ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు కాపురం కూడా బాగానే చేశారు. కానీ అంతలోనే మనస్పర్థలు వచ్చాయి. సర్దిచెప్పాల్సిన బంధువులు దగ్గరగా లేకపోవడంతో మానసిక సంఘర్షణకు లోనై భార్య ఆత్మహత్య చేసుకుంది. దీన్ని భరించలేని భర్త కూడా కొన్ని నెలలకు తనువు చాలించాడు. కృష్ణా జిల్లాలో జరిగింది ఈ ఘోరం.
అనూషను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డిప్రెషన్ కు గురైన అనూష.. గతేడాది సెప్టెంబర్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అప్పట్నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు శ్రీకాంత్. భార్యను మరిచిపోవాలని ప్రయత్నించినా అతడికి సాధ్యం కాలేదు. రోజూ ఆమె దుస్తుల్ని పక్కన వేసుకొని పడుకునే వాడు. ఈ క్రమంలో భార్య లేని భవిష్యత్తును ఊహించుకోలేకపోయినా శ్రీకాంత్.. ఆమె రెగ్యులర్ గా వాడే చున్నీతోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
జిల్లాలోని గుడివాడలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నెలల వ్యవథిలో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్యలు చేసుకోవడం చుట్టుపక్కల వాళ్లను కలచివేసింది. ప్రతి చిన్న విషయానికి ఈ కాలం యువత డిప్రెషన్ కు లోనవుతున్నారని.. చిన్న చిన్న గొడవలకు కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నారని, ఈ క్రమంలో శ్రీకాంత్, అనూష లాంటి వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.