ఆధార్ ఉన్నవారికి ఆఫర్లే ఆఫర్లు!

అమరావతి రైతులం అని చెప్పుకుంటూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఉండాలనే డిమాండ్‌తో సాగుతూ వచ్చిన పాదయాత్ర ప్రస్తుతానికి ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది వాళ్లు ఇదమిత్థంగా తేల్చి చెప్పలేదు.…

అమరావతి రైతులం అని చెప్పుకుంటూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఉండాలనే డిమాండ్‌తో సాగుతూ వచ్చిన పాదయాత్ర ప్రస్తుతానికి ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది వాళ్లు ఇదమిత్థంగా తేల్చి చెప్పలేదు. పోలీసులు విపరీతమైన ఆంక్షలతో వేధిస్తున్నారని, వారి వేధింపులకు నిరసనగా పాదయాత్ర ఆపివేస్తున్నామని, కోర్టును ఆశ్రయించి.. కోర్టు ఉత్తర్వుల ద్వారా తిరిగి ప్రారంభిస్తాం అని వారు ప్రకటించారు. 

అయితే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలాగా కనిపించడం లేదు. అయితే ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిన ట్విస్టు ఏంటంటే.. అమరావతి 29 గ్రామాల పరిధిలో ఆధార్ కార్డులు ఉన్న రైతులకు, అది కూడా రాజధాని కోసం భూములు ఇచ్చి ఉన్న వారికి ఇప్పుడు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. యాత్ర సాగిస్తున్న వారు.. ఆధార్ ఉన్న ఇతర రైతుల కోసం వేట ప్రారంభించారు. తమతో పాటు వచ్చి పాదయాత్రలో పాల్గొంటేచాలు అంటూ.. వారికి రకరకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. 

అమరావతి పాదయాత్ర ప్రస్తుతం నడుస్తున్నది 2.0 అనుకోవాలి. తొలుత తిరుపతికి వాళ్లు పాదయాత్ర చేశారు. అయితే.. అమరావతిలో భూములిచ్చిన రైతులే పాదయాత్రలో పాల్గొంటున్నారంటూ వాళ్లు తొలినుంచి ఊదరగొడుతున్నారు. అయితే.. అలాంటి వాళ్లు పట్టుమని పదిమంది కూడా ఉండరని, యాత్ర నిండా కిరాయి మనుషులు, తెలుగుదేశం స్పాన్సర్ చేసిన వాళ్లు మాత్రమే ఉంటున్నారని.. వైసీపీ తొలినుంచి ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది.

అయితే.. వైసీపీ ఈ యాత్రను వ్యతిరేకించే పార్టీ గనుక.. వారి ఆరోపణలకు విలువలేకుండాపోయింది. తీరా ఇప్పుడు యాత్రలో పాల్గొంటున్నదంతా నకిలీ రైతులే.. నాటకాల రాయుళ్లే అని తేలిపోయే సరికి యాత్ర తోకముడిచి ఇంటికి పరారైంది. అసలైన రైతుల్ని వెతికిపట్టుకొచ్చే పనిలో పడ్డారు. 

హైకోర్టు 600 మందికి మించకుండా యాత్ర చేయడానికి అనుమతి ఇచ్చింది. కానీ తెలుగుదేశం ఎక్కడికక్కడ కిరాయి మనుషుల్ని తరలిస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. పోలీసులు చాలా కాలం చూసీచూడనట్టు ఊరుకున్నారు గానీ.. పరిస్థితులు ఉద్రిక్తం అవుతున్న కొద్దీ.. శాంతి భద్రతల దృష్ట్యా నిబంధనలు కఠినతరం చేశారు. 

యాత్రలో పాల్గొంటున్న వారిని ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిందిగా అడిగారు. దీంతో యాత్ర చేస్తున్న వారికి కంగారు మొదలైంది. ఆధార్ అడగడమే పాపం అయినట్టుగా.. పోలీసుల్ని నిందించారు. ఆధార్ చూపాల్సి వస్తే.. యాత్రలో పాల్గొంటున్న వాళ్లంతా గరిష్టంంగా కిరాయి మనుషులనే సంగతి దొరికిపోతుందని భయపడ్డారు. ఎవ్వరూ చూపించకపోగా.. పోలీసులు వేధిస్తున్నారంటూ.. యాత్రకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఇంతకంటె బేవార్సు ఉద్యమం వేరే ఏదైనా ఉంటుందా అని ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

అయితే తమ యాత్ర నిజమే అని బిల్డప్ ఇచ్చుకోవడానికి వారికిప్పుడు అసలైన అమరావతి ప్రాంత రైతులు కావాలి. అక్కడివాళ్లకేమో పెద్ద శ్రద్ధ లేదు. అందుకే ఆధార్ కార్డులున్న ఆ ప్రాంత రైతుల్ని ఆశ్రయించి.. రకరకాల ఆఫర్లు పెడుతూ.. యాత్రకు రమ్మని బతిమాలుతున్నట్టుగా వినిపిస్తోంది. ఒక నకిలీ పోరాటాన్ని, కిరాయి యాత్రను నడిపించడానికి తెలుగుదేశం పడుతున్న పాట్లు చూసి జనం నవ్వుకుంటున్నారు.