతమైన బజ్ వచ్చింది.
అందువల్ల నార్త్ లో దాదాపు నలభై కోట్ల ఓపెనింగ్ వచ్చింది. మరి ఆ మేరకు సాహోకి కూడా వస్తుందా? రాదా? అన్నది చూడాలి. అదేవిధంగా వస్తే మాత్రం, కచ్చితంగా బాహుబలి 2 ఓపెనింగ్ రికార్డును తిరగరాయడం పక్కా.