జనసేనాని పవన్‌కల్యాణ్ ఇటీవల చెప్పు చూపుతూ “కొడ్తా నా కొడుకుల్లారా” అని అనడాన్ని మరిచిపోకనే, టీడీపీ యువ నాయకుడు నారా లోకేశ్ కూడా అదే పంథాలో నడిచారు. చెప్పుతో కొట్టాలనే పిలుపును లోకేశ్ ట్విటర్ వేదికగా ఇవ్వడం గమనార్హం. చెప్పుతో కొట్టాలన్నంత కోపం రావడానికి కారణం ఏంటో చూద్దాం.
TDP for ever అనే ట్విటర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వెలువడింది. అందులో నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంబంధించి పోలిక ఉంది. అగ్రకులాల క్యారెక్టర్లతో తీసిన సినిమాలు హిట్, వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీల క్యారెక్టర్లతో తీసిన సినిమాలు ప్లాప్ అవుతాయనేది ఆ ట్వీట్ పోస్టు సారాంశం. అగ్రకుల క్యారెక్టర్లతో నందమూరి బాలయ్య నటించిన సినిమాలు, అలాగే వెనుకబడిన వర్గాల క్యారెక్టర్లతో నటించిన చిరంజీవి సినిమాలను పేరుపేరునా పోల్చి చూపారు. వీటిలో ఇటీవల టీజర్ విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా ప్రస్తావన కూడా వుండడం గమనార్హం. ఈ సినిమాలో చిరంజీవి హీరో అన్న సంగతి తెలిసిందే.
నందమూరి బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు. స్వయాన లోకేశ్‌కు పిల్లనిచ్చిన మామ కూడా. పవన్‌తో టీడీపీకి పొత్తు దాదాపు ఖరారు అయ్యిందని అనుకుంటున్న తరుణంలో, మెగా అభిమానుల్ని రెచ్చగొట్టేలా ఈ ట్వీట్ వుందని లోకేశ్ భావించారు. ఇది రాజకీయంగా తమకు నష్టం కలిగిస్తుందని లోకేశ్ ఆందోళన చెందారు. దీంతో ఈ ట్వీట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నానన్న మెసేజ్‌ని మెగా అభిమానులకు పంపేందుకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ల గురించి తెలుసుకుందాం.
“ఫేక్ అకౌంట్స్, ఫేక్ ట్వీట్స్ నీకు ఆత్మసంతృప్తిని ఇస్తాయేమో కానీ నిన్ను ఓటమి నుండి తప్పించలేవు జగన్ రెడ్డి!”
“ప్యాలస్ పిల్లి చీప్ ట్రిక్స్..! కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఐప్యాక్ గ్యాంగ్స్, పేటిఎం డాగ్స్ రంగంలోకి దిగాయి తస్మాత్ జాగ్రత్త! కులం, మతం పేరు చెప్పి రాజకీయం చేసే వారిని చెప్పుతో కొట్టండి”
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బూతులు శృతిమించడంతో జనం విసిగిపోతున్నారు. ఇది చాలదన్నట్టు ఒత్తగా చెప్పుల భాషను తెరపైకి తెస్తున్నారు. మొన్న పవన్, నేడు లోకేశ్. చెప్పుతో కొట్టాలనడం ఎలాంటి సంప్రదాయమో వారే ఆలోచించాలి. ప్రత్యర్థులు కూడా అదే భాషను ఉపయోగిస్తే… రానున్న కాలంలో ఇలాంటివి ఇంకెన్ని భరించాల్సి వస్తుందో అనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.