మునుగోడు ఉప ఎన్నికలు వేళ తెలంగాణ రాజకీయాల్లో ఎన్నడూ చూడని పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. రాత్రికి రాత్రే ఒక పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వస్తే మరో రాత్రి మరో పార్టీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుగు చూస్తున్నాయి మునుగోడు రాజకీయం మాటల తుటాలతో పాటు పోస్టర్ల రాజకీయం కూడా హాట్ హాట్ గా జరుగుతోంది. ఇందులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ కాస్తా వెనుకబడిపోతోంది.
తాజాగా ఇవాళ టీబీజేపీ అధ్యక్షుడు.. కేసీఆర్ ఇదిగో నీ పచ్చి అబద్దాల చిట్టా అంటూ ‘కేసీఆర్ ఝూఠా మాటలు’ పేరుతో పోస్టర్లను విడుదల చేశారు. ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ మరోసారి పచ్చి అబద్దాలు, తప్పుడు హామిలతో పాటు.. మందు, మనీతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు.
బండి సంజయ్ విడుదల చేసిన పోస్టర్లలో దళితులకు మూడెకరాల భూమి, దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ చెప్పినా హామీ, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తానని చెప్పిన హామీలతో పాటు గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలను పోస్టర్ల రూపంలో ప్రశ్నించారు. ఈ పోస్టర్లను బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
మొత్తానికి ఇవాళ టీబీజేపీ అధ్యక్షుడు పోస్టర్లు విడుదల చేయడంతో రేపు టీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ గతంలో ఇచ్చిన హామీల చిట్టాను బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నిక విజయం అన్ని పార్టీలకు అత్యవసరం ముఖ్యంగా ఈ ఎన్నిక టీఆర్ఎస్-బీజేపీ మధ్యలోనే నడుస్తోంది. బీజేపీ మునుగోడులో గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు. అలాగే అధికార పార్టీ టీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల విజయం సాధిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్నారు.