సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకననీ(సీఎంఐఏ) ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని చెబుతూ ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పరిణామాలను అంచనా వేసే ఈ సంస్థ.. దేశంలో లాక్ డౌన్ పూర్వపు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అంటోంది. లాక్ డౌన్ భారత ఆర్థిక వ్యవస్థను ఎంతలా దెబ్బతీసిందో వేరే వివరించనక్కర్లేదు. ప్రత్యేకించి మధ్యతరగతి-దిగువ మధ్యతరగతి కుటుంబాలనూ, చిన్న స్థాయి ఉద్యోగాలను చేసుకునే వాళ్లను లాక్ డౌన్ పరిణామాలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. చిన్న చిన్న పరిశ్రమలు మూతపడటం, మార్కెటింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ల అవకాశాలూ దెబ్బతినడాన్ని గమనించవచ్చు. ప్రత్యేకించి నగరాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్లూ, చిన్న చిన్న పట్టణాల్లో చిన్న సైజు జాబ్స్ చేసుకునే వాళ్ల పై లాక్ డౌన్ తీవ్రంగా ప్రభావం చూపించింది. వాళ్ల ఉద్యోగాలు ఉన్నా లేనట్టే అనే పరిస్థితి తలెత్తింది. ఇక వలస కార్మికుల కష్టాల గురించి చెప్పనక్కర్లేదు.
ఇలా కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు కరోనా నివారణకు విధించిన లాక్ డౌన్ తో. ఈ క్రమంలో దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగిందని సీఎంఐఏ కూడా ఒప్పుకుంటోంది. లాక్ డౌన్ కు పూర్వం ఇండియాలో నిరుద్యోగ రేటు 8.5 శాతం వరకూ ఉండేదని, లాక్ డౌన్ విధించడంతో అది ఏకంగా 40 శాతం వరకూ రీచ్ అయ్యిందని ఈ సంస్థ చెబుతోంది. నగరాల్లో, పట్టణాల్లో భారీగా నిరుద్యోగిత పెరిగిన వైనాన్ని ఆ శాతంతో చెబుతోంది. మే నెలలో అలాంటి పరిస్థితి నెలకొందని వివరించింది. జిల్లా స్థాయి పట్టణాల్లో నిరుద్యోగిత ఆ స్థాయికి చేరిందట. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చేసిందని ఆ సంస్థ చెబుతోంది.
జూన్ మూడో వారానికి నిరుద్యోగ రేటు నగరాల్లో 8 శాతానికి చేరుకుందని, ఒక దశలో 27 శాతం ఉండిన నిరుద్యోగ రేటు ఇప్పుడు ఎనిమిది శాతానికి చేరుకుందని ఈ సంస్థ చెబుతోంది. అంటే లాక్ డౌన్ పూర్వంలా నగరాల్లో మళ్లీ ఎవరి పని వారు చేసుకుంటున్నట్టుగా ఈ సంస్థ చెబుతోంది. జిల్లా స్థాయిల్లో మాత్రం ఇంకా పరిస్థితి మరింత మెరుగు కావాల్సిందని 11 శాతం వరకూ అక్కడ నిరుద్యోగులున్నారని ఈ సంస్థ చెబుతోంది!
లాక్ డౌన్ పూర్వ పరిస్థితులు ఏర్పడిపోయాయని ఈ సంస్థ నంబర్లతో బాగానే చెబుతోంది కానీ ఇది నమ్మశక్యంగానే ఉందా? ఇంకా అనేక రకాల పరిశ్రమలు పూర్వపు స్థాయిలో పట్టాలెక్కినట్టుగా కనిపించడం లేదు. అయితే ఈ సంస్థ మాత్రం అంతా పూర్వపు స్థితికి వచ్చేసిందని అంటోంది!