తెలుగులో ఓ సామెత ఉంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అంటారు. అంటే జీవితంలో పరిస్థితి ఎప్పుడూ ఒక్కలాగే ఉండదని అర్ధం. కరోనా మహమ్మారి ఎడమ కాలు పెట్టినప్పటినుంచి దేశవ్యాప్తంగా సినిమా రంగం పరిస్థితి కుడితిలో పడిన ఎలుక మాదిరిగా తయారైంది. ఇందుకు మన తెలుగు సినిమా రంగం కూడా మినహాయింపు కాదు.
ఆర్ధికంగా బాగా ఉన్న నటీనటులు ఎండాకాలంలోనూ చెట్లు పచ్చగా ఉన్నట్లు ఇబ్బందులు లేకుండా ఉన్నారుగాని చిన్నా చితక నటీనటులు, సాంకేతిక నిపుణులు బతకలేక బతుకుతున్నారు. సరే… సినిమా రంగం నుంచి, ప్రభుత్వం నుంచి ఎంతోకొంత సాయం అందిందనుకోండి. అది వేరే విషయం.
టీవీ సీరియల్స్ లో నటించేవారి పరిస్థితి, ఆ రంగంలోని సాంకేతిక నిపుణుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కొంతకాలం కిందట తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజాలు కొందరు పాలకులను కలిసి సినిమా, టీవీ షూటింగులు జరుపుకోవడానికి అనుమతి అడిగారు కదా. సరే … షూటింగులు జరుపుకోండి. కానీ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అలా అయితేనే షూటింగులకు అనుమతి ఇస్తాం అన్నారు పాలకులు.
సరే మీరు చెప్పినట్లుగానే చేస్తామని సినిమా దిగ్గజాలు మాట ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించడమంటే … మాస్కులు కట్టుకోవడం. శానిటైజరుతో చేతులు కడుక్కోవడం, షూటింగులో వాడే ప్రతి పరికరాన్ని, యంత్రాలను శానిటైజ్ చేయడం, భౌతిక దూరం అనబడే ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం వగైరా అన్నమాట. టెక్నీషియన్లు యేవో నానా తంటాలు పడి కరోనా నిబంధనలు పాటిస్తారని అనుకుందాం. ఎందుకంటే వారంతా తెరమీద కనిపించరు కాబట్టి. కానీ తెర మీద కనబడే నటీ నటులు కరోనా నిబంధనలు ఎలా పాటిస్తారు?
సినిమాలో రకరకాల సన్నివేశాలు ఉంటాయి. ఫైట్స్ ఉంటాయి, డ్యాన్సులు, పాటలు ఉంటాయి. గుంపుగా పాల్గొనే సన్నివేశాలు ఉంటాయి. హీరో హీరోయిన్లు పాటల్లోనో, ఏదైనా సన్నివేశంలోనో ఒకరినొకరు కౌగిలించుకోవాలి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? ఇదసలు ఊహకు కూడా అందడంలేదు. కార్టూన్ పాత్రలతో సినిమాలనుకోండి, సినిమా అంతా గ్ర్రాఫిక్సే అనుకోండి, ఎన్ని కరోనా నిబంధనలున్నా ఏమీ కాదు
కానీ ఒక కథా చిత్రం నటీనటులతో తీస్తున్నప్పుడు అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. అనేక సన్నివేశాలుంటాయి. దానికి తగ్గట్లు నటించాల్సి ఉంటుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ నటించారని అనుకుందాం. నిజంగా అది సినిమాలా ఉంటుందా ? రాజమౌళి వంటి మేధావులైన దర్శకులు ఉన్నారు కాబట్టి తమ టెక్నాలజీ బుర్రలు ఉపయోగించి మాయలు చేస్తారేమో చెప్పలేం. సినిమా దిగ్గజాలు ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చాక ప్రభుత్వం క్రమంగా లాక్ డౌన్ నిబంధనలు సడలించడం, దీంతో తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోవడం జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.
మళ్ళీ సెకండ్ వేవ్ మొదలైందని చెప్పొచ్చు. షూటింగులకు అనుమతి ఇచ్చారు కదా అని కొన్ని టీవీ సీరియల్స్ షూటింగులు మొదలు పెట్టారు. చాల్లే సంబడం అన్న మాదిరిగా ఓ ప్రముఖ టీవీ చానెల్లో ప్రసారమవుతున్న సీరియల్లో నటించే నటుడికి షూటింగ్ మొదలు పెట్టగానే కరోనా వచ్చింది. పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సీరియల్ షూటింగ్ బంద్ పెట్టి ఈ సీరియల్లో నటించేవారినందరినీ క్వారంటైన్ కు తరలించారు అధికారులు.
ఇప్పుడు ఆ నటుడికి ఉన్న కాంటాక్ట్స్ ట్రేస్ చేసే పనిలో పడ్డారు. ఓ సీరియల్ షూటింగుకే ఇలా అయినప్పుడు భారీ సినిమాల షూటింగులు ఎలా జరపగలరు. నటీ నటులు టెక్నీషియన్లు ఎక్కడెక్కడినుంచో వస్తారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచన్న మాట. నటీమణులైతే అంటే హీరోయిన్లన్నమాట వారు ఒకేసారి రెండు మూడు భాషల సినిమాల్లో నటిస్తుంటారు. ఈరోజు హైదరాబాదులో ఉంటే రేపు చెన్నైలో ఉంటారు. ఎల్లుండి ముంబయిలో ఉంటారు. సినిమా షూటింగ్ అంటే వందలమందితో పని కాబట్టి కరోనా ప్రమాదం ఎప్పుడో ఒకప్పుడు ముంచుకురాదనే గ్యారంటీ ఉందా?